Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్
- 11 జాతీయ బ్యాంకుల్లో.. 4,545 క్లర్క్ పోస్ట్‌లు
- ఏపీలో 77, టీఎస్‌లో 27 పోస్ట్‌లు
- మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్ తాజా నోటిఫికేషన్ ద్వారా.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య తగ్గింది. గత సంవత్సరం 6,035 పోస్ట్‌లకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ఏడాది మాత్రం 4,545 పోస్ట్‌లనే ప్రకటించింది.
అర్హతలు
- 21.07.2023 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్ లేదా డిప్లొమా/డిగ్రీ కలిగుండాలి. లేదా హైస్కూల్/కాలేజ్ స్థాయిలో కంప్యూటర్/ఐటీని ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి.
- వయసు: జూలై 1, 2023 నాటికి 20-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
చదవండి: Study Material
రెండంచెల ఎంపిక ప్రక్రియ
- ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో భాగంగా రెండంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష; మెయిన్ రాత పరీక్ష.
- ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్‌మార్కుల జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్ అందిస్తారు.
ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష
ఐబీపీఎస్ రాత పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, కొంకణి, ఉర్దూ, కన్నడ, మళయాళం, మణిపురి, ఒడియా, తమిళం, పంజాబీ భాషల్లో పరీక్ష రాసే వీలుంది. అభ్యర్థులు తాము ఏ రీజియన్‌కు దరఖాస్తు చేసుకున్నారో.. ఆ రీజియన్‌కు నిర్దేశించిన రీజనల్ లాంగ్వేజ్‌లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీ అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో.. తెలంగాణ అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షకు హాజరు కావచ్చు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలోని తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మూడు విభాగాల్లో జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు.. ఇలా మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
చదవండి: Bitbank
మెయిన్స్ పరీక్ష
మొదటి దశ ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నాలుగు విభాగాల్లో 190 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 160 నిమిషాలు. రెండు దశల పరీక్షలకు నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కును తగ్గిస్తారు.
సక్సెస్ సాధించేలా
రెండు దశలుగా ఆన్‌లైన్‌లో నిర్వహించే రాత పరీక్షల్లో విజయానికి అభ్యర్థులు దరఖాస్తు దశ నుంచే అడుగులు వేయాలి. ఐబీపీఎస్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం-తొలి దశ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్/సెప్టెంబర్‌లో; రెండో దశ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్‌లో జరగనున్నాయి. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఉమ్మడి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎందుకంటే.. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కు నెల రోజులకంటే తక్కువ వ్యవధి ఉంటుంది.
ఆ మూడు విభాగాలు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ.. ఈ మూడు విభాగాలు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా.. మెయిన్స్ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ విభాగానికి సంబంధించి గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం కూడా పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగంలో రాణించడానికి అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లను సాధన చేయాలి.
రీజనింగ్
ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
చదవండి: Previous Papers
మెయిన్స్‌కు అదనపు సమయం
ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్స్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలపై దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్ ఆఖరి స్లాట్ పరీక్ష ముగిసిన తర్వాత మెయిన్‌కు తక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో మెయిన్స్‌లో అదనంగా ఉండే రెండు విభాగాలకు ప్రిపరేషన్ పూర్తి చేయడం సాధ్యంకాదు.
జనరల్ అవేర్‌నెస్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్
బ్యాంకింగ్ రంగ పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాలు(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.
మాక్ టెస్ట్‌లకు హాజరు
ప్రిలిమ్స్ కోసం మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్స్‌కు అందుబాటులో ఉండే వ్యవధిలో గ్రాండ్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాసేలా ప్లాన్ చేసుకోవాలి. మెయిన్స్‌లో లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా అదనపు అంశాలకు కొత్తగా ప్రిపరేషన్ సాగించాలి. వెయిటేజీ కొంచెం తక్కువగా ఉందని భావిస్తే ఆందోళన చెందకుండా.. అప్పటికే పట్టు సాధించిన అంశాల ప్రాక్టీస్ సమయం కేటాయించాలి.
క్లర్క్ నుంచి.. డీజీఎం వరకు
ఐబీపీఎస్ నియామక ప్రక్రియలో విజయం సాధించి.. బ్యాంక్‌లో క్లర్క్‌గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. తొలుత ఎంపికైన వారికి ఆరు నెలలు ప్రొబేషన్ పిరియడ్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది.
ఆ తర్వాత కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్ (ఎఎంజీఎస్-ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా జేఎంజీఎస్ స్కేల్-1 ఆఫీసర్‌గా పదోన్నతి పొందొచ్చు. క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించాక.. జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్‌గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 1 - జూలై 21, 2023
- ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్ట్
- ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీలు: ఆగస్ట్/సెప్టెంబర్‌లో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/
Qualification | GRADUATE |
Last Date | July 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |