TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
టీఎస్పీఎస్సీ ఇవాళ జరిగిన కీలక భేటీలో.. కీలక నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలువుల జాతర పేరుతో.. ఈ మధ్యకాలంలో మొత్తం వివిధ రకాల పరీక్షలకు సంబంధించి 26 నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడం, ఆపై సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండడంతో.. ఇప్పుడు కొన్ని పరీక్షలను రద్దు చేస్తూనే, దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
➤☛ TSPSC New Exam Dates 2023 : గ్రూప్-1, ఏఈ పరీక్ష కొత్త తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..
ఈ 20 పరీక్షలకు సంబంధించి..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 20 పరీక్షలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. వీలైతే ఈ 20 పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే ఏడు పరీక్షలు జరగ్గా.. వాటి పేపర్లు మొత్తం! లీక్ అయినట్లు సిట్ దర్యాప్తు నివేదిక ద్వారా దాదాపుగా నిర్ధారణ చేసుకుంది కమిషన్.
మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా..
ఈ నేపథ్యంలో మొన్న ఏఈ పరీక్ష.. ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పరీక్షలను(ఏఈఈ, డీఏవో పరీక్షలు) సైతం రద్దు చేసి.. వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అయిపోయిన నాలుగు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధం కాగా.. మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అవే.. గ్రౌండ్ వాటర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు. ఈ క్రమంలో ఈ పరీక్షల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలతో పాటు.. రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా పరీక్షల పత్రాలను సైతం మార్చాలని యోచిస్తోంది.
దాదాపు 20 పరీక్షలకు పైగా నిర్వహించేందుకు..
రాబోయే మూడు, నాలుగు నెలల్లో.. టీఎస్‌పీఎస్‌సీ దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ వేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విమర్శలకు, అభ్యర్థుల అనుమానాలకు తావు లేకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. ప్రశ్నాపత్రాలను తిరిగి రూపొందించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష తేదీలను మార్చేసి, ఆలోపు కొత్త ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.