Skip to main content

Central Government Jobs: ఎంబీబీఎస్‌తో.. కేంద్రంలో వైద్య కొలువు

Govt Jobs: UPSC CMS Examination 2022 Notification Released, CMS‌ exam details, selection process
Govt Jobs: UPSC CMS Examination 2022 Notification Released, CMS‌ exam details, selection process

ఎంబీబీఎస్‌ పూర్తి చేశారా.. లేదా.. చివరి సంవత్సరం చదువుతున్నారా?! మెడికల్‌ పీజీ వంటి ఉన్నత చదువులు లేకుండానే.. సుస్థిర కెరీర్‌ అవకాశం కోసం అన్వేషిస్తున్నారా.. ఆకర్షణీయమైన వేతనం కోరుకుంటున్నారా.. అయితే మీకు చక్కటి మార్గం.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే.. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌!! ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. తదుపరి ఎంపిక ప్రక్రియలోనూ విజేతలుగా నిలిస్తే..  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో.. వైద్యులుగా, మెడికల్‌ ఆఫీసర్లుగా కొలువు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది!! ప్రారంభంలోనే రూ.56,100–1,77,500 పే స్కేల్‌ అందుకోవచ్చు.  తాజాగా యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌ ఎగ్జామినేషన్‌–2022కు.. నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీఎంఎస్‌ పరీక్ష వివరాలు, ఎంపిక ప్రక్రియ, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..   

  • వైద్యులు, మెడికల్‌ ఆఫీసర్ల హోదాలో నియామకం
  • రూ.56,100–1,77,500 పే స్కేల్‌తో ప్రారంభ వేతనం
  • ఎంబీబీఎస్‌ అర్హతతోనే సుస్థిర కెరీర్‌కు అవకాశం
  • యూపీఎస్‌సీ సీఎంఎస్‌–2022 ప్రక్రియ మొదలు

వైద్య రంగంలో ఉన్నత కెరీర్‌ సొంతమవ్వాలంటే.. ఎంబీబీఎస్‌తోపాటు పీజీ, డీఎన్‌బీ వంటి స్పెషలైజేషన్లు చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ఎంబీబీఎస్‌ తర్వాత కనీసం ఆరేళ్ల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే.. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా సుస్థిర కొలువు సొంతం చేసుకునేందుకు మార్గంగా నిలుస్తోంది.. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. తాజాగా సీఎంఎస్‌–2022 ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన వివరాలు..

నాలుగు విభాగాలు.. రెండు కేటగిరీలు

  • యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం– కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు విభాగాల్లో.. రెండు కేటగిరీలుగా మొత్తం 687 వైద్యుల పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. 
  • మొత్తం పోస్ట్‌ల సంఖ్య 687
  • కేటగిరీ–1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌– 314
  • కేటగిరీ–2: రైల్వేస్‌లో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–300
  • న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–3
  • ఈస్ట్, నార్త్, సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2) పోస్ట్‌లు–70


చ‌ద‌వండి: NEET 2022: ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్‌.. మార్పులు, చేర్పులు ఇవే.. సన్నద్ధత ఇలా..

అర్హత

  • ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది.
  • కంపల్సరీ రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాకే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తారు.

వయో పరిమితి

  • ఆగస్ట్‌ 1, 2022 నాటికి 32ఏళ్లు మించకూడదు. 
  • సెంట్రల్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు ఆగస్ట్‌ 1,2022 నాటికి 35ఏళ్లు మించకూడదు.
  • ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రెండు దశల ఎంపిక ప్రక్రియ

  • కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ద్వారా పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశలో సీఎంఎస్‌ఈ పరీక్ష ఉంటుంది.
  • ఈ పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌లు సొంతం చేసుకున్న వారితో మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున అంటే 1:2 నిష్పత్తిలో రెండో దశ పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. రాత పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు రెండింటినీ కలిపి  తుది జాబితా రూపొందిస్తారు.


చ‌ద‌వండి: Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివ‌రాలు ఇలా..

రెండు పేపర్లు.. 500 మార్కులు

  • సీఎంఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో తొలి దశగా నిర్వహించే రాత పరీక్ష రెండు పేపర్లుగా 500 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు కేటాయించారు. 
  • పేపర్‌–1 జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ పిడియాట్రిక్స్‌: ఈ పేపర్‌లో జనరల్‌ మెడిసిన్‌ నుంచి 96 ప్రశ్నలు, పిడియాట్రిక్స్‌ నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. ఇలా మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌–2ను మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి.. ఎ) సర్జరీ; బి) గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌; సి) ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌.
  • ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం ప్రశ్నలు 120.
  • ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది.నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3ను మార్కును తగ్గిస్తారు.

మలి దశలో పర్సనాలిటీ టెస్ట్‌

అయిదు వందల మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఆయా శాఖల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో రాత పరీక్ష నుంచి పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల్లోని జనరల్‌ నాలెడ్జ్‌ను, వైద్య రంగం పట్ల వారికున్న సేవాదృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకత్వ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే తుది జాబితాలో చోటు సాధింస్తే.. కొలువు ఖరారైనట్లే.


సీఎంఎస్‌ఈ–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.04.2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఉపసంహరణకు అవకాశం: మే 4 నుంచి మే 10 వరకు
  • సీఎంఎస్‌ఈ పరీక్ష తేదీ: జూలై 17, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://upsconline.nic.in

విజయానికి కదలాలిలా

  • రెండు పేపర్లుగా నిర్వహించే తొలి దశ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి.
  • పేపర్‌–1(జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్‌)లో విజయానికి అభ్యర్థులు కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యురినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, మెటబాలిక్‌ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్‌ –కమ్యూనికబుల్‌ డిసీజెస్, న్యూట్రిషన్‌/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులో–స్కెలిటిల్‌ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్‌ మెడిసిన్‌‡అంశాలపై పట్టు సాధించాలి. 
  • దీంతోపాటు పిడియాట్రిక్స్‌కు సంబంధించి కామన్‌ చైల్డ్‌హుడ్‌ ఎమర్జెన్సీస్, బేసిన్‌ న్యూబార్న్‌ కేర్, నార్మల్‌ డెవలప్‌మెంటల్‌ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్‌ ఇన్‌ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి కల్పించే చికిత్స మార్గాలు, విధానాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

పేపర్‌–2కు ఇలా

పేపర్‌–2లోని మూడు విభాగాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అంశాలు..

  • సర్జరీ: జనరల్‌ సర్జరీకి సంబంధించి గాయాలు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు వంటివాటికి సంబంధించిన శస్త్రచికిత్సల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరలాజికల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ సర్జరీ,ఆఫ్తమాలజీ, అనస్థీసియాలజీ, ట్రామటాలజీ అంశాలను ఔపోసన పట్టాలి. 
  • గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌: ఈ విభాగానికి సంబంధించి గైనకాలజీలో అప్లయిడ్‌ అనాటమీ, అప్లయిడ్‌ ఫిజియాలజీ, జెనిటల్‌ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియాప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్‌ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్‌ పిల్స్, ఆపరేటివ్‌ ప్రొసీజర్, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌: ఇటీవల కాలంలో సీఎంఎస్‌ రాత పరీక్ష విషయంలో కీలకంగా నిలుస్తున్న విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. అభ్యర్థులు ఈ విభాగంలో మంచి మార్కుల కోసం సోషల్‌ అండ్‌ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్‌ మెడిసిన్, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్, ఆక్యుపేషనల్‌ హెల్త్, జెనిటిక్స్‌ అండ్‌ హెల్త్, ఇంటర్నేషనల్‌ హెల్త్, మెడికల్‌ సోషియాలజీ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్,మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. 

సమకాలీన సమస్యలపైనా

సీఎంఎస్‌ అభ్యర్థులు సమకాలీన ఆరోగ్య సమస్యలపైనా దృష్టిసారించడం పరీక్షలో విజయానికి ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రధానంగా కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సీన్లు, వ్యాక్సీన్‌ ప్రయోగాలు, తదితర అంశాల గురించి సమాచారం తెలుసుకోవాలి. అదే విధంగా అంతర్జాతీయంగా కోవిడ్‌ ప్రభావానికి గురైన దేశాలు, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గణాంకాలు, నివేదికలు, యూఎన్‌ఓ నివేదికల్లోని ముఖ్యాంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎంబీబీఎస్‌ పుస్తకాలే సాధనంగా

రాత పరీక్షలో మెరుగ్గా రాణించడానికి అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలనే ఆలంబనగా చేసుకుని కదలాలి. ముందుగా పరీక్ష సిలబస్‌ను పరిశీలించి.. అందులో అంశాలను అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ.. అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో చదవాలి. అదే విధంగా పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

ఆకర్షణీయ వేతనాలు

  • ఇండియన్‌ రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా గ్రూప్‌–ఎ జూనియర్‌ స్కేల్‌తో.. రూ.56,100–రూ.1,77,500 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం లభిస్తుంది.
  • సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్, ఇతర విభాగాల్లోనూ ఇదే వేతన శ్రేణితో ప్రారంభ వేతనం అందుతుంది. 
  • ఆయా విభాగాల్లో సర్వీస్‌లో చేరిన వారు నిర్దిష్ట వ్యవధిలో ప్రొబేషన్‌ పిరియడ్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రొబేషన్‌ పిరియడ్‌లో సంతృప్తికరమైన పనితీరు కనబర్చిన వారికే శాశ్వత కొలువు ఖరారవుతుంది. ఇండియన్‌ రైల్వేస్‌లో ఒక ఏడాది వ్యవధిలో, మిగిలిన విభాగాల్లో రెండేళ్ల వ్యవధిలో ప్రొబేషన్‌ పిరియడ్‌ ఉంటుంది.
  • దీంతోపాటు ఇండియన్‌ రైల్వేస్‌లో ప్రొబేషన్‌తోపాటు ఫౌండేషన్‌ కోర్సు విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు.
  • ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న వారిని జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్లుగా శాశ్వత ప్రాతిపదికగా విధుల్లోకి తీసుకుంటారు.

సర్వీసు ప్రాధాన్యత

సీఎంఎస్‌ఈ అభ్యర్థులు ఆయా విభాగాలకు సంబంధించి తమకు ఆసక్తి ఉన్న విభాగాలను ప్రాధాన్యతలుగా పేర్కొనే అవకాశాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు.. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌లో.. తమకు ఆసక్తి ఉన్న సర్వీసుల ప్రాధాన్యతను వరుస క్రమంలో పేర్కొనొచ్చు. తుది విజేతల జాబితాను రూపొందించేటప్పుడు ఈ ప్రాధాన్యతలను, అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి ఆయా విభాగాల కేటాయింపులో తుది నిర్ణయం తీసుకుంటారు.

చ‌ద‌వండి: Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..

Published date : 15 Apr 2022 01:00PM

Photo Stories