Skip to main content

సివిల్స్.. ఇక అందని ద్రాక్షే!

- తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం
- సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ విద్యార్థులకు అనుకూలం
- నిరాశ, నిస్పృహలో లక్షల మంది అభ్యర్థులు

అవును మీరు చదువుతున్నది నిజం. తాజా సివిల్స్ 2013 నోటిఫికేషన్‌లో చేసిన మార్పులు కచ్చితంగా తెలుగుమీడియం అభ్యర్థులకు మింగుడుపడని అంశం..మెయిన్‌‌సను తెలుగు మాధ్యమంలో రాయడంపై, తెలుగును ఆఫ్షనల్‌గా ఎంపిక చేసుకోవడంపై యూపీఎస్సీ విధించిన అనూహ్య నిబంధనల వల్ల వేలమంది నిరాశతో సివిల్స్ మీద ఆశలు వదులుకొనే పరిస్థితి తలెత్తింది. కొత్త నిబంధనల కారణంగా.. గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులంతా నష్టపోతారు. సంవత్సరాల తరబడి లక్షల ఫీజు కట్టి కోచింగ్ తీసుకున్నవారు, వయసు, అటెంప్ట్స్‌లో చివరి అవకాశం ఉన్నవారు.. ఇలా అనేక వేల మందిని యూపీఎస్సీ నిబంధనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నోటిఫికేషన్ ఆలస్యంగా వస్తే అదేదో అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందనుకున్నాం కానీ, ఇలా ఆశలపై నీళ్లు చల్లుతుందనుకోలేదని ఆశావహులంతా వాపోతున్నారు.

రెండు సంవత్సరాల కింద సివిల్స్ ప్రిలిమ్స్‌లో మార్పులు చేశారు. ఇది వరకు ఉన్న ఆప్షనల్ సబ్జెక్టు స్థానంలో పేపర్ 2 అయిన సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) తీసుకొచ్చారు. ఇదే చాలామందికి ఆమోదయోగ్యంగా లేదు. ఇప్పుడు నిగవేకర్ కమిటీ సిఫార్సుల మేరకు చేసిన భారీ మార్పులు ఏకంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు శరాఘాతంగా మారాయి. ఇది వరకు డిగ్రీ ఏ మాధ్యమంలో చదివినా.. మెయిన్‌‌స పరీక్ష తెలుగులో రాసే అవకాశం ఉండేది. తాజా మార్పుల తర్వాత మెయిన్‌‌స తెలుగులో రాయాలంటే.. డిగ్రీ తప్పకుండా తెలుగు మీడియంలో చదివుండాలి. అంతేకాక తెలుగు మీడియం నుంచి (ప్రాంతీయ భాష) కనీసం 25 మంది మెయిన్‌‌స రాసేవారుంటేనే.. తెలుగులో రాసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంగ్లీష్‌లో రాయక తప్పదు. ఈ విషయం కూడా పరీక్షకు పది, పదిహేను రోజుల ముందు మాత్రమే అభ్యర్థులకు తెలుస్తుంది. టెన్‌‌త, ఇంటర్ తెలుగులో చదివి.. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పలు కోర్సులు చదివిన వారికి పరీక్షలు ఇంగ్లీష్‌లో రాయాలంటే కష్టమనే చెప్పాలి. అంతేకాకుండా ఇంగ్లీష్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దాని ప్రభావం గ్రామీణ విద్యార్థులపై తప్పక ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే కనీసం 2నుంచి 3ఏళ్లు పడుతుంది. ఈలోపు వేల మంది ప్రతిభావంతులు నష్టపోతారు.

ఉత్తరాది వారికే అనుకూలం: మొదటి నుంచి సివిల్స్ పరీక్షలు ఉత్తరాది రాష్ట్రాల వారికే అనుకూలంగా ఉన్నాయనే విమర్శ ఉంది. ఈ మార్పుల వల్ల అది మరింత బలపడింది. ఉదాహరణకు ఇప్పుడు సిలబస్‌లో పేర్కొన్న చాలా అంశాలు (ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స, బయోడైవర్శిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ) సీబీఎస్‌సీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్నవే. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలులో ఉన్న సీబీఎస్‌సీ, ఎన్‌సీఈఆర్‌టీ విధానం వల్ల సివిల్స్‌లో వారికే ఎక్కువ అనుకూలతలున్నాయి. 3 లేదా 4 సంవత్సరాల నుంచి పాత పద్ధతిలోనే సిద్ధమవుతున్న వారు ఈ మార్పుల కారణంగా నష్టపోతారు.

నిర్ధిష్ట సిలబస్ చెప్పలేదు.. సిలబస్‌లో కొన్ని అంశాలకు నిర్ధిష్ట పరిమితి లేదు. ఉదాహరణకు మోడల్ థింకర్‌‌స అని ఇచ్చారు. ఇందులో ఎవరిని ప్రాతిపదికగా తీసుకోవాలో స్పష్టత లేదు. అలాగే కొత్తగా చేర్చిన పేపర్ 5(జనరల్ స్టడీస్ పేపర్ 4) లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆటిట్యూడ్ అనే అంశాలు ఒక రకంగా సైకాలజీకి చెందినవే. ఇది వరకు ఈ అంశాలను ఇంటర్వ్యూలో పరిశీలించేవారు. ఇప్పుడు ఏకంగా మెయిన్‌‌సలో ఒక పేపర్‌గా చేర్చారు. అలాగే టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్శిటీ, ఎన్విరాన్‌మెంట్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి సంబంధం లేని అంశాలు ఒకే పేపర్(జనరల్ స్టడీస్ పేపర్ 3)లో ఇవ్వడం గమనించదగ్గ విషయం. దీనిలోనే ఇన్వెస్ట్‌మెంట్ మోడల్స్ అనే కొత్త అంశం చేర్చారు. వీటితో పాటు అవేర్‌నెస్ ఆఫ్ ఐటీ, స్పేస్, కంప్యూటర్‌‌స, రోబో టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ సమస్యలు, వాటిలో వస్తున్న మార్పులు అనే అంశం చేర్చారు. ఇది చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉండటం వల్ల సామాన్య, నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్థి ప్రిపేరవడం చాలా కష్టం. జీఎస్ పేపర్ 1లో కొత్తగా చేర్చిన వరల్డ్ హిస్టరీని 18వ శతాబ్దం నుంచి చదవాలి. సమయాభావం వల్ల ఇది సాధ్యపడదు. అయితే లింగ సమతుల్యత సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడం, మహిళా సంబంధిత సమస్యలు, మహిళల పాత్ర వంటి అంశాలను సిలబస్‌లో చేర్చడం ఆహ్వానించ దగ్గ విషయమే.

తెలుగు అభ్యర్థులంతా ఉద్యమంలా కదలాలి: కుమార్, సివిల్స్ అభ్యర్థి
నేను ఇంటర్ వరకు తెలుగులో చదివాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను. తెలుగులో రాసే అవకాశం ఉండటం వల్లే గత మూడేళ్లుగా సిద్ధమవుతున్నాను. కష్టపడి ఇంటర్వ్యూ వరకు రాగలిగాను. ఈ అవకాశం తప్పితే నేను మళ్లీ సివిల్స్ రాయను. ఎందుకంటే.. సిలబస్ కష్టమైనా చదివి రాయగలం, అసలు పరీక్షే రాయకుండా చేస్తే ఏం చేస్తాం చెప్పండి. ఇది ఐఐటీలు, ఐఐఎమ్‌లలో చదివిన వారికి లాభిస్తుంది. దీని వల్ల నా లాంటి ఎందరో గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

గ్రామీణ ప్రాంతం వారికి అన్యాయం: రంజిత్, సివిల్స్ అభ్యర్థి
ఇది తప్పకుండా గ్రామీణ ప్రాంతం వారి మీద ప్రభావం చూపుతుంది. తెలుగే కాదు, తమిళం, మళయాళం, కన్నడ అభ్యర్ధులకు కూడా అన్యాయమే. మొదటి నుంచి యూపీఎస్సీ ఉత్తరాది రాష్ట్రాలకే అనుకూలంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పుడు తెచ్చిన కొత్త నిబంధనల వల్ల మరింత మంది తెలుగువారు నష్టపోతారు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు సమాచారం సేకరించి చదవాలంటే తగిన సమయం లేదు.

కనీసం 25 మంది నిబంధన తగదు: కుమార స్వామి, అజయ్ కుమార్, సివిల్స్ అభ్యర్థులు
తెలుగు మీడియం నుంచి కనీసం 25మంది మెయిన్‌‌సకు అర్హత సాధిస్తేనే మెయిన్‌‌స తెలుగులో రాయవచ్చు లేదంటే ఇంగ్లీష్‌లోనే రాయాలనే నిబంధన సరికాదు. అది కూడా మెయిన్‌‌సకు పది రోజుల ముందు తెలిస్తే ఇంకేం రాస్తాం. అందుకే ఈసారి రాయకుండా వచ్చే సంవత్సరం రాయాలనుకుంటున్నాం.

మార్పులు ఇప్పుడు తగదు: ఐశ్వర్య, నర్మద, విజయ భారతి
హఠాత్తుగా మార్పులు చేసి అమలు చేయడం మంచిది కాదు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారు ఇంత త్వరగా సిద్ధమవడం కష్టం. ఏదైనా కొత్త విషయానికి అలవాటు పడాలంటే కాస్త సమయం కావాలి. కాబట్టి ఈ సారికి అందరిని అనుమతించాలి.

2, 3 సంవత్సరాలు చదివితే తప్ప కష్టం: రుక్మాంగధర్ రెడ్డి, సివిల్స్ అభ్యర్థి
సివిల్స్ అంటే నే చాలా కష్టం. అటువంటిది ఇప్పుడు చేసిన మార్పుల వల్ల కనీసం 2 లేదా 3 సంవత్సరాలు చదవాలి. పాత విధానం ప్రకారం ప్రిపేర్ అయ్యే వారికి దీని వల్ల అన్యాయం జరుగుతుంది.

డిగ్రీలో తప్పకుండా తెలుగుండాలంటే ఎలా: నర్మద, శాంతి స్వరూప
చాలా మంది టెన్‌‌త, ఇంటర్‌లో తెలగు మీడియం చదివి తర్వాత డిగ్రీలో ఇంగ్లీష్ చదివుంటారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, వంటి వృత్తి విద్యా కోర్సుల చదివిన వారికి తెలుగు సబ్జెక్టే ఉండదు. అలాంటప్పుడు డిగ్రీలో తెలుగు కచ్చితంగా ఉండాలనేది సరికాదు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పరిష్కారం చూపించాలి.
Published date : 08 Mar 2013 06:37PM

Photo Stories