Admissions In Indian Statistical Institute: ఈ కోర్సులు చేసే వారికి నెలకు రూ.12,400 స్టయిఫండ్..
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. సంక్షిప్తంగా ఐఎస్‌ఐ. దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థలో ఇది ఒకటి. స్టాటిస్టిక్స్, దాని అనుబంధ విభాగాల్లో వివిధ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం ఐఎన్‌ఐ కోల్‌కతా
ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. గిరిడీ, కోయంబత్తూర్, హైదరాబాద్, ముంబై, పుణె, వడోదరలలోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఐఎస్‌ఐ క్యాంపస్‌ల్లో చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, స్టయిపండ్ కూడా లభిస్తోంది. తాజాగా 2022–23 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలకు ఐఎస్‌ఐ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు..
అందించే ప్రోగ్రామ్స్
- బీస్టాట్(ఆనర్స్): ఈ కోర్సును కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో అందిస్తున్నారు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- బీమ్యాథ్స్(ఆనర్స్): బెంగళూర్ క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. మ్యాథ్స్,ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- ఎంస్టాట్(మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్): ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్ కోర్సు చదివిన వారు ఈ కోర్సు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంమ్యాథ్స్(మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్): ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందుబాటులో ఉంది. మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్ కోర్సు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంఎస్(క్వాంటిటేటివ్ ఎకనామిక్స్): కోల్‌కత్తా, ఢిల్లీ క్యాంపస్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంఎస్(క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్సెస్): ఈ ప్రోగ్రామ్‌ను బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు లేదా ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంఎస్(లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్): బెంగళూర్ క్యాంపస్ ఈ కోర్సులను అందిస్తుంది. రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తిచే సి ఉండాలి.
- ఎంటెక్(సీఎస్–కంప్యూటర్ సైన్స్): ఈ ప్రోగ్రామ్‌ను కోల్‌కతా క్యాంపస్ అందిస్తుంది. కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. బీఈ/బీటెక్ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ పూర్తిచేసి ఉండాలి.
- ఎంటెక్(క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీస్ ఆర్‌ఎస్): కోల్‌కతా క్యాంపస్‌లో ఈ కోర్సు అందిస్తున్నారు. బీఈ/బీటెక్ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చదివిన వారు అర్హులు.
- ఎంటెక్(క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రీసెర్చ్‌క్యూఆర్‌ఓఆర్): ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
పీజీ డిప్లొమా కోర్సులు
- ఐఎస్‌ఐ వివిధ పీజీ డిప్లొమా కోర్సులను సైతం అందిస్తోంది. వీటిలో స్టాటిస్టిక్స్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్‌మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్(పీజీడీఏఆర్‌ఎస్‌ఎంఏ) ముఖ్యమైనవి. దీంతోపాటు అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో కొత్తగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆన్‌లైన్ విధానంలో కోర్స్‌ఎరాతో కలిసి అందిస్తుంది.
స్టయిఫండ్
ఐఎస్‌ఐ క్యాంపస్‌లలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5000, పీజీ కోర్సుల్లో చేరిన వారికి నెలకు రూ.8000, ఎంటెక్ కోర్సులు చేసే వారికి నెలకు రూ.12,400 స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.35వేలు+హెచ్‌ఆర్‌ఏ, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు రూ.35వేలు+హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు. వీటితోపాటు అన్ని కోర్సుల వారికి ఏటా కంటింజెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు. తక్కువ ఫీజుతో భోజన, వసతి సౌకర్యాలను అందిస్తారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
ఐఎస్‌ఐలో చదివిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సౌలభ్యం కూడా ఉంటుంది. కోర్సు చివరలో క్యాంపస్ నియామకాలు చేపడతారు. ఏఐజీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‌జెడ్, యాక్సిస్ బ్యాంక్, ఏబీ ఇన్ వెబ్, బార్క్ ఇండియా, ఏఎక్స్‌ఏ లైఫ్ ఇన్సూరెన్స్, బీసీఎస్ టెక్నాలజీ, బ్లాక్‌రాక్, క్యాపిటల్ వన్, డెలాయిట్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ, వాల్‌మార్ట్, రెడ్ బస్, టీసీఎస్, సామ్‌సంగ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మెట్రో, ఐబీఎం తదితర ప్రముఖ సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022
- పరీక్ష తేదీ: మే 08, 2022
- వెబ్‌సైట్: http://www.isical.ac.in/