Distribute Tabs: ప్రభుత్వ బడిలో సాంకేతిక విప్లవం.. ఎక్కడ అంటే..!
దీనికి కొనసాగింపుగా 2023 – 24 విద్యా సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలో 8వ తరగతి చదువుతున్న 10,562 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 3,820 ట్యాబ్‌లు జిల్లాకు చేరుకోగా, వీటిని చంద్రపాలెం జెడ్పీ హైస్కూల్‌లో భద్రపరిచారు. మిగతావి కూడా నేడో, రేపే జిల్లాకు చేరనున్నాయి. ఈ నెల 21న వీటిని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రంపాలెం స్టాక్ పాయింట్ నుంచి ట్యాబ్‌లను పాఠశాలలకు సరఫరా చేసేలా ఆయా మండలాల ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించారు. ఆరు జిల్లాలకు అవసరమైన ట్యాబ్‌లను ఇదే చోట నిల్వ చేస్తున్నందున ఆర్జేడీ జ్యోతి కుమారి, డీఈవో ఎల్.చంద్రకళ ప్రత్యేక దృష్టి సారించారు. తమ యంత్రాంగానికి దిశ నిర్దేశం చేస్తున్నారు.
గతేడాది 12,339 ట్యాబ్‌ల పంపిణీ
ప్రభుత్వ బడుల్లో పేద వర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకొని మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వం అన్ని రకాల వనరులు సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది 8వ తరగతి చదివిన జిల్లాలోని 11,223 మంది విద్యార్థులకు బైజూస్ ట్యాబ్‌లను అందజేశారు. అదేవిధంగా ఎనిమిదో తరగతి బోధన చేసే 1,116 మంది ఉపాధ్యాయులకు సైతం వీటిని పంపిణీ చేశారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన ఒక్కో ట్యాబ్ రూ.32,088 ఖరీదు చేయనుండగా, జిల్లాలో వీటి కోసమని ప్రభుత్వం రూ.39.59 కోట్లు వెచ్చించింది.
Tenth Class Exams 2024 : 10వ తరగతి విద్యార్థుల డేటాను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వ బడిలో స్మార్ట్ పాఠాలు
డిజిటల్ విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశ్యంతో ‘నాడు – నేడు’ కార్యక్రమంలో అభివృద్ధి చేసిన 132 ఉన్నత పాఠశాలల్లో 1,185 ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో 146 స్మార్ట్ టీవీలను అమర్చారు. వీటి ద్వారా చేపట్టిన విద్యాబోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోంది. స్మార్ట్ పాఠాలుపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కొనసాగింపుగా జిల్లాకు మరో 352 స్మార్ట్ టీవీలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారులు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్మార్ట్ టీవీలు సైతం మరికొన్ని రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. ప్రభుత్వ యాజమన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన సాగేలా విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం
8వ తరగతి విద్యార్థులకు ఈ నెల 21న ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులందరికీ సౌకర్యవంతంగా ఉండేలా వీటి పంపిణీ ఉంటుంది. ట్యాబ్‌లను విద్యార్థుల సంఖ్య మేరకు మండలాలకు ఇప్పటికే చేర్చాం. వీటి పంపిణీపై ఎంఈవోలు తగిన బాధ్యత తీసుకోవాలి. – ఎల్.చంద్రకళ, డీఈవో