Skip to main content

ఇంటర్వూ సభ్యులు అభ్యర్థిల్లో ముఖ్యంగా పరీక్షించేవి ఇవే..

బోర్డ్‌ సభ్యులు.. అభ్యర్థుల నుంచి సమయస్ఫూర్తి, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ కోరుకుంటున్నారు. ఉదాహరణకు ‘మీరు ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు.

ఆ ప్రాంతంలో ఒక సమస్య ఎదురైంది.. దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటివి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పేటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎదుటి వారిని మెప్పించే విధంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ.. వాటికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.

బాడీ లాంగ్వేజ్‌..
సివిల్స్‌ ఇంటర్వూ అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజŒ విషయంలోనూ ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. సమాధానాలిచ్చేటప్పుడు హావభావాలను నియంత్రించుకోవాలి. కాళ్లు చేతుల కదలికలు పరిమితంగా ఉండేట్లు చూసుకోవాలి. అందరితో ఐ కాంటాక్ట్‌ మెయింటెన్‌ చేయాలి. హుందాగా వ్యవహరించాలి. డ్రెస్‌ పరంగా పురుష అభ్యర్థులు లైట్‌ కలర్‌ షర్ట్స్‌ ధరించడం మేలు. అదే విధంగా మహిళా అభ్యర్థులు చీర, లేదా సల్వార్‌ కమీజ్‌లను ధరించి ఇంటర్వూకు హాజరవడం సదభిప్రాయం కలిగేలా చేస్తుంది.

పాలన నైపుణ్యాల పరిశీలన..
సివిల్స్‌ ఇంటర్వూల్లో ప్రధానంగా అభ్యర్థుల పాలనాపరమైన నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సమస్యల పట్ల స్పందించే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం వంటి వాటిని పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు సమకాలీన అంశాలు, సమస్యలపై అవగాహన, పరిష్కారాలను చూపే నైపుణ్యాలు పెంచుకోవాలి. సమాధానం ఇచ్చేటప్పుడు స్పష్టమైన భావ వ్యక్తీకరణ ప్రధానం.
– శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌.

కరెంట్‌ ఈవెంట్స్‌కు ప్రాధాన్యం..
సివిల్స్‌ ఇంటర్వూలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కరెంట్‌ ఈవెంట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ సన్నద్ధమవ్వాలి. అదే విధంగా ప్రొఫెషనల్‌గా ఇప్పటి వరకు నిర్వహించిన విధుల్లో సాధించిన ప్రగతి, అవి సంస్థకు ఉపయోగపడిన తీరు గురించి చెప్పగలగాలి. సామాజిక సమస్యల పట్ల అవగాహనతో పాటు, ఆయా అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి.
–దురిశెట్టి అనుదీప్, సివిల్స్‌ 2018 విజేత.

ఇంకా చదవండి: part 3: సివిల్స్‌ ఇంటర్వూలో విజయం వైపు సాగండిలా.. ప్రభుత్వ కొలువు కొట్టండలా..

Published date : 01 Jul 2021 04:01PM

Photo Stories