Jagananna Videshi Vidya Deevena Scheme: విదేశీ విద్యా దీవెనతో ప్రతిభకు పట్టం
కాకినాడ సిటీ: ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీల్లో చదువుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ అన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఆర్ధిక సహకారాన్ని నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి సాంఘిక సంక్షేమశాఖ జేడీ డీవీ రమణమూర్తి, ఇతర అధికారులు, లబ్ధిదారులతో కలిసి జేసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని లబ్ధిదారుల తల్లిదండ్రులకు ఆర్థిక సహకారానికి సంబంధించి మెగా చెక్‌ను అందజేశారు. ఇలక్కియ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవగలిగి ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా ఉన్న విద్యార్థులకు అండగా నిలబడి, విదేశీ విద్యకయ్యే ఫీజును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. టాప్ 50 ర్యాంకులు సాధించిన యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందదన్నారు. జిల్లాలో 12 మంది విద్యార్థులకు రూ. 2.06 కోట్ల మేర లబ్ధి చేకూరుతున్నట్లు తెలిపారు. శెట్టిబలిజ, పట్నాయక్ కార్పొరేషన్ల డైరెక్టర్లు అనుసూరి ప్రభాకరరావు, డి లక్ష్మణరావు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Jagananna Videshi Vidya Deevena 2023: పేద, మధ్యతరగతి విద్యార్థుల పాలిట ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ వరం
కల సాకారమైంది
విదేశాల్లో చదువుకోవాలనే మా బాబు వీరభద్రరాజు కల జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా సాకారమైంది. బాబు ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీలో ఎంఎస్ బయోటెక్నాలజీ చదువుతున్నాడు. పీహెచ్‌డీ చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. పథకం ద్వారా రూ.49 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
– డి రామకృష్ణంరాజు, సత్యకుమారి, రాచపల్లి, ప్రత్తిపాడు మండలం.
లబ్ధిదారులందరి తరపున ధన్యవాదాలు
మా అబ్బాయి పేరు బంటుపల్లి సురంజన్. యూఎస్‌ఏలోని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్‌లో హెల్త్ ఇన్ఫ్‌ర్మాటిక్స్ చదువుతున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలున్న వర్శిటీలో చదువుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. రూ. 87 లక్షల వరకు లబ్ధి జరుగుతుంది. జగనన్న విదేశీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.
– బి వెంకటేశ్వరరావు, శివనాగగంగా పార్వతి, కాకరాపల్లి, కోటనందూరు మండలం.