Skip to main content

Jobs: కొత్త కొలువు.. 80 వేల మంది అవసరం

సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బృహత్తర బాధ్యతలు అప్పజెబుతోంది.
Drone Technology in Agriculture
కొత్త కొలువు.. 80 వేల మంది అవసరం

వ్యవసాయ, ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంలో వారిని భాగస్వాములను చేస్తోంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చి, యువతకు చదువుతోపాటే వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి లభించేలా తీర్చి దిద్దుతున్నారు. ఇప్పుడు గ్రామాల్లోని చదువుకున్న యువతకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఇచ్చి, గ్రామీణ ప్రాంత కార్యకలాపాల్లో పాలుపంచుకొనేలా చేస్తున్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. 

చదవండి: ‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు ఇవే..

80 వేల మంది అవసరం 

ఒక్క వ్యవసాయ అవసరాలకే 20 వేల మంది డ్రోన్‌ పైలెట్లు అవసరమవుతారని అంచనా. ఇతర అవసరాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటే 80 వేల మందికి పైగా డ్రోన్‌ పైలెట్లు అవసరమవుతారు.  ఈ నేపథ్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రోన్‌ పైలెట్లుగా శిక్షణనిచ్చి ప్రొఫెషనల్స్‌గా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 12 రోజుల సర్టిఫికెట్‌ కోర్సును రూపొందించింది. 

చదవండి: Telangana రైతులకి డ్రోన్లు

12 రోజుల పాటు ఉచిత శిక్షణ 

వ్యవసాయ కూలీల కొరతకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేల్లో కిసాన్‌ డ్రోన్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి దశలో జూలైలోగా 500 ఆర్బీకేల పరిధిలో, డిసెంబర్‌ కల్లా మరో 1500 ఆర్బీకేల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సీహెచ్‌సీ గ్రూపుల్లో చదువుకున్న రైతులకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్‌ పరిశోధన కేంద్రం సెంటర్‌ ఫర్‌ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 8 బ్యాచ్‌లలో 135 మంది రైతులకు శిక్షణనిచ్చారు. మిగిలిన వారికి జూలైకల్లా శిక్షణ ఇస్తారు. ఇప్పుడు యువతకూ ఈ శిక్షణ ఇస్తారు. 

చదవండి: 100 Kisan Drones: దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్‌ డ్రోన్‌లను ప్రారంభించారు?

3 ఏళ్లపాటు ఆర్బీకేల్లో పనిచేయాలి 

వ్యవసాయ డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్‌ పట్టభద్రులైన యువతకు ఈ శిక్షణ ఇస్తారు. కనీసం 3 ఏళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ముందుకొచ్చే వారికి డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఇతర రంగాల్లో డ్రోన్స్‌పై శిక్షణ పొందాలంటే  ఫీజులు చెల్లించాలి. జూలై నుంచి దశలవారీగా  శిక్షణ ఇవ్వనున్నారు.  ఇందుకోసం సీఎం  జగన్‌ ఆదేశాల మేరకు కొత్తగా అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మాస్టర్‌ ట్రైనీలను నియమించనున్నారు. ఇప్పటికే 10 మంది శాస్త్రవేత్తలతో పాటు వర్సిటీలో వ్యవసాయ డిప్లొమా చదువుతున్న 125 మం­ది­­­కీ అప్సరా ప్రత్యేక శిక్షణనిచ్చింది.  

చదవండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

డ్రోన్లదే కీలక పాత్ర 

వ్యవసాయ రంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ రంగంలో 22 రకాల పనులు చేసేందుకు వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా ఆర్బీకేల పరిధిలో కిసాన్‌ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటి వినియోగానికి ఇప్పటికే రైతులకు డ్రోన్‌ పైలెట్లుగా శిక్షణ ఇస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కిసాన్‌ డ్రోన్స్‌ నిర్వహణ కోసం ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో చదువుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఈ శిక్షణ ఇస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా గ్రామీణ నిరుద్యోగ యువతకు కూడా డ్రోన్‌ పైలెట్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. 

శిక్షణలో ఎన్నో నేర్చుకున్నాం 
ఎన్జీ రంగా వర్సీటీ ఇచ్చిన శిక్షణలో ఎంతో నేర్చుకున్నాం. డ్రోన్స్‌ ఫ్లై చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. పొలంలో సూక్ష్మ ఎరువులు, పురుగుల మందులు నేరుగా పిచికారీ చేయగలిగే సామర్థ్యం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల్లో కిసాన్‌ డ్రోన్స్‌ ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయ అవసరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. 
–కొప్పుల బ్రహ్మానందరెడ్డి, నంద్యాల 


చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోగలం 
3 రోజుల థియరీ క్లాసెస్, డ్రోన్‌ అసెంబ్లింగ్, డిస్‌ అసెంబ్లింగ్‌.. ఒక రోజు సెమిలరీ ప్రాక్టీస్, ఫీల్డ్‌ లెవల్‌లో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నుంచి దృఢమైన నమ్మకంతో వెళ్తున్నాం. డ్రోన్‌ ఫ్లై చేయగలను. చిన్న చిన్న రిపేర్లు వచ్చినా సరిచేయగలను. 

– యు.కామేశ్వరరావు, సీతారాంపురం, ప్రకాశం జిల్లా 

నిరుద్యోగ యువతకు శిక్షణ 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా వ్యవసాయ, సంప్రదాయ డోన్లపై నిరుద్యోగ యువతను డ్రోన్‌ పైలెట్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇందుకోసం వ్యవసాయ శాఖతో కలిసి కార్యాచరణ సిద్ధం చేశాం. గుంటూరు లాంతో పాటు మరో నాలుగు చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం.    

 – ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 

Published date : 05 May 2023 01:41PM

Photo Stories