Skip to main content

‘సివిల్స్‌’లో సమూల మార్పులు..?

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర 24 కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో సమూల మార్పులు జరగనున్నాయా? బస్వాన్‌ కమిటీ సిఫార్సులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో మార్పులపై జరుగుతున్న చర్చ, కమిటీ నివేదికలోని అంశాలు, నిపుణుల అభిప్రాయాలతో విశ్లేషణ..

సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో చేపట్టాల్సిన మార్పులను సూచించేందుకు యూపీఎస్సీ.. మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎస్‌ బస్వాన్‌ నేతృత్వంలో 2015 ఆగస్టులో కమిటీని నియమించింది. ఇది తన నివేదికను 2016 ఆగస్టులో సమర్పించింది. ఈ నివేదికతోపాటు యూపీఎస్సీ సిఫార్సులు 2017, మార్చి 20న కేంద్ర ప్రభుత్వానికి అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని సిబ్బంది, శిక్షణ విభాగం ఇటీవల ప్రకటించింది. దీంతో సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో మార్పులు జరగనున్నాయనే చర్చ ప్రారంభమైంది. వయోపరిమితి తగ్గించడం, ఆప్షనల్‌ పేపర్‌ను పూర్తిగా తొలగించడం వంటి మార్పులూ జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

వయోపరిమితి.. అటెంప్ట్‌లు
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జనరల్‌ కేటగిరీకి 32 ఏళ్లు. బస్వాన్‌ కమిటీ నివేదిక నేపథ్యంలో దీన్ని 28 ఏళ్లకు తగ్గించే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుతం జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు ఈ పరీక్షకు గరిష్టంగా ఆరుసార్లు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నారు. దీన్ని నాలుగు అటెంప్ట్‌లకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. వయో పరిమితి తగ్గింపు అంశంతోపాటు బస్వాన్‌ కమిటీ సిఫార్సులను  పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఇటీవల పేర్కొనడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

ఆప్షనల్‌కు స్వస్తి :
ప్రస్తుత విధానంలో సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌లో జనరల్‌ ఎస్సే, నాలుగు జీఎస్‌ పేపర్లు, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు కలిపి మొత్తం ఏడు పేపర్లకు రాత పరీక్ష జరుగుతోంది. అయితే కొన్ని ఆప్షనల్స్‌కే మంచి మార్కులు వస్తున్నాయని, కొన్ని కఠినంగా ఉంటున్నాయనే వాదన వినిపిస్తోంది. తొలుత ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థి అందులో విఫలమైనా దాన్ని మరోసారి మరింత శ్రద్ధగా చదివి తదుపరి అటెంప్ట్‌ల్లో విజయం సాధిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బస్వాన్‌ కమిటీ.. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లోని రెండు పేపర్లను ఎత్తేసి వాటి స్థానంలోనూ జీఎస్‌ పేపర్లను ప్రవేశపెట్టాలని సూచించినట్లు సమాచారం. దీనివల్ల లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌కు ఆస్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లపై నెలకొన్న అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మెరుగైన సర్వీస్‌ కోసం రాజీనామా!
గ్రూప్‌–ఎ, బి సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు వాటిలో చేరి విధులు నిర్వహిస్తూనే ఐఏఎస్, ఐపీఎస్‌ లక్ష్యంగా మళ్లీ పరీక్ష రాస్తున్నారు. తాజా సిఫార్సుల నేపథ్యంలో ఇలాంటి అభ్యర్థులు సర్వీసుకు రాజీనామా చేసిన తర్వాతే మరోసారి పరీక్షకు అనుమతించేలా మార్పులు జరగనున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సర్వీసుల ప్రాధాన్యత∙ఆధారంగా వారికి అదనపు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారనేది మరో ముఖ్య సిఫార్సుగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ సూచనకు ఆమోదం లభిస్తే ఇకపై అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత∙క్రమాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా వారు రాయాల్సిన అదనపు పేపర్ల సమాచారాన్ని యూపీఎస్సీ ముందుగానే తెలియజేసే అవకాశముంది. 

మౌఖిక పరీక్షలోనూ మార్పులు...
ఇంటర్వూ్య ప్రక్రియలోనూ మార్పులు చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ మెయిన్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు పోస్టుల సంఖ్యను బట్టి 1:2 లేదా 1:2.5 పద్ధతిలో పర్సనాలిటీ టెస్ట్‌ పేరిట మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇవి బోర్డు్డ మెంబర్లు, అభ్యర్థుల మధ్య ఇంటరాక్షన్‌ తరహాలో సాగుతున్నాయని, దీనివల్ల ముందుగా ప్రిపేరైన అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇంటర్వూ్య అనేది వినూత్నంగా, అభ్యర్థిలోని అన్ని నైపుణ్యాలనూ వెలికి తీసేలా ఉండాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌ సర్వీసుల్లో సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వూ్యల మాదిరిగా వీటిని కూడా నాలుగైదు అంచెల్లో నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. 

అర్హతలూ మారనున్నాయా?
ప్రస్తుతం సివిల్స్‌ రాయడానికి కనీస అర్హత ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ. కమిటీ సిఫార్సులతో దీనిలోనూ మార్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సర్వీసుల విషయంలో ఈ మార్పులు జరగొచ్చని సమాచారం. ఉదాహరణకు ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆ సర్వీస్‌ ఔత్సాహికులు తప్పనిసరిగా లా గ్రాడ్యుయేట్లు అయి ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు. అదే విధంగా కనీస విద్యార్హతగా పేర్కొన్న బ్యాచిలర్‌ డిగ్రీలోనూ 50 శాతం మార్కులు పొందాలనే నిబంధనను సూచించినట్లు్ల తెలుస్తోంది.
అభ్యర్థుల్లో ఆందోళన: కమిటీ తన నివేదికను 2016 ఆగస్టులోనేlఇచ్చినప్పటికీ ఇటీవలి వార్తలతో సివిల్స్‌ ఔత్సాహికుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ మార్పులు తమ అవకాశాలను తగ్గిస్తాయేమోనని, తదుపరి నోటిఫికేషన్‌ నుంచే వీటిని అమలు చేస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది.

పాలనా దక్షతను పరీక్షించేలా..
మెయిన్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను తీసేస్తే అన్ని పేపర్లూ అభ్యర్థుల పాలనా దక్షతను పరీక్షించేలా రూపొందించాలి. ఇప్పుడున్న పేపర్లన్నీ సబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌వే. వీటివల్ల అభ్యర్థులకు పాలనా నైపుణ్యాలపై అవగాహన ఉండట్లేదు. వీలైనంత త్వరగా కమిటీ సిఫార్సులను అభ్యర్థుల ముందుంచితే వారు భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించుకోవడానికి వీలవుతుంది.
– ఆర్‌.సి.రెడ్డి, డైరెక్టర్, ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌

సన్నద్ధంగా ఉండాలి...
బస్వాన్‌ కమిటీ సిఫార్సుల అమలు విషయంలో యూపీఎస్సీ.. అభ్యర్థులకు అనుకూలంగానే వ్యవహరించొచ్చు. ఏవైనా మార్పులు తెస్తున్నప్పుడు కనీసం ఏడాది ముందుగానే తెలియజేస్తుంది. గతంలో సతీశ్‌ చంద్ర, అలఘ్‌ కమిటీ సిఫార్సుల విషయంలో ఇలాగే చేసింది. అందువల్ల సివిల్స్‌–2018 ఔత్సాహికులు ఆందోళన చెందొద్దు. అయితే మార్పులకు మానసికంగా సిద్ధపడాలి. ప్రిలిమ్స్‌ ప్రకటన ఫిబ్రవరిలో రానుండగా మెయిన్స్‌ అక్టోబర్‌లో జరగనుంది. నోటిఫికేషన్‌కు, మెయిన్స్‌కు మధ్య ఎనిమిది నెలల వ్యవధి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్‌ ‘మార్పులతో’ వెలువడినా సన్నద్ధంగా ఉండాలి. 
– వి.గోపాల కృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ అకాడమీ

Published date : 25 Nov 2017 03:13PM

Photo Stories