Employment Offer: వీరికి మాత్రమే సబార్డినేట్ పోస్టులు.. కానీ..!
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరణించిన ఉద్యోగులకు సంబంధించి 106 మంది వారసులు ఉన్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం ఆరు మాత్రమే ఉండగా, కార్యాలయ సబార్డినేట్ పోస్టులు 180 వరకు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 48 మంది అర్హులు ఉన్నారు.
➤ JEE Mains 2024: నోటిఫికేషన్ విడుదల.. ఈసారి భారీ మార్పులు..
అయితే అందరూ తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులే కావాలంటూ పట్టుబడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్/జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు వారందరినీ గురువారం జెడ్పీకి పిలిపించారు. జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిణి (డీఎల్‌డీఓ) ఓబుళమ్మ మాట్లాడారు. కారుణ్య నియామకాలలో జరుగుతున్న జాప్యానికి వారసులే కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జూనియర్ అసిస్టెంట్ పోస్టే కావాలంటూ పట్టుబడుతున్నారని తెలిపారు.
➤ Assessment Survey for Students: పాఠశాల విద్యార్థులకు అభ్యసన సామర్థ్య పరీక్షలు మొదలు..
ఇలాగైతే ఏడు, ఎనిమిది సంవత్సరాలు నిరీక్షించాల్సి ఉంటుందని, అప్పటి వరకు ఎలాంటి జీతం ఉండదన్నారు. అదే సబార్డినేట్ ఉద్యోగంలో చేరితే నాలుగైదేళ్లలో జూనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందుతారని చెప్పారు. అప్పటి వరకు ప్రతి నెలా కనీసం రూ.30 వేలకు పైబడి జీతం వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చన్నారు. కోరుకున్న ఉద్యోగమే కావాలంటే మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచించారు.