Admissions in IISC: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) కోర్సులకు ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. సంక్షిప్తంగా ఐఐఎస్సీ. ఇంటర్ పూర్తిచేసి పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఒక చక్కటి వేదిక. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ పూర్తి చేసుకొని.. సైన్స్, మ్యాథ్స్, పరిశోధన కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఐఐఎస్సీ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) కోర్సులకు ప్రవేశ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐఐఎస్సీ ప్రత్యేకత, ప్రవేశాలపై సమగ్ర సమాచారం..
- బీఎస్సీ రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశాలు
- ప్రకటన విడుదల చేసిన ఐఐఎస్సీ
ఐఐఎస్సీ ప్రత్యేకత
దేశంలోనే ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). బెంగళూరు ప్రధాన క్యాంపస్‌గా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. మొత్తం 371 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఐఐఎస్సీ.. 1958లో విశ్వవిద్యాలయ హోదా పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ప్రతి ఏటా టాప్‌లో నిలుస్తూ.. ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థగా పేరుగాంచింది.
నాలుగేళ్ల బీఎస్సీ(రీసెర్చ్)
ఎనిమిది సెమిస్టర్‌లుగా నాలుగేళ్ల కాలవ్యవధితో బీఎస్సీ రీసెర్చ్ కోర్సును అందిస్తోంది ఐఐఎస్సీ. మొదటి మూడు సెమిస్టర్లు అందరికి ఉమ్మడిగానే ఉంటాయి. ఆ తర్వాత నిర్వహించే సెమిస్టర్లలో స్పెషలైజేషన్ చదవాల్సి ఉంటుంది. నాలుగో ఏటా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాలి.
TS ECET: టీఎస్ ఈసెట్–2022 నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక విధానం ఇలా..
స్పెషలైజేషన్స్
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, మెటీరియల్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లు స్పెషలైజేషన్లుగా ఉన్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కాంబినేషన్ కోర్సులను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. విద్యార్థి మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన మెరిట్‌ను పరిగణలోకి తీసుకుని.. స్పెషలైజేషన్ కేటాయిస్తారు.
137 సీట్లు
ఐఐఎస్సీ.. బీఎస్సీ రీసెర్చ్ కోర్సులో 137 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. నామమాత్రపు రుసుముతో భోజన, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్యూషన్ ఫీజు కూడా తక్కువగానే ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
అర్హతలు
2021లో ప్రథమ శ్రేణి మార్కులతో ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2022లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు పాస్ మార్కులుంటే సరిపోతుంది.
ప్రవేశం మార్గం
కేవీపీవై, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ తదితర పరీక్షల్లో చూపిన ప్రతిభ, సాధించిన స్కోర్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఐఐఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సంబంధిత స్కోర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఫలితాలు వెల్లడి కాని వారు హాల్ టికెట్ వివరాలు ఇస్తే సరిపోతుంది.
ఎంపిక ఇలా
కేవీపీవై, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ వంటి జాతీయ పరీక్షల్లో సాధించిన స్కోర్, రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులకు నిర్దేశించిన స్కోర్ పరిగణలోకి తీసుకొని.. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీటు కేటాయిస్తారు. ఇందులో మహిళా విద్యార్థులకు పదిశాతం సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022
- వెబ్‌సైట్: https://admissions.iisc.ac.in