Jagananna Videshi Vidya Deevena 2023: పేద, మధ్యతరగతి విద్యార్థుల పాలిట ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ వరం
రాయచోటి: పేద, మధ్యతరగతి విద్యార్థుల పాలిట ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ వరమని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశీ విద్యా దీవెన రెండో విడత లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయ చోటి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ గిరీషా పీఎస్, వైఎస్సార్ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, మునిసిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులకు వరం లాంటిదన్నారు. విదేశీ విద్యాసంస్థల్లో చదువుకోవాలన్న కోరిక ఉన్న వారికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఈ పథకం ద్వారా 2022–23 సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 మంది విద్యార్థులకు ఒక కోటి 51 లక్ష 86 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పోటీతత్వంలో నిల దొక్కుకోవాలంటే మంచి యూనివర్సిటీలో చదవాలన్నారు. ఈ రోజు అమెరికాలోని సిలికాన్ సిటీలో 40 నుంచి 50 శాతం తెలుగు వారే ఉద్యోగం చేస్తున్నారన్నారు. విద్యార్థులు తమ కలలను కూడా సాకారం చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థి చదవాలనే తలంపుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చారన్నారు. తద్వారా లక్షలాది మంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు అభ్యసించేందుకు కారకులయ్యారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు నాడు–నేడుతో మారిపో యాయన్నారు. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలలో చదవగలిగే ప్రతిభ ఉండి కూడా పేదరికం కారణంగా చదువుకోలేని విద్యార్థులకు బాసటగా నిలబడుతూ వారి విదేశీ విద్యకు అయ్యే పూర్తి ఫీజు జగనన్న ప్రభుత్వం భరిస్తుందన్నారు. మునిసిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషా మాట్లాడుతూ పేదరికం పోవాలంటే చదవన్నదే గొప్ప అస్త్రం అన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే సంకల్పంతో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు మెగా చెక్కును కలెక్టర్, జెడ్పీ ఛైర్మన్, జేసీలు అందజేశారు.
జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 11 మందికి రూ. 1.51 కోట్లు జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్
Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
నేను మదనపల్లె ఇంజినీరింగ్ కళావాలలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. బయట దేశాలలో మంచి కళాశాలలో చేరి రీసెర్చ్ చేసి ఏదో ఒకటి సాధించాలన్నది ఆశయం. విదేశాల్లో చదివించే ఆర్థికస్థోమత మా అమ్మ నాన్నలకు లేదు. విదేశీ విద్యాదీవెనతో సీఎం జగన్ అందిస్తున్న సహకారం కారణంగా నేను విదేశాలకు వెళ్లే అవకాశం దొరికింది. ఇంతటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబమంతా రుణపడి ఉంటాం. – బి.విలియం, మదనపల్లి, అన్నమయ్య జిల్లా
అదృష్టంగా భావిస్తున్నా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో విదేశీ విద్యను అభ్యసించే అవకాశం వచ్చింది. విదేశాల్లో చదువుకోవడానికి పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాం. పేద మధ్య తరగతి కుటుంబాల వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
– సి.దీప, నేతివారిపల్లి, చిట్వేలి మండలం