Department of Education: స్కూళ్లలో ఈ ప్రచారం కుదరదు

బడుల్లో పనిచేసే టీచర్లపైనా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది. బడి మానేసి అభ్యర్థుల కోసం ప్రచారానికి వెళ్లే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.
టెన్త్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ.. విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రచారం పేరుతో అభ్యర్థులు వస్తే స్కూళ్లలో బోధన దెబ్బతింటుందని, ఈ కారణంగా ఎవరినీ అనుమతించవద్దని డీఈవోలను ఆదేశించింది.
స్కూళ్లలో హడావుడి
ఖమ్మం–వరంగల్–నల్లగొండ, ఆదిలాబాద్–కరీంనగర్–నిజామాబాద్–మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో మూడు ప్రధాన సంఘాల నేతలు పోటీ పడుతున్నారు. దీంతో టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతీ స్కూలుకు వెళ్లి టీచర్లను ఓట్లు అడుగుతున్నారు.
ఉదయం పాఠశాల ప్రారంభం నుంచి.. సాయంత్రం ముగిసే వరకూ వివిధ సంఘాల నేతలు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ప్రతీ స్కూల్లో మూడు సంఘాలకు మద్దతిస్తున్న టీచర్లు ఉండటంతో, ఆయా అభ్యర్థుల గెలుపోటములపై పాఠశాల సమయంలో చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు ఇవి ఆవేశకావేలకు దారి తీస్తున్నాయి. అభ్యర్థుల పక్షాన సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల కోసం టీచర్లు సమయం వెచ్చిస్తున్నారు.
కొంతమంది టీచర్లు స్కూలుకు వచ్చి, హాజరువేసుకుని ప్రచారానికి వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 48 స్కూళ్లల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదని అధికారులకు ఫిర్యాదులొచ్చాయి. అలాగే వరంగల్‌లో 36 పాఠశాలల్లో టీచర్లు ప్రత్యేక బోధనకు అరకొరగా హాజరవుతున్నారనే ఫిర్యాదులు అందాయి.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోనూ అభ్యర్థుల మద్దతు దారులు ఈ తరహా ఫిర్యాదులు చేసుకోవడం కన్పించింది. దీంతో విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా ప్రచారంపై ఆంక్షలు విధిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
రాత్రి బస.. విందులు, వినోదాలు
ప్రధాన సంఘాల నేతలు పట్టణ కేంద్రాల్లో రాత్రిపూట బస చేస్తున్నారు. టీచర్ ఓటర్లను తమ వద్దకు రప్పించుకుని, వారిని ప్రసన్నం చేసుకోవడానికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ స్కూల్‌లో ఏజెంట్లను పెట్టుకుని, డబ్బుల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ ఉపాధ్యాయుడు ఎవరి పక్షాన ఉన్నాడు? అతడిని ఆకర్షించడం ఎలా? అనే కోణంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ బాధ్యతను ఆయా స్కూళ్లలో తమ అనుచరులైన టీచర్లకు అప్పగిస్తున్నారు. ఇంకో వైపు అనుకూలంగా లేని టీచర్లను నేతల వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తున్నారు. అయితే ఇవన్నీ బోధనకు ఆటంకాలుగా మారుతున్నా యని అధికారులు అంటున్నారు. దీంతో విధు లు మానేసి ఎన్నికల ప్రచారానికి వెళుతున్న టీచర్ల జాబితాను పంపాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.. డీఈవోలను ఆదేశించింది.
టీచర్ల కదలికలపై రహస్య నివేదికలు పంపాలని సూచించింది. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే టీచర్లు, వారు విందులకు హాజరయ్యే సమయాలపైనా ఆరా తీస్తున్నారు.