Skip to main content

కమాండెంట్‌ ఆఫీసర్‌ పరీక్ష.. విజయం సాధిస్తే..

సాహసంతో కూడిన ఉద్యోగాలంటే యువతకు ఆసక్తి ఎక్కువ.

 అలాంటి అభ్యర్థులకు చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ప్రతి ఏటా నిర్వహించే సీఏపీఎఫ్‌ పరీక్ష. మూడంచెల్లో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లోని ఆరు విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. సీఏపీఎఫ్‌– 2021 పరీక్ష ఆగస్టు 8వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో... సీఏపీఎఫ్‌ ఎంపిక
ప్రక్రియ.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

సీఏపీఎఫ్‌ అంటే..
ది సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌కు సంక్షిప్త రూపమే.. సీఏపీఎఫ్‌. యూపీఎస్సీ.. సీఏపీఎఫ్‌ 2021 నోటిఫికేషన్‌ ద్వారా..సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్ఎస్‌జీ), ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)ల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 159 పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

అర్హతలు..
సీఏపీఎఫ్‌–ఏసీకు కనీసం ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం..
సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలుత ఆఫ్‌లైన్‌(పెన్‌–పేపర్‌) విధానంలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే.. పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని సీఏపీఎఫ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్స్‌గా నియమిస్తారు.

పరీక్ష ప్యాట్రన్‌..

  • సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాత పరీక్షలో రెండు పేపర్లు(పేపర్‌1,పేపర్‌ 2) ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటాయి.
  • పేపర్‌–1: జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ 250 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
  • పేపర్‌–2: ఇది డిస్క్రిప్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇందులో జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎస్సే విభాగాన్ని ఇంగ్లిష్‌ లేదా హిందీలో రాయవచ్చు, ప్రిసిస్‌ రైటింగ్, కాంప్రహెన్షన్‌ కాంపోనెంట్స్, ఇతర కమ్యూనికేషన్స్‌/లాంగ్వేజ్‌ స్కిల్స్‌.. ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ నిర్దేశించిన మేరకు ప్రతి పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధించాలి. తొలుత పేపర్‌1 మూల్యాంకనం చేస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే.. పేపర్‌ 2 మూల్యాంకనం జరుగుతుంది. ఆ తర్వాత దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌/ఫిజికల్‌ స్టాండర్ట్‌ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్టులు ఉంటాయి.

పరీక్ష సిలబస్‌..

  • పేపర్‌–1: జనరల్‌ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్‌ విభాగంలో.. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ కీలకంగా నిలుస్తోంది. ఇందులో అడిగే ప్రశ్నలు అభ్యర్థి లాజికల్‌ రీజనింగ్‌ సామర్థ్యాలు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై అవగాహనను పరిశీలించేలా ఉంటాయి. వీటితోపాటు జనరల్‌ సైన్స్, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఆఫ్‌ ఇండియా, ఇండియా అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలు తదితర అంశాలపైనా ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌–2: పార్ట్‌ ఏలో.. 80 మార్కులకు ఇంగ్లిష్‌ లేదా హిందీ ఎస్సే రైటింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఆధునిక భారత చరిత్ర ముఖ్యంగా స్వాతంత్య్ర ఉద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులు, అనలిటికల్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి.
  • పేపర్‌–2: పార్ట్‌ బీలో.. 120 మార్కులకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, ప్రిసిస్‌ రైటింగ్, కమ్యూనికేషన్‌/లాంగ్వేజ్‌ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు కాంప్రహెన్సన్‌ ప్యాసేజ్‌లు, కౌంటర్‌ ఆర్గ్యుమెంట్స్, సింపుల్‌ గ్రామర్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఫిజికల్‌ టెస్ట్‌..
రాత పరీక్షలో ప్రతిభ చూపిన పురుషులు 100 మీటర్ల పరుగును 16 సెకన్లలో, మహిళలు 18 సెకన్లలో పూర్తి చేయాలి. అలాగే 800 మీటర్ల పరుగును పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలోనూ; మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలోనూ పూర్తి చేయాలి. వీటితోపాటు లాంగ్‌ జంప్‌ పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు; షాట్‌ పుట్‌(పురుషులకు మాత్రమే) అంశాల్లోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.

పర్సనాలిటీ టెస్ట్‌..

  • మెడికల్‌ స్టాండర్డ్స్‌ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులను యూపీఎస్సీ ఇంటర్వూ/పర్సనాలిటీ టెస్ట్‌కు పిలుస్తుంది. ఇది 150 మార్కులకు ఉంటుంది.
  • అంతిమంగా రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్టులో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in  
Published date : 04 Aug 2021 04:32PM

Photo Stories