Skip to main content

Krishna Deva Raya University news: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు

Sri Krishna Devaraya University
Sri Krishna Devaraya University

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బీ, పీజీ చదివే విద్యార్థుల భవిష్యత్తుతో ఉన్నతాధికారులు ఆటలాడుకుంటున్నారు. బకాయి పడ్డ మెస్‌బిల్లులు చెల్లిస్తేనే పరీక్ష దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేయడంతో ఎటూపాలుపోని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. పైసా బకాయి ఉన్నా పరీక్షలకు అనుమతించబోమని పేర్కొనడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు.

10వ తరగతి Inter అర్హతతో ONGCలో 2236 ఉద్యోగాలు: Click Here

దరఖాస్తుల స్వీకరణకు నో

ఎల్‌ఎల్‌బీ రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ క్రమంలో పరీక్ష ఫీజులను చలానా రూపంలో బ్యాంకులో చెల్లించిన విద్యార్థులు.. దరఖాస్తు అందించడానికి ప్రిన్సిపాల్‌ కార్యాలయానికి వెళితే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మెస్‌ బకాయిలు చెల్లిస్తేనే దరఖాస్తులు స్వీకరించాలంటూ ఉన్నతాధికారులిచ్చిన ఆదేశాలను అనుసరిస్తున్నామని పేర్కొంటున్నారు.


ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్‌ 79 మంది, నాలుగో సెమిస్టర్‌ 54 మంది విద్యార్థులు రాయనున్నారు. త్వరలో పీజీ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. వీరికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేయడం గమనార్హం.

జీఓ ఇచ్చినా..

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన మొత్తాలను విడుదల చేయలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు పరీక్షలకు అనుమతించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కారు ఆగమేఘాల మీద జీఓ జారీ చేసింది. ఫీజు, మెస్‌ బిల్లు చెల్లించకపోయినా పరీక్షలకు అనుమతించాలని ఆదేశించింది.

వీటిని అనుసరించి జిల్లా కలెక్టర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అయినప్పటికీ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ యాజమాన్యం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు చెల్లించకపోతే హాస్టళ్ల నిర్వహణ కష్టతరమంటూ చెప్పడంపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.

రిజిస్ట్రార్‌ ఘెరావ్‌..

విద్యార్థులపై ఫీజుల వేధింపులు ఆపాలంటూ బుధవారం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్‌ మాట్లాడుతూ వీసీ, రిజిస్ట్రార్‌లు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే పనిలో నిమగ్నం కావడం గర్హనీయమన్నారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలతో తమకు సంబంధం లేదనడం భావ్యం కాదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చెబుతున్న మాటలు నీటి మూటగానే మిగిలిపోయిందని విమర్శించారు.

పైకి ఆదేశాలు ఇస్తూ క్షేత్రస్థాయిలో బకాయిలు వసూలు చేయాలని మంత్రి చెప్పినట్లు దీన్ని బట్టి అర్థమఅవుతోందన్నారు. తీరు మార్చుకో కపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శి వంశీ, శివా రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి భీమేష్‌, వీరు, నాయకులు మోహన్‌, చంద్రనాయక్‌, గణేష్‌, హరీష్‌, విష్ణు, ఎర్రిస్వామి, రాముడు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Dec 2024 04:05PM

Photo Stories