School Admissions: పిల్లల్ని ఎలాంటి పాఠశాలలో చేర్పించాలి.. ఏ బోర్డ్ పరిధిలో చదివిస్తే బాగుంటుంది..
పాఠశాల విద్య.. భవిష్యత్‌కు పునాది. స్కూల్ స్థాయిలో సరైన సిలబస్, సరైన బోధన, సరైన మార్గ నిర్దేశం లభిస్తేనే.. విద్యార్థి సంపూర్ణ ఎదుగుదల సాధ్యమవుతుంది. అందుకే పిల్లల్ని స్కూల్‌ల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటారు. ఎలాంటి పాఠశాలలో చేర్పించాలి.. ఏ బోర్డ్ పరిధిలో చదివిస్తే బాగుంటుంది.. ఏ బోర్డ్ సిలబస్ అనుకూలంగా ఉంటుంది.. ఇలా అనేక కోణాల్లో కసరత్తు చేస్తారు. నిర్దిష్టంగా ఏదైనా ఒక బోర్డ్‌ను ఎంపిక చేసుకునేముందు వాటి కరిక్యులం, బోధన పద్ధతులు తెలుసుకుంటే.. స్కూల్ ఎంపిక సులభమే అంటున్నారు నిపుణులు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో త్వరలోనే ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ప్రధానంగా గుర్తింపు పొందిన బోర్డ్‌లు, బోధన విధానాలు, వాటి ప్రత్యేకతలపై విశ్లేషణ...
- స్టేట్ బోర్డ్‌లు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఆధ్వర్యంలో పాఠశాలలు
- పాఠశాల ఎంపికలో బోర్డ్ కూడా కీలకమే అంటున్న నిపుణులు
- త్వరలో ప్రారంభం కానున్న 2022 స్కూల్ ప్రవేశాలు
సాధారణంగా నవంబర్, లేదా డిసెంబర్‌ల్లో పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. జనవరి లేదా ఫిబ్రవరి నుంచే తదుపరి విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వారికి అనువైన బోర్డ్‌లను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది.
ప్రధానంగా మూడు బోర్డ్‌లు
ప్రస్తుతం దేశంలోని పాఠశాల విద్యలో ప్రధానంగా మూడు బోర్డ్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. అవి.. జాతీయ స్థాయిలోని సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), సీఐఎస్‌సీఈలు కాగా; రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాల ఆధ్యర్యంలోని స్టేట్ బోర్డ్‌లు. ఈ మూడు బోర్డ్‌ల పరిధిలో కరిక్యులం, బోధన పద్ధతులు వేర్వేరుగా అమలవుతున్నాయి. తల్లిదండ్రులు ఆయా బోర్డుల కరిక్యులం, బోధన విధానాలను పరిశీలించడం ద్వారా తమ పిల్లలకు సరితూగే బోర్డ్‌ను గుర్తించి.. దానికి అనుబంధ పాఠశాలల్లో చేర్పించొచ్చు.
సీబీఎస్‌ఈ.. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. సీబీఎస్‌ఈ! జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన బోర్డ్ ఇది. ఈ బోర్డ్ అనుసరిస్తున్న కరిక్యులం, బోధన విధానాలు విద్యార్థుల ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్‌కు వీలు కల్పించే విధంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ప్రధానంగా ప్రాక్టికాలిటీ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, రెగ్యులర్ మానిటరింగ్.. సీబీఎస్‌ఈ విధానం ప్రత్యేకతగా చెప్పొచ్చు. విద్యార్థులు క్లాస్ రూం బోధనకే పరిమితం కాకుండా..తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం సీబీఎస్‌ఈలో ఉంటోంది. అదే విధంగా ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడే.. దానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో అన్వయించే విధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు సీబీఎస్‌ఈ కరిక్యులంలో ప్రాధాన్యం లభిస్తోంది.
సెకండరీ స్థాయి
ప్రాథమిక స్థాయిలోనే కాకుండా..సెకండరీ, హయ్యర్ సెకండరీ దశల్లోనూ వినూత్న విధానాలతో సీబీఎస్‌ఈ కరిక్యులం అమలు చేస్తోంది. పదో తరగతి స్థాయిలో అయిదు సబ్జెక్ట్‌లలో బోధన, పరీక్షలు జరుగుతున్నాయి. అవి.. ఇంగ్లిష్(ఫస్ట్ లాంగ్వేజ్), సెకండ్ లాంగ్వేజ్(హిందీ), మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్. ఇవి కాకుండా విద్యార్థులు తమ ఆసక్తి మేరకు అదనంగా..మరో సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ లేదా కామర్స్, పెయింటింగ్, మ్యూజిక్, హోంసైన్స్, ఫౌండేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
హయ్యర్ సెకండరీ
- సీబీఎస్‌ఈ బోర్డ్ పరిధిలోని హయ్యర్ సెకండరీ అంటే +1, +2(ఇంటర్మీడియెట్ తత్సమాన) దశలో అనుసరిస్తున్న కరిక్యులం, బోధనతో.. నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో ముందు నిలిచే సామర్థ్యం లభిస్తుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో ప్రధానంగా మూడు స్ట్రీమ్(గ్రూప్)లు అందుబాటులో ఉన్నాయి. అవి.. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్.
- సైన్స్ స్ట్రీమ్‌లో..మెడికల్, నాన్‌మెడికల్ పేరుతో రెండు సబ్ స్ట్రీమ్స్ విధానం అమలవుతోంది.
- నాన్‌మెడికల్ స్ట్రీమ్‌లో.. విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాల్సి ఉంటుంది. దీన్ని పీసీఎం గ్రూప్‌గా పిలుస్తున్నారు.
- మెడికల్ స్ట్రీమ్‌లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌తోపాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాలి. దీన్నే పీసీబీ గ్రూప్‌గా పేర్కొంటున్నారు.
- కామర్స్ స్ట్రీమ్‌లో.. అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్‌తోపాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది.
- హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో.. విద్యార్థులకు కోర్ సబ్జెక్ట్ అనే విధానంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ.. ఇలా అనేక సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉంటాయి.
ఐసీఎస్‌ఈ.. ప్రాక్టికల్ అప్రోచ్
- పాఠశాల విద్యలో జాతీయ స్థాయిలో.. ప్రాచుర్యం పొందిన మరో బోర్డ్.. ఐసీఎస్‌ఈ. కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నేతృత్వంలో ఐసీఎస్‌ఈ బోర్డ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ బోర్డ్ పరిధిలో క్లాస్10, క్లాస్12, సీవీఈ(ఇయర్ 12) పేరిట తరగతులు అందుబాటులో ఉన్నాయి.
- క్లాస్10నే ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ(ఐఎస్‌సీ) ఎడ్యుకేషన్‌గా పిలుస్తారు. పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉండే బోధన ఫలితంగా విద్యార్థులకు తాము నేర్చుకున్న అంశాలపై పరిపూర్ణ అవగాహన లభిస్తుంది.
- క్లాస్12 విషయంలో.. రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సును మొదటి సంవత్సరం క్లాస్11గా, రెండో సంవత్సరం క్లాస్12గా పేర్కొంటారు. సర్టిఫికెట్ మాత్రం ఐఎస్‌ఈ క్లాస్12 అని పేర్కొంటారు. సబ్జెక్ట్‌ల పరంగా క్లాస్11 స్థాయిలో.. ఇంగ్లిష్, ఇండియన్ లాంగ్వేజ్, మోడ్రన్ ఫారెన్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్, ఎలక్టివ్ ఇంగ్లిష్ వంటి కంపల్సరీ సబ్జెక్ట్‌లతోపాటు ఆర్ట్స్,హ్యుమానిటీస్,అకౌంట్స్,కామర్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ వంటి విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. ఇదే విధంగా క్లాస్12 కరిక్యులం కూడా అమలవుతుంది.
- సీవీఈ క్లాస్12 పేరుతో సర్టిఫికెట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ బోధన సాగుతోంది.
- ఐసీఎస్‌ఈ సిలబస్ పరిధి విస్తృతంగా ఉంటుంది. కానీ, బోధనలో ప్రాక్టికల్ అప్రోచ్ ఫలితంగా ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో విదేశీ విద్య ప్రవేశాలకు దీటుగా పోటీ పడే సామర్థ్యం లభిస్తుంది.
స్టేట్ బోర్డ్‌లు.. ఇలా
స్టేట్ బోర్డ్‌లు.. ఆయా రాష్ట్రాల పాఠశాల విద్యా శాఖ పర్యవేక్షణలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్య దశలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు దశల్లో విద్యార్థుల్లో అన్ని రకాలుగా నైపుణ్యాలు అందిం చేలా కరిక్యులంను రూపొందిస్తున్నారు. ఈ బోర్డ్‌ల పరిధిలోని పాఠశాలల్లో వసతుల సమస్య, బోధన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంటర్ బోర్డ్‌లు
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల విషయంలో.. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులను ఒకే బోర్డ్ పరిధిలో చదివే అవకాశం ఉంది. స్టేట్ బోర్డుల విషయంలో మాత్రం పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కోసం ప్రత్యేకంగా..బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పేరిట ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌ల పరిధిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూప్‌లు ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో చేరిన అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్,సెకండ్ లాంగ్వేజ్‌తోపాటు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా నిర్దేశించిన మూడు సబ్జెక్ట్‌లను చదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ బోర్డ్ మాదిరిగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం స్టేట్ బోర్డ్ సిలబస్‌లో ఉండదు. ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు స్టేట్ బోర్డ్‌ను ఎంచుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం.. సీబీఎస్‌ఈతో పోల్చితే స్టేట్ బోర్డ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల సిలబస్ పరిపూర్ణంగా ఉండటమే. వీటిలో పట్టు సాధించిన విద్యార్థులు జేఈఈమెయిన్,అడ్వాన్స్‌డ్,ఎంసెట్ వంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు సొంతం చేసుకునే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు.
ఐబీ డిప్లొమా.. ఇలా
ఇంటర్నేషనల్ బాక్యులరేట్ డిప్లొమా.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఐబీగా గుర్తింపు. ఇంటర్నేషనల్ బాక్యులరేట్ ఆర్గనైజేషన్ అందిస్తున్న ఈ కోర్సు.. ఇంటర్మీడియెట్, +2లకు తత్సమానమైనది. ముఖ్యంగా పదో తరగతి తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉండే కోర్సు ఇది. పదో తరగతి అర్హతతో ప్రవేశం లభించే ఈ కోర్సు కూడా రెండేళ్ల పాటు గ్రేడ్11, గ్రేడ్12 పేరుతో ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌తోపాటు ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్‌ను చదవాల్సి ఉంటుంది. దీనిద్వారా యూజీ స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు విభాగాల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అన్ని విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కామర్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు కూడా ఉంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగంలో ఐబీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐజీసీఎస్‌ఈ.. ఎ లెవల్
ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. ఐజీసీఎస్‌ఈ. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలు యూజీ స్థాయిలో ప్రవేశాల పరంగా ప్రత్యేక గుర్తింపు ఇస్తున్న కోర్సు ఇది. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నేతృత్వంలోని ఈ కోర్సును ఎ లెవల్ కోర్సుగా పరిగణిస్తున్నారు. ఈ కోర్సు రెండు విభాగాలుగా రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. తొలి ఏడాది మొదటి విభాగంలో.. అడ్వాన్స్‌డ్ సబ్సిడరీ పేరుతో ఉండే 4 సబ్జెక్ట్‌లను చదవాల్సి ఉంటుంది. తొలి ఏడాది మొదటి విభాగం పూర్తి చేసుకున్న తర్వాత.. రెండో ఏడాది మూడు సబ్జెక్ట్‌లు చదవాల్సి ఉంటుంది.
ఎంపికలో ఎలా
జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఐఐటీల్లో చేరడం, ఎంబీబీఎస్ చదవడం లక్ష్యంగా చేసుకుంటే.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్ పరిధిలో చదివితే మేలు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే విదేశీ విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఐబీ, ఐజీసీఎస్‌ఈ బోర్డ్‌ల కోర్సులలో చేరితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు.. ముఖ్యాంశాలు
- ప్రాక్టికాలిటీ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న సీబీఎస్‌సీ కరిక్యులం.
- జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో మెరుగైన స్కోర్లకు సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్‌లు చదవడం ఉపయుక్తం.
- మ్యాథమెటిక్స్,సైన్స్‌ల విషయంలో సీబీఎస్‌ఈతో పోల్చితే స్టేట్ బోర్డ్‌ల సిలబస్‌తో కొంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం.
- అంతర్జాతీయ విద్య అభ్యసించాలనుకుంటే ఐబీ, ఐజీసీఎస్‌ఈ బోర్డ్‌లలో చదవడం మేలు.
అన్నింటినీ పరిగణించాలి
ఒక పాఠశాలను, బోర్డ్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల మానసిక పరిస్థితి, వారి లెర్నింగ్∙సామర్థ్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఆయా స్కూల్స్‌లో నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయా.. టీచింగ్ స్టాఫ్ అర్హతలు వంటి వాటిని తప్పనిసరిగా పరిశీలించాలి.
- సీతా కిరణ్, రీజనల్ ఆఫీసర్, డీఏవీ ఇన్‌స్టిట్యూట్స్
చదవండి: CBSE: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2021.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా..