Teacher Jobs: ఖాళీల్లో మూడో వంతే భర్తీ.. ఏడాది క్రితం లెక్క తేల్చిన ఖాళీలివీ..
ప్రభుత్వ ప్రకటన విద్యాశాఖలో టీచర్ల కొరతను తీర్చేదిగా లేదని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. నియామక ప్రక్రియలో స్పష్టమైన విధానం లేదని ఆరోపిస్తున్నారు. పదోన్నతులతో ముడిపడి ఉన్న స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), ప్రధానోపాధ్యాయుల పోస్టుల విషయంపై మంత్రి స్పష్టత ఇవ్వలేదని.. విద్యాశాఖను వేధిస్తున్న పర్యవేక్షణ పోస్టులైన డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల కొరత విషయాన్నీ ప్రస్తావించలేదని అంటున్నారు.
చదవండి: DSC Notification 2023: 6,612 పోస్టుల భర్తీ.. భర్తీ చేసే పోస్టులు ఇవీ..
22 వేల పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,086 ఖాళీ పోస్టులు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించారు. అందులో 10 వేల వరకు టీచర్ పోస్టులే ఉంటాయని అంచనా వేశారు. మిగతా వాటిలో 24 డిప్యూటీ డీఈవో ఖాళీలని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా 72 డిప్యూటీ డీఈవో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు.
68 పోస్టులు ఖాళీయే. ఇక ఎంఈవోలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డైట్ అధ్యాపకుల ఖాళీలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఇటీవలి విద్యాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,433 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంతర్గత పరిశీలనలో గుర్తించారు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టిన తర్వాత వాటిని ప్రకటించాలనుకున్నారు. కానీ ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. స్కూళ్లలో 1,974 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: AP DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..
స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇవ్వడం ద్వారా వీటిని భర్తీ చేయాలి. ఇదే సమయంలో 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలకు పదోన్నతి ద్వారా 70 శాతం, నేరుగా నియామకాల ద్వారా 30 శాతం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులు చేపడితే గానీ అసలు ఖాళీలు ఎన్ని అనే స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మంది టీచర్ పోస్టులు ఉంటే.. ప్రస్తుతం పనిచేస్తున్నది 1.09 లక్షల మంది మాత్రమే. అంటే దాదాపు 22 వేల ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది.
పదోన్నతుల కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో ఏడేళ్లుగా టీచర్లకు పదోన్నతులు కల్పించలేదు. గత నాలుగేళ్లుగా సాధారణ బదిలీలు కూడా లేవు. మూడుసార్లు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లలో పాసైన 4 లక్షల మంది టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే బదిలీలు, పదోన్నతులకు కోర్టు కేసులు, ఇతర అడ్డంకులు ఉండటంతో.. 1,974 హెచ్‌ఎం పోస్టులు, 2,043 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పోస్టులు, 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,775 ఎస్జీటీలు, 467 ఎంఈవో పోస్టుల భర్తీ చేపట్టలేదని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం 6,612 పోస్టులే భర్తీ చేస్తుండటం.. ఇందులో సాధారణ టీచర్ పోస్టులు 5,089 మాత్రమే ఉండటంపై నిరాశ వ్యక్తమవుతోంది.
విద్యాశాఖ ఏడాది క్రితం లెక్క తేల్చిన ఖాళీలివీ..
విభాగం |
ఖాళీలు |
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు |
1,974 |
ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు |
2,043 |
స్కూల్ అసిస్టెంట్లు |
7,200 |
పీడీలు |
25 |
ఎస్జీటీలు |
6,775 |
లాంగ్వేజ్ పండిట్లు |
688 |
పీఈటీలు |
172 |
డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్లు |
1,733 |
ఎంఈవోలు |
467 |
బాలికల పాఠశాలల హెచ్‌ఎంలు |
15 |
డైట్ లెక్చరర్లు |
271 |
డిప్యూటీ ఈవోలు |
58 |
డీఈవోలు |
12 |
పోస్టులను కుదించేస్తారా?
వాస్తవంగా 22 వేల ఖాళీలు ఉన్నా.. హేతుబద్ధీకరణ చేపడితే పోస్టుల సంఖ్య బాగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 8,782 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉందని.. ఇందులో 8,665 ప్రాథమిక పాఠశాలలు, 117 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అంటున్నాయి.
వంద మంది పిల్లల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లు 6,833 మాత్రమేనని వివరిస్తున్నాయి. వీటిని హేతుబద్ధీకరిస్తే టీచర్ పోస్టులు తగ్గుతాయని పేర్కొంటున్నాయి. అయితే ఈ తరహా హేతుబద్ధీకరణతో పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పిల్లల సంఖ్యను బట్టి కాకుండా.. స్కూళ్లలో తరగతులు, టీచర్ల అవసరాన్ని చూడాలని స్పష్టం చేస్తున్నాయి.