Skip to main content

సివిల్స్ మెయిన్స్ 2017 కటాఫ్ ఎంత..!?

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో నిర్ణయాత్మకమైన రెండో దశ. తుది దశ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కు అర్హత సాధించాలంటే మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ చూపడం తప్పనిసరి. దేశవ్యాప్తంగా సివిల్స్ పరీక్షలు ఇటీవల ముగిసిన నేపథ్యంలో మెయిన్స్ ఎగ్జామినేషన్-2017 తీరుతెన్నులపై విశ్లేషణ.
అక్టోబర్ 28 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ -2017కు జాతీయ స్థాయిలో దాదాపు 13 వేల మంది అర్హత సాధించారు. 70 శాతం మంది వరకు అభ్యర్థులు హాజరైనట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ కేంద్రంలో దాదాపు 600 మంది, విజయవాడ కేంద్రంలో 100 మంది పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. మెయిన్స్‌లో 45 నుంచి 50 శాతం మార్కులు పొందగలమనే ధీమా ఉన్న అభ్యర్థులు.. ఇంటర్వ్యూకు సన్నద్ధత ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జనరల్ ఎస్సే:
  • మెయిన్స్‌లో చాలా కీలకంగా భావించే జనరల్ ఎస్సేలో అడిగిన ప్రశ్నలు.. జనరల్ స్టడీస్‌లోని ఇతర అన్ని పేపర్లలోని అంశాలకు సంబంధమైనవిగా ఉన్నాయి.
  • మొత్తం రెండు సెక్షన్లలో.. ఒక్కో సెక్షన్‌లో 4 ప్రశ్నల చొప్పున అడిగిన జనరల్ ఎస్సేలో.. ప్రతి సెక్షన్ నుంచి ఒక్కో ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఒక్కోటి 1000-1200 పదాల్లో మూడు గంటల్లో 2ఎస్సేలు రాయాలి.
  • ఒక్కోదానికి 125 మార్కుల చొప్పున జనరల్ ఎస్సేకు మొత్తం 250 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో.. కరెంట్ అఫైర్స్, ఎకానమీ, ఎథిక్స్, సొసైటీ, పర్యావరణం, సోషల్ మీడియా, మహిళలు, వ్యవసాయం, అంతర్జాతీయ సంబంధిత ప్రశ్నలు ఎదురయ్యాయి.
  • ఉదాహరణకు.. We may brave human laws but cannot resist natural laws అనే ప్రశ్ననే పరిగణనలోకి తీసుకుంటే.. ఇది ప్రకృతి వనరులు, పర్యావరణానికి అన్వర్తించుకునే ప్రశ్న. అదే విధంగా.. Impact of the new economic measures on fiscal ties between the union and states in India ప్రశ్న ఎకానమీకి సంబంధించినది.
  • ఇలా దాదాపు అన్ని ప్రశ్నలు జనరల్ స్టడీస్‌లోని ఇతర పేపర్లకు అనుబంధంగా పేర్కొనొచ్చు. ప్రశ్నల తీరు, ఆశించిన సమాధాన శైలిని పరిగణనలోకి తీసుకుంటే.. విశ్లేషణాత్మకంగా రాయడం తప్పనిసరి.
  • అభ్యర్థులకు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు సమకాలీన పరిణామాలపై అవగాహన ఉండాల్సిన విధంగా ప్రశ్నలు కనిపించడం గమనార్హం.
  • ఈ పేపర్‌లో మొత్తం 250 మార్కులకుగాను 150 మార్కుల వరకు సాధించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  • జనరల్ ఎస్సే (2 ఎస్సేలు, 250 మార్కులు; 3 గంటల సమయం)
జీఎస్ పేపర్-1 :
  • జీఎస్ పేపర్-1లో మొత్తం 20 ప్రశ్నలు ఉండగా.. వీటిలో 10 మార్కుల ప్రశ్నలు పది, 15 మార్కుల ప్రశ్నలు పది. జాగ్రఫీ నుంచి ఎనిమిది, సామాజిక అంశాల నుంచి అయిదు, హిస్టరీ నుంచి ఏడు ప్రశ్నలు వచ్చాయి.
  • హిస్టరీ నుంచి ప్రశ్నలు పరోక్ష విధానంలో అడగటంతో.. అభ్యర్థులు విశ్లేషణాత్మక దృక్పథంతో సమాధానం రాయాల్సిన పరిస్థితి.
  • సబ్జెక్టుపై పట్టుతో పాటు సమకాలీన పరిణామాలైన వాతావరణం, సాగు, వరదలు, రుతుపవనాలు వంటివాటిపై అవగాహన కలిగిన అభ్యర్థులకు జాగ్రఫీ ప్రశ్నలు మంచి మార్కులు తెచ్చిపెట్టేవే.
  • సామాజిక అంశాలపై ముఖ్యంగా భారతీయ సమాజం ప్రత్యేక లక్షణమైన స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ లవ్ (సహనం, ప్రేమ), డైవర్సిటీ ఆఫ్ ఇండియా (భిన్నత్వం), రిలీజియస్‌నెస్ /రిలీజియోసిట్ (ధార్మికత/మత సంబంధమైన ), కమ్యూనలిజం (మతతత్వం), 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణోద్యమ కాలంలో మహిళల సమస్యలు తదితరాలకు సంబంధించిఅడిగిన ప్రశ్నలు అభ్యర్థికి భారతీయ సమాజంతో పాటు, ప్రస్తుతం ఎదురవుతున్న సామాజిక సమస్యలపై ఉన్న లోతైన, నిజమైన సహజ అవగాహనను పరీక్షించేలా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం.
    ఉదాహరణకు.. "The growth of cities as I.T. hubs has opened up new avenues of employment, but has also created new problems." Substantiate this statement with examples.
  • సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో తాజా పరిణామాలతో పాటు కోర్ అంశాల నుంచి కూడా అడగటం గమనార్హం.
  • ఈ పేపర్‌లో కూడా అభ్యర్థులు మొత్తం 250 మార్కులకు గాను 120 నుంచి 140 మార్కుల వరకు సాధించే అవకాశముంది.
  • జనరల్ స్టడీస్ పేపర్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ; మొత్తం మార్కులు 250, సమయం మూడు గంటలు)
జనరల్ స్టడీస్ పేపర్-2 :
  • పాలిటీకి సంబంధించిన ఈ పేపర్‌లో ప్రశ్నలు కోర్, కాంటెంపరరీ అంశాల కలయికగా వచ్చాయి. అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య 20. వీటిలో 10 ప్రశ్నలు పది మార్కులకు 150 పదాల్లో; మరో పది ప్రశ్నలు 15 మార్కులకు 250 పదాల్లో రాయాల్సినవి. ప్రధానంగా స్థానిక స్వపరిపాలన సంస్థలు (లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్), నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ యాక్ట్ 2014, లోక్‌సభకు, శాసనసభలకు జమిలి ఎన్నికలు, ప్రెజర్ గ్రూప్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, వాష్ స్కీమ్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016, ఆకలి, పేదరికం -సుపరిపాలన, చైనా సైనిక సామర్థ్యం-భారత్‌పై ప్రభావం, యునెటైడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సెల్ (ఈసీవోఎస్‌వోసీ), రైట్ టు ప్రైవసీ, పార్లమెంట్ సంయుక్త సమావేశం, ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్ (ఎస్‌హెచ్‌జీ), భారత్‌లో పేదరిక నిర్మూలన పథకాలు, సివిల్ సర్వీసెస్‌లో సంస్కరణలు, రాజ్యాంగ సవరణ చట్టం 2016 (101 రాజ్యాంగ సవరణ) తదితరాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు.
  • ముఖ్యంగా కోర్ అంశాలను కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్‌తో జోడిస్తూ అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల పరిజ్ఞానాన్ని, విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉన్నాయి.
  • ఉదాహరణకు.. Does the Rights of Persons with Disabilities Act, 2016 ensure effective mechanism for empowerment and inclusion of the intended beneficiaries in the Society? discuss. దీనికి సమాధానం రాయాలంటే.. అభ్యర్థులకు పైన పేర్కొన్న చట్టాన్ని రూపొందించిన కారణం, అది ప్రస్తుతం అమలవుతున్న తీరు, లోటుపాట్లు, లక్షిత వర్గాలకు ఏ మేరకు ఫలితాలు అందుతున్నాయి? ఇలా పలు కోణాల్లో అవగాహన అవసరం.
  • కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై పరిపూర్ణతోపాటు, అన్వయ సామర్థ్యం గలిగిన అభ్యర్థులు ఈ పేపర్‌లో 140 మార్కుల వరకు సాధించే అవకాశం కనిపిస్తోంది.
  • జనరల్ స్టడీస్ పేపర్-2 (గవర్నెన్స్, కన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్; మొత్తం మార్కులు 250, సమయం
    మూడు గంటలు)
జనరల్ స్టడీస్ పేపర్-3 :
  • ఈ పేపర్‌లోనూ కాంటెంపరరీ అంశాల కలయికగా ప్రశ్నలు అడిగారు. భారత ఆర్థిక వృద్ధి-పొదుపు రేటు; తయారీ రంగం-లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్‌పోర్ట్స్; భారత్‌లో ఎయిర్ పోర్ట్స్- పీపీపీ మోడల్; వ్యవసాయంలో పలు రకాల విప్లవాలు; ఫుడ్ ప్రాసెసింగ్, స్టెమ్ సెల్ థెరపీ- ప్రయోజనాలు; చంద్రయాన్, మామ్-మానడ్ మిషన్స్; రివర్ లింకింగ్- ప్రయోజనాలు; సైబర్ ఎటాక్స్; నార్త్‌ఈస్ట్‌లో వేర్పాటువాదం; కేంద్ర బడ్జెట్ 2017-18; సంస్కరణల అనంతర కాలంలో పారిశ్రామిక వృద్ధి-తాజాగా ఇండస్ట్రియల్ పాలసీలో మార్పుల ప్రభావం; ఇన్‌క్లూజివ్ గ్రోత్, వరి, గోధుమల దిగుబడి తగ్గుదల- పంటల మార్పిడి; న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా; పర్యావరణ మార్పులు; 2004లో సునామీ -ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలు; శాంతిభద్రతలు-హింస; ఉగ్రవాదం- జాతీయ భద్రత తదితర అంశాల నుంచి జీఎస్ పేపర్-3లో ప్రశ్నలు అడిగారు.
  • ఉదాహరణకు ఎకానమీ ప్రశ్నలనే పరిగణనకు తీసుకుంటే ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న పీపీపీ విధానంపై ప్రశ్న కనిపించింది. Examine the development of Airports in India through Joint ventures under Public-Private Partnership (PPP) model. What are the Challenges faced by the authorities in this regard?
  • ఈ పేపర్‌లో కూడా.. బాగా ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు 140 మార్కులు పొందొచ్చని నిపుణుల అభిప్రాయం.
జనరల్ స్టడీస్.. పేపర్-4 :
  • ఇది మెయిన్స్ పరీక్ష విధానంలో మార్పులు చేసిన తర్వాత పొందుపర్చిన జనరల్ స్టడీస్ పేపర్-4. గతేడాది కంటే కాస్త ఎక్కువగానే అభ్యర్థుల్లోని పాలనా దక్షత, నిర్ణయాత్మక సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నలడిగారు. సివిల్ సర్వీస్‌కు సంబంధించిన ప్రశ్ననే దీనికి ఉదాహరణగా పేర్కొనొచ్చు.
    Examine the relevance of following in the context of Civil service:
    a) Transparency b) Accountability c) Fairness and Justice d) Courage of Conviction e) Spirit of Service.

    అదే విధంగా..
    How will you apply emotional intelligence in administrative practice? అనే ప్రశ్న కూడా అభ్యర్థుల్లోని పాలన, నిర్ణయాత్మక సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంది.
  • ఈ పేపర్‌లో అభ్యర్థులు పొందే మార్కులు.. నిర్దేశిత అంశంపై వారు వెల్లడించిన అభిప్రాయాలు, విశ్లేషణలపై ఆధారపడి ఉంటాయని.. ఎవాల్యుయేటర్ కోణంలోనూ ఈ మార్కుల కేటాయింపు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సోషల్ సెన్సైస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు 150 మార్కుల వరకు, ఇతర నేపథ్యాలవారు 140 మార్కుల వరకు సాధిస్తారని నిపుణుల అంచనా.

    ఆప్షనల్స్.. కాస్త ఊరట
    ఈ ఏడాది కూడా అభ్యర్థులు ప్రతి పేపర్ విషయంలోనూ సమాధానాలు రాసే క్రమంలో సమయాభావ సమస్యను ఎదుర్కొన్నారు. సమాధానాలు తెలిసినా.. నిర్దేశిత మూడు గంటల్లో పూర్తిస్థాయిలో అన్ని అంశాలు పొందుపరచలేకపోయామని పలువురు తెలిపారు. అయితే.. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్ పరంగా అభ్యర్థులు కొంత ఉపశమనంతో కనిపించారు. ముఖ్యంగా పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ వంటి ఆప్షనల్స్ విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ నుంచి అకడమిక్ పుస్తకాల వరకు పట్టు సాధించిన అభ్యర్థులు కొద్దిపాటి ఆలోచనా శక్తితో సమాధానం ఇచ్చే విధంగా ప్రశ్నలు రావడం కొంత ఊరట కలిగించే అంశం.

    కటాఫ్‌పై భిన్నాభిప్రాయం...
    సివిల్స్ మెయిన్స్-2017 కటాఫ్‌పై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు ఆప్షనల్స్ సహా ఏడు పేపర్లతో 1750 మార్కులకు నిర్వహించిన పరీక్షలో నలభై శాతం మార్కులు వస్తాయనే నమ్మకంతో ఉన్న వారు పర్సనాలిటీ టెస్ట్‌కు సన్నద్ధం కావొచ్చని కొందరు పేర్కొంటుండగా.., అన్ని పేపర్లకు కలిపి 45 నుంచి 50 శాతం మార్కులు వస్తాయనే ధీమా ఉన్నవారు తుది దశకు సన్నాహకాలు ప్రారంభించాలని మరికొందరు సూచిస్తున్నారు. గత కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటే జనరల్ కేటగిరీలో 50 శాతంలోపే కటాఫ్ నమోదవడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.

    గత మూడేళ్ల కటాఫ్‌ల వివరాలు..
    సంవత్సరం జనరల్ ఓబీసీ ఎస్‌సీ ఎస్‌టీ
    2016 787 745 739 730
    2015 676 630 622 617
    2014 678 631 631 619
     
  • Published date : 13 Nov 2017 04:50PM

    Photo Stories