Medical Recruitment: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్!
- వైద్య, ఆరోగ్య శాఖ యోచన.. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రతిపాదన
- ఆప్షన్లు ఇచ్చి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వాలనే యోచన
- వైద్యుల సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చనే భావన
- గతంలో ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లతో ఉద్యోగాలు వదులుకున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్న అధికారుల ఆలోచన చర్చనీయాంశమైంది. కౌన్సెలింగ్ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం వైద్యుల అభిప్రా యాలకు ప్రాధాన్యత ఇచ్చి విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. దరఖాస్తు చేసే వైద్యులకు నాలుగైదు ఆప్షన్లు ఇవ్వాలని, వారు కోరుకున్న చోటే పోస్టింగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతానికి ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే ఇతర అంశాలన్నిటినీ పరిగణన లోకి తీసుకొని పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే భార్యాభర్తలు ఒకేచోట లేదా దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వ నున్నారు. ఈ విధమైన కౌన్సెలింగ్ వల్ల వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో ఉప యోగించుకునేందుకు వీలుంటుందని, వారు రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుం చెబుతున్నారు.
Also read: TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..
గతానుభవం దృష్ట్యా ..
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎం, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. డాక్టర్ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసు పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఉన్నాయి. పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ బోర్డు భర్తీ చేస్తుంది. అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్ తదితర స్పెషలిస్ట్ పోస్టులున్నాయి. మరో 1,200 వరకు ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. అయితే స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కీలక సమస్యగా మారింది. 2018లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా దరఖాస్తు చేసిన వారికి అధికారులే ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పైరవీలు జోరుగా జరిగాయన్న విమర్శలూ వచ్చాయి. భార్యా భర్తలను సుదూర ప్రాంతాలకు పంపారన్న అపవాదు కూడా వచ్చింది. ఫలితంగా 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినవారు ఉద్యోగాలనే వదులుకున్నారు. చేరినవారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. అందులో కొందరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో ఉద్యోగంలోంచి తీసేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఆలోచనకు వైద్య ఆరోగ్య శాఖ వచ్చింది. మరోవైపు కొత్త వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతమంది ప్రభుత్వ వైద్యులుగా చేరేందుకు ఆసక్తి చూపిస్తారనే సంశయమూ వెంటాడుతోంది.
Also read: KNRUHS: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్