Skip to main content

CISF (AC): ఎల్‌డీసీఈ నోటిఫికేష‌న్ విడుద‌ల.. ఎంపిక విధానం, అర్హతలు, రాత పరీక్ష వివ‌రాలు ఇలా..

CISF (AC) LDCE-2022 Notification released
CISF (AC) LDCE-2022 Notification released

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌.. సంక్షిప్తంగా సీఐఎస్‌ఎఫ్‌! దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కీలక పారిశ్రామిక సంస్థల భద్రత కోసం.. ఏర్పాటైన ప్రత్యేక సాయుధ దళాల విభాగం ఇది! ఈ విభాగంలో నిరంతరం కొలువుల భర్తీ జరుగుతోంది. తాజాగా సీఐఎస్‌ఎఫ్‌లో.. అసిస్టెంట్‌ కమాండెంట్స్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్‌–2022కు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యలో.. సీఐఎస్‌ఎఫ్‌ (ఏసీ)–ఎల్‌డీసీఈ–2022 ఎంపిక విధానం, అర్హతలు, రాత పరీక్ష, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం...

  • సీఐఎస్‌ఎఫ్‌ (ఏసీ)–ఎల్‌డీసీఈ–2022 నోటిఫికేషన్‌ విడుదల 
  • ఎంపిక ప్రక్రియలో నెగ్గితే సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ (ఎగ్జిక్యూటివ్‌) కొలువు
  • ఉద్యోగ ప్రతిభతో ఐజీ, ఏడీజీ స్థాయికి చేరుకునే అవకాశం

సీఐఎస్‌ఎఫ్‌.. ప్రస్తుతం దేశంలో అత్యంత కీలకమైన భద్రతా దళం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమలు, క్షిపణి పరీక్ష కేంద్రాలు, విమానాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక సంస్థల భద్రత కోసం కేంద్ర హోం శాఖ పరిధిలో ప్రత్యేకంగా సీఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. ఇంతటి కీలకమైన విభాగంలో.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్ష.. సీఐఎస్‌ఎఫ్‌(ఏసీ) లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్‌.
బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, సబ్‌–ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ హోదాలో నాలుగేళ్ల సర్వీస్‌ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా.. నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియ ఇది. ఇప్పటికే.. ఇతర భద్రత విభాగాలు.. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐ, సీఐ హోదాల్లో పని చేస్తూ.. కేంద్ర దళాల్లోకి వెళ్లాలనుకుంటున్న వారికి ఇది చక్కటి మార్గంగా చెప్పొచ్చు.

  • పోస్టులు: అసిస్టెంట్‌ కమాండెంట్‌
  • మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 19 
  • వేతన శ్రేణి: రూ.56,100– రూ.1,77, 500


చ‌ద‌వండి: కమాండెంట్‌ ఆఫీసర్‌ పరీక్ష.. విజయం సాధిస్తే..

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • జనవరి 1, 2022 నాటికి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జీడీ) లేదా ఇన్‌స్పెక్టర్‌(జీడీ) హోదాలో నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకోవాలి.
  • వయో పరిమితి: ఆగస్ట్‌ 1, 2022 నాటికి 35ఏళ్లలోపు ఉండాలి(ఆగస్ట్‌ 2, 1987 తర్వాత జన్మించి ఉండాలి). ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా అయిదేళ్ల సడలింపు ఇస్తారు.

మూడు దశల ఎంపిక ప్రక్రియ

సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్స్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్ట్‌ల భర్తీకి మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇవి.. 

  • రాత పరీక్ష 
  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ. 

రాత పరీక్ష

ముందుగా యూపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 

  • పేపర్‌–1: జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌. ఈ విభాగంలో 300 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం–రెండున్నర గంటలు. ఈ పేపర్‌ను పార్ట్‌–ఎ, పార్ట్‌–బి పేరుతో రెండు విభాగాల్లో నిర్వహిస్తారు.
  • పార్ట్‌–ఎలో జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌(75 ప్రశ్నలు–150 మార్కులు), పార్ట్‌–బిలో ప్రొఫెషనల్‌ స్కిల్స్‌(75 ప్రశ్నలు–150 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్‌–2: ఎస్సే, ప్రెసిస్‌ రైటింగ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌–ఈ పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. అందుబాటులో ఉండే సమయం రెండు గంటలు.

రెండో దశ.. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌

ఎంపిక ప్రక్రియలో రెండో దశ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌. ఈ దశలో అభ్యర్థులు నిర్దేశిత ఈవెంట్లలో రాణించాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్లకు సంబంధించి పురుష, మహిళా అభ్యర్థులకు వేర్వేరుగా ఉత్తీర్ణత ప్రమాణాలు (సమయం, దూరం తదితర) పేర్కొన్నారు. వివరాలు..

ఈవెంట్‌ పురుషులు మహిళలు
100 మీటర్ల పరుగు పందెం 16 సెకన్లు 18 సెకన్లు
800 మీటర్ల పరుగు పందెం 3ని‘‘45సెకన్లు 4ని‘‘45 సెకన్లు
లాంగ్‌ జంప్‌ 3.5 మీటర్లు 3 మీటర్లు
(గరిష్టంగా మూడు అవకాశాలు)
షాట్‌పుట్‌(7.26కి) 4.5 మీటర్లు –––
  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో షాట్‌పుట్‌ నుంచి మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పిస్తున్నారు.
  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి.. తదుపరి దశలో మెడికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ దశలో అభ్యర్థులు సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాలు పేర్కొన్న నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి. మెడికల్‌ ఎగ్జామినేషన్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ

  • యూపీఎస్‌సీ నిర్వహించే సీఐఎఎస్‌(ఏసీ) రాత పరీక్షలో, ఆ తర్వాత జరిపే ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. అభ్యర్థులు పొందిన మార్కులు, చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకొని.. చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • పర్సనల్‌ ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో అభ్యర్థుల వైఖరి, దృక్పథం, ఆహార్యం, ఉద్యోగానికి సరితూగే తత్వం, జనరల్‌ ఇంటెలిజెన్స్, ఆసక్తి, విశ్లేషణ నైపుణ్యాలు, వృత్తి సంబంధిత ప్రశ్నలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసం, ధైర్యసాహసాలు, చిత్తశుద్ధి, ఒత్తిడిని తట్టుకునే తత్వం, సమైక్యతా దృక్పథం వంటి అంశాలను పరిశీలిస్తారు.
  • ఈ దశలోనూ విజయం సాధిస్తే.. అసిస్టెంట్‌ కమాండెంట్‌(ఎగ్జిక్యూటివ్‌)గా నియమించొచ్చని సీఐఎఎస్‌ఎఫ్‌కు సిఫార్సు చేస్తారు. దీనికి అనుగుణంగా సీఐఎస్‌ఎఫ్‌ నుంచి నియామక పత్రం అందిస్తారు.

చ‌ద‌వండి: ఇంటర్వూ సభ్యులు అభ్యర్థిల్లో ముఖ్యంగా పరీక్షించేవి ఇవే..

రెండేళ్ల ప్రొబేషన్‌

మొత్తం ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఏసీ(ఎగ్జిక్యూటివ్‌)గా నియమితులైన అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణనిస్తారు. ఆ తర్వాత సర్వీస్‌లోకి తీసుకుంటారు. ఇలా సర్వీస్‌లో చేరిన అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేషన్‌ పిరియడ్‌లో ఉండాలి. ప్రొబేషన్‌ పిరియడ్‌లో ప్రతిభతో శాశ్వత కొలువుకు మార్గం వేసుకోవచ్చు.

ఏసీ నుంచి ఐజీ, డీజీ వరకు

  • అసిస్టెంట్‌ కమాండెంట్‌(ఎగ్జిక్యూటివ్‌)గా ఎంపికై.. ప్రొబేషన్‌ కూడా సంతృప్తికరంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు..సర్వీస్‌ నిబంధనల ప్రకారం.. ఐజీ, డీజీ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఏసీ.. ఆపై స్థాయి పోస్ట్‌ల వివరాలు.. 
  • అసిస్టెంట్‌ కమాండెంట్‌ 
  • డిప్యూటీ కమాండెంట్‌ 
  • సెకండ్‌ ఇన్‌ కమాండ్‌
  • కమాండెంట్‌ 
  • డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ 
  • ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ 
  • అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ 
  • స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్, డైరెక్టర్‌ జనరల్‌.
  • ప్రస్తుతం అమల్లో ఉన్న సర్వీస్‌ నిబంధనలు పదోన్నతులు ఇచ్చే క్రమంలో అనుసరిస్తున్న కనీస సర్వీస్‌ అర్హత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏసీగా కెరీర్‌ ప్రారంభించిన వారు ఐజీ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సర్వీస్‌లో అత్యంత ప్రతిభా పాటవాలతో బాధ్యతలు నిర్వహిస్తే.. ప్రత్యేక గుర్తింపు లభించి ఏడీజీ, డీజీ స్థాయికి కూడా ఎదిగే వీలుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 21.12.2021
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు కాపీని, ఇతర సర్టిఫికెట్లను పంపడానికి చివరి తేదీ: డిసెంబర్‌ 30, 2021 (అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు కాపీని ప్రింట్‌ తీసుకుని, దానికి సర్వీస్‌ ఇతర నిర్దేశిత సర్టిఫికెట్లు జత చేసి సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది)
  • సీఐఎస్‌ఎఫ్‌ (ఏసీ)–ఎల్‌డీసీఈ–2022 పరీక్ష తేదీ: మార్చి 13, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

రాత పరీక్షలో రాణించేలా

  • సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ(ఎగ్జిక్యూటివ్‌) పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష ఎంతో కీలకమైంది. ఇందులో విజయం సాధించేందుకు అభ్యర్థులు సిలబస్‌ అంశాలపై ఇప్పటి నుంచే దృష్టిసారించాలి. 
  • పేపర్‌–1లో జనరల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్‌ సైన్స్, జనరల్‌ అవేర్‌నెస్,సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అంశాలపైనా దృష్టిపెట్టాలి. అదే విధంగా.. చరిత్రకు సంబంధించిన అంశాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజికాభివృద్ధి తదితరాలపై పట్టు సాధించాలి. భారతదేశ చరిత్ర, భారత, ప్రపంచ భౌగోళిక అంశాలు, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • పేపర్‌–1లోనే ప్రొఫెషనల్‌ స్కిల్స్‌కు సంబంధించి ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఫైర్‌ ఫైటింగ్, విపత్తు నిర్వహణ, ఏవియేషన్‌ సెక్యూరిటీ, క్రైమ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌–గూఢచర్యం, విద్రోహం, భద్రత కల్పన చర్యలు, సెక్యూరిటీ ఆఫ్‌ డీఏఈ, స్పేస్‌ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల ఉపయోగాలు, అలారమ్, డిటెక్షన్, యాక్సెస్‌ కంట్రోల్, ఫైర్‌ సేఫ్టీ,బాంబ్‌ డిస్పోజబుల్, వీఐపీ సెక్యూరిటీ ఇంటర్నల్‌ సెక్యూరిటీ అండ్‌ ఎలక్షన్‌ డ్యూటీస్‌కు సంబంధించిన నాలెడ్జ్‌ తప్పనిసరి.
  • పేపర్‌–1లో అడిగే ‘లా’(న్యాయ శాస్త్ర) ప్రశ్నలకు సంబంధించి.. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, ఇండియన్‌ పీనల్‌ కోడ్, ఎవిడెన్స్‌ యాక్ట్, కార్మిక చట్టాలు లేబర్‌ లాస్‌ (ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్, వర్క్‌మెన్‌ కాంపన్సేషన్‌ యాక్ట్, ఈపీఎఫ్‌ యాక్ట్‌), ఇతర విద్రోహ చర్యలు, మానవ హక్కులను అధ్యయనం చేయాలి. 
  • కంప్యూటర్‌ స్కిల్స్‌అండ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి కంప్యూటర్‌ సెక్యూరిటీ, బేసిక్‌ కంప్యూటర్‌ ఆపరేషన్స్, బేసిక్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌పై ప్రశ్నలు అడిగే అవకాశముంది. అదే విధంగా సర్వీస్‌ రూల్స్, హెచ్‌ఆర్‌ అంశాలైన–సీసీఏ రూల్స్, సీఐఎస్‌ఎఫ్‌ యాక్ట్‌ అండ్‌ రూల్స్, సీఐఎస్‌ఎఫ్‌ సంబంధిత హెచ్‌ఆర్‌ విధులు గురించి కూడా తెలుసుండాలి.
  • పేపర్‌ 2: ఎస్సే, ప్రెసిస్‌ రైటింగ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: ఈ పేపర్‌లో అభ్యర్థి అభిప్రాయాలను, వారిలోని స్వీయ విశ్లేషణ శక్తిని పరీక్షించే విధంగా అభ్యర్థులు వ్యాసాన్ని సమగ్రంగా, అర్థమయ్యేలా రాయాలి. సమాధానాలు రాసేటప్పుడు వ్యాకరణ, పద దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రెసిస్‌ రైటింగ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఇచ్చిన ప్యాసేజ్‌ సారాంశాన్ని అభ్యర్థులు అవగాహన చేసుకున్న తీరును.. అదే విధంగా, కాంప్రహెన్షన్‌కు సంబంధించి షార్ట్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తీరును సునిశితంగా పరిశీలిస్తారు. కాబట్టి ఒక ప్యాసేజ్‌ను చదివేటప్పుడే అందులోని కీలకమైన అంశాలు, వాటి మూలం, వాటి ప్రభావం తదితర అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. అదే విధంగా ప్రెసిస్‌ రైటింగ్‌ విషయంలో కీలక అంశాలు లోపించకుండా రాయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి.
  • ఇలా ప్రిపరేషన్‌లోనే నిర్దిష్ట వ్యూహంతో వ్యవహరిస్తే కొలువు సాధించేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.


చ‌ద‌వండి: Civils Prelims Guidance

Published date : 06 Dec 2021 06:38PM

Photo Stories