Telangana Govt Jobs 2022: అన్ని ఉద్యోగాలకు ప్రిపరేషన్.. నోటిఫికేషన్ దగ్గర్నుంచి.. పరీక్షల తేదీ వరకు..
రాష్ట్రంలో త్వరలో ఉద్యోగాల ప్రకటనలు వెలువడనున్నాయి. పోలీసు ఉద్యోగాలతోపాటు, ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్స్1, 2, 3, 4 తదితర పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. వీటిలో చాలా పోస్టులకు గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హతగా ఉండే అవకాశం ఉంటుంది. 80వేల పోస్టులకు పది లక్షల మంది వరకూ పోటీ పడతారని అంచనా. అభ్యర్థులు తమకు తగిన ఉద్యోగాలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడేవారు పూర్తి సన్నద్ధతతో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. సిలబస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా.. పరీక్ష స్థాయికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?
సిలబస్–మెటీరియల్
పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో తొలి మెట్టు.. సరైన మెటీరియల్ ఎంపిక. ఉద్యోగ ప్రకటన రాగానే అభ్యర్థులు మార్కెట్‌లోని ఏదో పుస్తకాన్ని ఎంచుకుంటారు. అది సరైన విధానం కాదు. సిలబస్‌లోని సబ్జెక్ట్‌లకు సంబంధించి వేర్వేరుగా సమగ్ర సమాచారం ఉండే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఒకే పేపర్‌లోని పలు సబ్జెక్ట్‌లకు సంబంధించిన పుస్తకాల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ సంబంధిత పుస్తకంలో ఉన్నాయో? లేదో? గమనించాలి. తర్వాత ఆయా అంశాలకు సంబంధించి గణాంక సహిత సమాచారం, నేపథ్యాల వివరణ ఉందో? పరిశీలించాలి. డిగ్రీ, పీజీ స్థాయి అకాడమీ పుస్తకాలతోప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం. ఈ విధంగా మెటీరియల్ ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
బిట్ బ్యాంక్స్ సరికాదు
ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు లేదా మూడు కంటే ఎక్కువ పుస్తకాలు చదవడం అనవసరపు శ్రమకు గురి చేస్తుందని గ్రహించాలి. బిట్ బ్యాంక్స్, కొశ్చన్ అండ్ ఆన్సర్ తరహాలో ఉండే గైడ్స్, ఇన్‌స్టంట్ మెటీరియల్‌వైపు మొగ్గు చూపకూడదు. కారణం.. గ్రూప్–2 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉన్నా.. అందులో అడిగే ప్రశ్నల స్వరూపం సంబంధిత అంశం నేపథ్యం, పూర్వాపరాల గురించి అవగాహనను పరీక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ తరహా పుస్తకాల అభ్యసనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాతే రివిజన్ కోణంలో ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్, ప్రాక్టీస్ బిట్స్ పుస్తకాలు చదవడం ఉపయుక్తం.
ఒకేసారి పలు పరీక్షలకు
అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువవాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అటువంటివారు ఒకే విధమైన సిలబస్ ఉన్న రెండు పరీక్షలకు ఒకే సమయంలో సన్నద్ధమయ్యేలా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. సిలబస్‌ను, అందులోని అంశాలను తులనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తే సంపూర్ణ అవగాహన వస్తుంది. తద్వారా విజయావకాశాలూ మెరుగవుతాయి. ఒక అంశాన్ని నేరుగా ప్రశ్న –సమాధానం విధానంలో కాకుండా.. తులనాత్మకంగా, విశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేయాలి. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాల గురించి అధ్యయనం చేసేటప్పుడు.. వీటి ద్వారా భవిష్యత్తులో నమోదయ్యే అభివృద్ధి, లక్షిత వర్గాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. సన్నద్ధతలో భాగంగా అభ్యర్థులు వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పటిష్ట సమయపాలన
కొందరు అభ్యర్థులు పోటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలవగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి.. తమ పనిపూర్తయినట్లు భావిస్తుంటారు. తీరా పరీక్షల తేదీలు సమీపించినప్పుడు పుస్తకాలన్నీ ముందేసుకుని రాత్రింబవళ్లు చదువుతుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. పరీక్షల నోటిఫికేషన్ దగ్గర్నుంచి.. పరీక్షల తేదీ వరకు ప్రతి క్షణం ఎంతో ప్రధానమైంది. ఏమాత్రం సమయం వృథా చేయకుండా.. పటిష్ట ప్రణాళికతో సమర్థంగా వినియోగించుకోవాలి. రోజువారీగా చదవాల్సిన అంశాలకు కాలపట్టికను రూపొందించుకోవాలి. సిలబస్ ప్రకారం సమయాన్ని కేటాయించాలి. సులభంగా అర్థమయ్యే అంశాలు, సులువుగా మార్కులు సాధించే సబ్జెక్టులకు ప్రాధాన్యతనివ్వాలి. పరీక్షల నాటికి అన్ని అంశాలపై అవగాహన సాధించేలా సమయాన్ని విభజించుకోవాలి. చివరి రెండు మూడు వారాలను రివిజన్, మాక్‌టెస్టులకు కేటాయించాలి. తద్వారా నేర్చుకున్న అంశాల్లో ఏవైనా సందేహాలుంటే.. తేలికగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.
చదవండి: Groups Preparation Guidance
వర్తమాన అంశాలు కీలకం
పోటీపరీక్షల్లో ప్రధానంగా వర్తమాన అంశాలకు ప్రధాన్యత ఉంటుంది. ఈ అంశాలను సిలబస్‌లో ఒక భాగంగా చూడకుండా ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. అన్ని సబ్జెక్టుల్లోని అంశాలు వర్తమాన విషయాలతో ముడిపడి ఉంటాయి. ఆయా విభాగాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. దినపత్రికల్లో రోజూ అనేక సమకాలీన పరిణామాల సమాచారం ప్రచురితమవుతుంది. కాబట్టి ఇప్పటినుంచే దినపత్రికలను పరీక్షల కోణంలో చదవాలి. సొంతంగా నోట్సు రూపొందించుకోవాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విభాగాలుగా విభజించి.. సామాజికంగా ప్రభావం చూపే పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా నియామకాలపై దృష్టి సారించాలి.
జనరల్ స్టడీస్
గ్రూప్–4 పరీక్షల స్థాయిలో డైరెక్ట్ ప్రశ్నలే వస్తాయి. కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చరిత్ర నుంచి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరకు ప్రశ్న–సమాధానం కోణంలో సమాచారంపై అవగాహన ఏర్పరచుకుంటే సరిపోతుంది. అయితే అన్ని సర్వీసులను లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమయ్యే అభ్యర్థులకు విశ్లేషణాత్మక అధ్యయనమే ఉత్తమ విధానం అని నిపుణులు, గత విజేతలు సూచిస్తున్నారు.
వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి
రాష్ట్రంలో నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి. అర్హత ఉన్న అన్ని పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమవడం ఉత్తమం. ఉదాహరణకు గ్రూప్–1 స్థాయి ఉద్యోగాల సాధన లక్ష్యంగా ఉన్నవారు మిగతా పరీక్షలు కూడా రాయడం ద్వారా పరీక్షలపై అనుభవం పొందొచ్చు. పరీక్ష గదిలో చేసే తప్పులను తెలుసుకుని వాటిని సవరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా దాదాపు అన్ని పరీక్షల సిలబస్ ఒకేవిధంగా ఉంటుంది కాబట్టి మౌలిక అంశాలపై పట్టు పెంచుకోవచ్చు. యూపీఎస్సీ పరీక్షల లక్ష్యంగా ఉన్నవారు సైతం చాలా కాలం తర్వాత నిర్వహించనున్న గ్రూప్–1 పరీక్షలపై దృష్టి సారించాలి. ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అధిక సంఖ్యలో నిర్వహిస్తున్న ఈ నియామక పరీక్షల్లో తెలంగాణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎకానమీ తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. ఇప్పటికే పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా ఈ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మెటీరియల్‌కు సంబంధించి తాజా గణాంకాల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రామాణిక సమాచారం పొందాలి.
– వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ట్రీ