Jagananna Videshi Vidya Deevena 2023: విదేశాల్లో చదువుకోలేని పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన బాసట
ఏలూరు(మెట్రో): ప్రతిభ ఉండి కూడా పేదరికం కారణంగా విదేశాల్లో చదువుకోలేని విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన బాసటగా నిలుస్తుందని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. గురువారం ఏలూరు కలెక్టరేట్‌లో జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమంలో జిల్లాలో 13 మంది లబ్ధిదారులకు రూ.1,25,92,786 చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో ఈ విడతలో ఎస్సీ కేటగిరిలో ఒక విద్యార్థికి రూ.8.25 లక్షలు, బీసీ కేటగిరీకి చెందిన ముగ్గురు విద్యార్థులకు రూ.2.96 లక్షలు, ఈబీసీ కేటగిరీకి చెందిన ఆరుగురు విద్యార్థులకు రూ.55.09 లక్షలు, కాపు కేటగిరీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు రూ.32.89 లక్షలు, మైనార్టీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి వీసా ఖర్చు కోసం రూ.13 వేలు విడుదల చేశామన్నారు. ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. సోషల్ వెల్పేర్ జేడీ జయప్రకాష్, జిల్లా బీసీ సంక్షేమాధికారి నాగరాణి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి కృపావరం పాల్గొన్నారు.
Jagananna Videshi Vidya Deevena Scheme: విద్యార్థుల భవితకు బంగారు బాట