Skip to main content

Shashikant: సివిల్స్‌లో గిరి పుత్రుడి సత్తా

షాద్‌నగర్‌: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి సత్తా చాటాడు.
Civil Services results announcement  Shashikant got UPSC 891 Rank  UPSC ranker sasikanth success story  Union Public Service Commission

ఏప్రిల్ 16న‌ వెలువడిన ఫలితాల్లో 891వ ర్యాంకుతో మెరిశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలో చాకలిదాని తండాకు చెందిన రాములు నాయక్‌, సీతమ్మ దంపతుల పెద్దకుమారుడు శశికాంత్‌. తండ్రి రాములు నాయక్‌ హాస్టల్‌లో వార్డెన్‌గా పని చేస్తూ షాద్‌నగర్‌ పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు.

ఆయన 2008లో అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శశికాంత్‌ షాద్‌నగర్‌ పట్టణంలోని మరియారాణి ఉన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం నవోదయలో 9, 10వ తరగతులు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మియాపూర్‌ గుంటూరు వికాస్‌లో ఇంటర్‌, విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌(ఈఈఈ) పూర్తి చేశారు.

చదవండి: UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

పట్టువదలని విక్రమార్కుడిలా..

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన శశికాంత్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వాటిని వదలుకున్నారు. 2011లో ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ.11లక్షల ప్యాకేజీతో, 2012లో పశ్చిమ బెంగాల్‌లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఏటా రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయినా వాటిల్లో చేరకుండా సివిల్స్‌ వైపు దృష్టి మళ్లించారు.

2013లో ఢిల్లీ వెళ్లి సివిల్స్‌కు సిద్ధం అయ్యారు. మూడుసార్లు ప్రిలిమినరీ వరకు వచ్చారు. 2019లో కేవలం 6 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయారు. 2020లో ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో 695 ర్యాంకు సాధించిన శశికాంత్‌ను యూపీఎస్సీ అధికారులు ఐఆర్‌టీఎస్‌ (ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌)కు కేటాయించారు. ప్రస్తుతం అస్సాంలో రైల్వేశాఖలో పని చేస్తున్నారు.

చదవండి: UPSC Topper List 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌–3 వీరే.. టాప్‌–25 ర్యాంకర్లలో ఎంత మంది మహిళలు ఉన్నారో తెలుసా!!

షాద్‌నగర్‌వాసికి 891వ ర్యాంకు

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం సాధించాలని ఎందరో కలలు కంటారు. దానికి నిర్దిష్టమైన ప్రణాళిక రచించి, కఠోర సాధన చేస్తే తప్ప దాన్ని అందుకోవడం సాధ్యం కాదు. అలాంటి కలను షాద్‌నగర్‌వాసి సాకారం చేసుకున్నాడు. ఇటీవల వెల్లడించిన సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటాడు.

చదువుతూ.. ఉద్యోగం చేస్తూ

అస్సాం రాష్ట్రంలోని రింగియా డివిజన్‌లో రైల్వే విభాగంలో అసిస్టెంట్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా శశికాంత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తూనే మరోసారి సివిల్స్‌కు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 8సార్లు పరీక్షలు రాసిన శశికాంత్‌ మూడు సార్లు ర్యాంకులు సాధించారు.

ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్స్‌ సర్వీసెస్‌ తుది పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 16న‌ వెల్లడించింది. మొత్తం 1,016 మందిని ఎంపిక చేయగా శశికాంత్‌ 891వ ర్యాంకు సాధించి శెభాష్‌ అనిపించుకున్నారు.

Published date : 18 Apr 2024 05:49PM

Photo Stories