Skip to main content

YS Jagan Mohan Reddy: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఒకేసారి ఇన్ని ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుదల

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య విద్యలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు.
new chapter in medical education
మచిలీపట్నంలో తుది దశకు చేరిన మెడికల్‌ కాలేజీ భవనం

2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామన్న హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఈ విద్యా సంవత్సరం (2023–24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రవేశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 

చదవండి: Medical Colleges: ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం

రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం 

ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో మొట్టమొదటగా 1923లో ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019కి అంటే 96 ఏళ్లలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్య విద్యా రంగం అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు.  నాడు – నేడు పథకం కింద రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. కరోనా వ్యాప్తి, లాక్‌ డౌన్‌ వంటి ఒడిదుడుకులను కూడా అధిగమించి వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. వీటిలో ఐదు కాలేజీలు 2023లో ప్రారంభమవుతున్నాయి.

చదవండి: Medical colleges derecognised: మెడిసిన్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌... 150 మెడిక‌ల్ కాలేజీల అనుమ‌తులు ర‌ద్దు..!

ప్రస్తుతం ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలతో మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు, ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మానవ వనరులు, ఇతర సదుపాయాలను సమకూర్చింది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో రాష్ట్రంలో స్పెషలిస్ట్‌ వైద్యుల సంఖ్య పెరగనుంది.

చదవండి: ఏపీలో వైద్య విధానాలు భేష్‌

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 కొత్త వైద్య కళాశాలలు 

కళాశాల

నిధులు (రూ.కోట్లలో)

విజయనగరం

500

మచిలీపట్నం

550

రాజమండ్రి

475

ఏలూరు

525

నంద్యాల

475

పాడేరు

500

మార్కాపురం

475

మదనపల్లె

475

పులివెందుల

500

ఆదోని

475

పిడుగురాళ్ల

500

పెనుకొండ

475

పాలకొల్లు

475

నర్సీపట్నం

500

పార్వతీపురం

600

బాపట్ల

505

అమలాపురం

475

మొత్తం

8,480

ఆగస్టులో అడ్మిషన్లు.. సెప్టెంబర్‌లో తరగతులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతులివ్వడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రి గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మా­ట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 17 కాలేజీలు నిర్మిస్తున్నారని తెలిపారు. తొలి విడతలో విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం కాలేజీల నిర్మాణం పూర్తయిందని, వీటిలో అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతిచ్చిందని చెప్పారు. ఈ కళాశాలల్లో ఆగస్టులో అడ్మిషన్లు చేపట్టి, సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభిస్తామన్నారు. మెడికల్‌ సీట్ల కోసం రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 2019కి ముందు 1,926 పీజీ సీట్లు ఉండగా, గత నాలుగేళ్లలో కొత్తగా 462 పీజీ సీట్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులతో పాటు కొత్తగా 49 వేల పోస్టులను భర్తీ చేయడం చరిత్రాత్మకమన్నారు.

Published date : 02 Jun 2023 03:12PM

Photo Stories