Skip to main content

World Skills Academy: వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ

నైపుణ్యాభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన ప్రాజెక్టును దక్కించుకుంది.
World Skills Academy
వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ

ప్రపంచవ్యాప్తంగా పేరున్న వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని.. ఇందుకు సంబంధించి త్వరలోనే తుది ఉత్తర్వులు వెలువడనున్నాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. రెండేళ్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌ స్కిల్స్‌ పోటీలో పాల్గొనే వారికి ఈ అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తారు. కనీసం 20 విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్‌ స్కిల్స్‌ షాంఘై–2022 పోటీలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల స్కిల్‌ పోటీలకు విశాఖ వేదిక కానుంది. ఇప్పుడు నేరుగా ఇక్కడ వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ ఏర్పాటు కానుండటంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలపై..

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరుల కొరతను తీర్చేందుకు కొన్ని దేశాలు కలిపి ‘వరల్డ్‌ స్కిల్‌’ పేరుతో నైపుణ్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ 83కు పైగా ఉన్న సభ్య సంస్థల ద్వారా ప్రపంచంలోని మూడింట రెండొంతుల నైపుణ్య అవసరాలను తీరుస్తోంది. మన దేశంలో కూడా నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేష¯ŒSతో కలిపి వరల్డ్‌ స్కిల్స్‌ ఇండియా పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాలతో పాటు రాష్ట్రంలో రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ రాకతో నూతన నైపుణ్య ఆవిష్కరణల్లో రాష్ట్ర విద్యార్థులు భాగస్వామ్యం కావడానికి అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Published date : 21 Oct 2021 01:16PM

Photo Stories