Skip to main content

సివిల్స్ ఆశలకు పాతర వేయడమే..!

యూపీఎస్సీ తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్‌లో.. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సంబంధించి మాధ్యమం ఎంపికపై ఆంక్షలు.. భాషా సాహిత్యాలను ఆప్షనల్‌గా ఎంచుకోవడంపై అనూహ్య నింబంధనలు.. ఇంగ్లిష్ మార్కులను మెరిట్ ర్యాంకింగ్‌లో కలపడం తదితర అంశాలపై సివిల్స్ ఆశావహుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాంతో మార్చి 5న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ మెయిన్స్ మార్పులపై అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పొందుతున్న కంకిపాటి రాజేశ్(ఐఏఎస్) అందిస్తున్న విశ్లేషణ...

రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు నీళ్లు:
సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో యూపీఎస్సీ ప్రవేశపెట్టిన తాజా మార్పులు.. ప్రాథమిక హక్కులైన సమానత్వ హక్కు (రైట్ టు ఈక్వాలిటీ- అధికరణ 14), భావప్రకటన హక్కు (రైట్ టు ఎక్స్‌ప్రెషన్- అధికరణ 19) లకు భంగం కలిగించేలా ఉన్నాయి. అభ్యర్థులు పేపర్-1లోని సెక్షన్-2 (ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ అండ్ ఇంగ్లిష్ ప్రెసీ) తప్ప, మిగతా అన్ని ప్రశ్నలు ఇంగ్లిష్ లేదా హిందీలోనే రాయాలి. అభ్యర్థి అర్హత పరీక్ష అయిన తన గ్రాడ్యుయేషన్‌ను కింద పేర్కొన్న భాషల మాధ్యమంలో చదివితేనే పేపర్-1లోని సెక్షన్-2 (ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ అండ్ ఇంగ్లిష్ ప్రెసీ) తప్ప మిగతా అన్ని ప్రశ్నలు సదరు భాషలోనే రాసే వీలుంటుంది. లేకుంటే ఇంగ్లిష్ లేదా హిందీలో రాయాల్సి ఉంటుంది(అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, కన్నడం, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురీ, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ) అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అంటే.. ఒక అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌ను తెలుగు మాధ్యమంలో చదవకుంటే.. అతను తెలుగులో మెయిన్స్ పరీక్షలు రాసే వీలులేదు. మన దేశంలో చాలామంది విద్యార్థులు ఇంటర్ (10+2) వరకూ ప్రాంతీయ భాషలోనే చదువుతారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకుంటారు. వీరికి ఇంగ్లిష్‌లో పట్టణాల్లో, కాన్వెంట్‌లలో చదువుకున్న విద్యార్థులకున్నంత పట్టు ఉండదు. సివిల్స్ మెయిన్స్ పరీక్షలను హిందీలో రాసుకునే వీలుకల్పించినప్పుడు.. తమిళం, తెలుగు, గుజరాతీ వంటి ప్రాంతీయ భాషల్లో ఎందుకు రాసుకోనీయకూడదు. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రాంతీయ భాషల్లో మెయిన్స్ పరీక్షలు రాయడంపై యూపీఎస్సీ తాజా ఆంక్షలు మన రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు నీళ్లొదిలేలా ఉన్నాయి.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో సివిల్స్ మెయిన్‌‌స రాసి మెరుగైన ర్యాంకులు సాధించిన వారు ఎందరో. ఇలాంటి పరిస్థితిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయడంపై యూపీఎస్సీ తాజాగా విధించిన నిబంధనలు.. లక్షల మంది ఆశావహుల సివిల్స్ కలలకు గొడ్డలి పెట్టులా మారాయి. నా తోటి అధికారి, నా మార్గదర్శి సుబ్రమణ్యం(ఐఆర్‌ఎస్).. కాలేజీ డ్రాపవుట్. ఆయన బస్ క్లీనర్‌గా, బస్ కండక్టర్‌గా కూడా పనిచేశారు. ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం టేకులపల్లికి చెందిన ఆయన.. తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకొని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసి విజయం సాధించారు. తాజా నిబంధనల ప్రకారం- సుబ్రమణ్యం వంటివారు ఇక ఎప్పటికీ సివిల్ సర్వెంట్‌లు అయ్యే అవకాశం లేదు.

ఇంగ్లిష్ మార్కులు-గ్రామీణ విద్యార్థికి తీరని నష్టం:
యూపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న మరో అంశం... పేపర్-1లో.. అభ్యర్థులు నిర్దిష్ట అంశంపై వ్యాసం రాయాలి. రాస్తున్న అంశానికి సంబంధించి తన ఆలోచనలను ఒక క్రమంలో సంక్షిప్తంగా, సూటిగా పొందుపరచాలి. తమ భావాలను సూటిగా, స్పష్టంగా రాసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది (వ్యాసం 200 మార్కులకు ఉంటుంది). అదేవిధంగా పేపర్-1లోనే సెక్షన్-2లో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ ప్రెసీ (100 మార్కులకు) ద్వారా అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై అవగాహనను, రాత నైపుణ్యాలను పరీక్షించడం జరుగుతుంది. అయితే, పేపర్-1 మొత్తం 300 మార్కులకు ఉంటే.. ఈ మార్కులను ఫైనల్ ర్యాకింగ్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. ఇది గ్రామీణ, పేద విద్యార్థుల పట్ల వ్యతిరేక చర్య. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ అండ్ ప్రెసీకి కేటాయించిన 100 మార్కులను మెరిట్ ర్యాంకింగ్‌లో కలపడం తీవ్ర అసమానతలకు దారితీస్తుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏమంటే... సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థికి ఇంగ్లిష్‌పై ఉన్న అవగాహనను పరీక్షిస్తున్నారు. అంటే... ప్రిలిమ్స్‌లో పాసై, మెయిన్స్‌కు హాజరవుతున్నాడంటేనే ఆ అభ్యర్థికి సరిపడ ఇంగ్లిష్ నైపుణ్యాలున్నాయని అర్థం. ప్రిలిమ్స్ మార్కులు మెరిట్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు.. కానీ మెయిన్స్ మార్కులను పరిగణిస్తారు. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా నష్టం కలిగిస్తుంది. చాలామంది ఇంగ్లిష్‌ను ప్రపంచ అనుసంధాన భాషగా భావిస్తారు. ఇంగ్లిష్ అవసరమే కానీ తప్పనిసరికాదు. ఇంతకుముందులా ఇంగ్లిష్‌ను క్వాలిఫైయింగ్ పేపర్‌గా పేర్కొనడమే సముచితం. తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఇంగ్లిష్ మార్కులను ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణనలో తీసుకోవడం మాత్రం సరికాదు.

ముస్సోరిలోని ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏలో ఐఏఎస్ అధికారులకు ఇచ్చే శిక్షణలో ఫేజ్-1లో దాదాపు 40 శాతం సమయా న్ని ఆ అధికారికి కేటాయించిన రాష్ట్ర భాషపై అవగాహన కలిగించేందుకే ఉపయోగిస్తారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులకు సైతం ఫ్రెంచ్, జపనీస్, జర్మన్ వంటి భాషలపై శిక్షణ ఇస్తారు. కాబట్టి మెయిన్స్‌లో ఇంగ్లిష్‌కు అవసరానికి మించి ప్రాధాన్యం ఇవ్వడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియా, భారత్ అనే విభజనను సృష్టించే ఆస్కారం కూడా ఉంది. పేదరికాన్ని అనుభవించకపోయినా, పేదరికాన్ని కనీసం దగ్గరి నుంచి చూడని అధికారి.. పేదరిక నిర్మూలనకు విధానాలు రూపొందించగలడని మనం ఆశించగలమా!

కనీసం 25 మంది ఉంటేనే:
ఏదైనా ప్రత్యేక భాషలో కనీసం 25 మంది అభ్యర్థులు ఉంటేనే ఆయా భాషలో మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తామని యూపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. 25 కంటే తక్కువ మంది ఉంటే సదరు అభ్యర్థులు ఇంగ్లిష్, లేదా హిందీలో పరీక్షలు రాయాలి. ఇది ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయబోయేవారికి.. ముఖ్యంగా దేశంలోని ఎస్టీ అభ్యర్థుల ఆశలపై పూర్తిస్థాయిలో నీళ్లు చల్లడమే! ఎవరైనా ఒక అభ్యర్థి డోగ్రి, లేదా సంతాలిలో మెయిన్స్ పరీక్షలు రాయాలనుకుంటే.. తాజా నిబంధనల ద్వారా వీలుపడదు. కాబట్టి అతను తనకు పూర్తిస్థాయి అవగాహనలేని ఇంగ్లిష్, లేదా హిందీలోనే పరీక్షలు రాయాలి. ఇది రాజ్యాంగం అతనికి ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమవుతుంది. ఇలాంటి చర్య ఇప్పటికే అంతరం పెరిగిన ఈశాన్య ప్రజలను మరింత దూరం చేస్తుంది. ‘ఈశాన్య ప్రజలకు భారత్‌తో భౌతిక దూరం కంటే.. మానసిక అంతరమే ఎక్కువ’ అని ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏలో నాగాలాండ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఆర్.ఎస్.పాండే అన్న మాటలను తాజా యూపీఎస్సీ నిబంధనలు నిజం చేసేలా ఉన్నాయి.

భాష సాహిత్యాలపై ఆంక్షలేల:
సివిల్స్ నోటిఫికేషన్‌లో గ్రూప్-1 విభాగం కింద పేర్కొన్న సబ్జెక్టుల నుంచి ఏ సబ్జెక్టునైనా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. అదే గ్రూప్-2 విభాగంలో ఇచ్చిన భాషా సాహిత్యాలను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఆ భాషా సాహిత్యాన్ని ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి. అంటే.. మెడికల్, ఇంజనీరింగ్, విద్యార్థులు తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకోవాలంటే కుదరదు. తెలుగు సాహిత్యం విద్యార్థి తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకునే వీలున్నప్పుడు.. అదే తెలుగు మాట్లాడే రాష్ట్రానికి చెందిన మిగతా విద్యార్థులు తెలుగును ఆప్షనల్‌గా ఎందుకు ఎంపిక చేసుకోకూడదు..? ఈ నిబంధన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

కటాఫ్స్-విచక్షణ:
పేపర్-1 నుంచి పేపర్-7 వరకూ అన్ని పేపర్ల మార్కులను మెరిట్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకుంటామని యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ప్రతి పేపర్ లేదా ఏదైనా పేపర్‌లో అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం తనకుందని కూడా తెలిపింది. ఇది కొంత అస్పష్టంగా ఉంది. క్యాట్ వంటి పరీక్షల్లో ప్రతి సెక్షన్‌కు సెక్షనల్ కటాఫ్స్ ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టంగా ప్రకటిస్తారు. కాని యూపీఎస్సీ అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం తమకు ఉందని మాత్రమే పేర్కొంది. అంటే... ఒక గ్రామీణ అభ్యర్థి అన్ని పేపర్లలో మంచి మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ పేపర్‌లో అర్హత మార్కులు సాధించకుంటే మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించడం అసాధ్యమే అవుతుంది. ఆట నిబంధనలను ఆట ప్రారంభం కాకముందే ప్రకటించాలి. అంతేకానీ బలవంతులకు మేలుచేసేలా ఆట చివర్లో ప్రకటించకూడదు.

సమయం ఇవ్వాలి:
సివిల్స్ పరీక్ష అంటేనే ఏడాదికిపైగా కొనసాగే సుదీర్ఘ ప్రక్రియ. దీనికోసం ఏళ్ల తరబడి సిద్ధం అవుతుంటారు. కాబట్టి కొత్త మార్పులకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వడం సహజ న్యాయం. మరోవైపు మెయిన్స్‌లో కొత్త మార్పులు కోచింగ్ సెంటర్ల పాత్రను మరింత పెంచుతాయి. ఇప్పటికే కోచింగ్ తీసుకున్నవాళ్లు కొత్త సబ్జెక్టులపై అవగాహన కోసం మళ్లీ కోచింగ్ తీసుకోవాలి. అంటే.. ఆర్థికంగా కూడా మరింత భారం. గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ అన్నట్లు... ‘జీవితంలో మార్పు ఒక్కటే శాశ్వతం’!. సివిల్ సర్వీసెస్‌కు సరైనవారిని ఎంపికచేసేందుకు ఎథిక్స్, ఇంటిగ్రిటీలతో కొత్త పేపర్‌ను ప్రవేశపెట్టడం.. ప్రపంచ చరిత్రను సిలబస్‌లో చేర్చడం.. ఆబ్జెక్టివిటీ కోసం ఆప్షనల్స్ మార్కులను తగ్గించడం.. వంటివి స్వాగతించదగినవే! అయితే, కొన్ని వర్గాల ప్రజలను దూరంపెట్టే ఎలాంటి మార్పునూ హర్షించలేం!!

మార్పు:
అభ్యర్థులు పేపర్-1లోని సెక్షన్-2 (ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ అండ్ ఇంగ్లిష్ ప్రెసీ) తప్ప, మిగతా అన్ని ప్రశ్నలు ఇంగ్లిష్ లేదా హిందీలోనే రాయాలి. అభ్యర్థి అర్హత పరీక్ష అయిన తన గ్రాడ్యుయేషన్‌ను అనుమతించిన నిర్దిష్ట భాషలో చదివితేనే ఆయా మాధ్యమంలో మెయిన్స్ రాసే వీలుంటుంది.

సమస్య:
అంటే.. ఒక అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌ను తెలుగు మాధ్యమంలో చదవకుంటే.. అతను తెలుగులో మెయిన్స్ పరీక్షలు రాసే వీలులేదు. మన దేశంలో చాలామంది విద్యార్థులు ఇంటర్ (10+2) వరకూ ప్రాంతీయ భాషలోనే చదువుతారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఇంగ్లిష్ మాధ్యమంవైపు మళ్లుతారు. వీరికి పట్టణ ప్రాంతంలో, కాన్వెంట్‌లలో చదువుకున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ఉన్నంత పట్టు ఉండదు.

మార్పు:
పేపర్-1లో.. అభ్యర్థులు నిర్దిష్ట అంశంపై వ్యాసం రాయాలి (200 మార్కులు). అదేవిధంగా పేపర్-1లోనే సెక్షన్-2లో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ ప్రెసీ(100 మార్కులకు) ద్వారా అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై అవగాహనను, రాత నైపుణ్యాలను పరీక్షించడం జరుగుతుంది. అయితే, పేపర్-1కు కేటాయించిన 300 మార్కులను ఫైనల్ ర్యాకింగ్‌లో పరిగణనలోకి తీసుకుంటారు.

సమస్య:
ఇది గ్రామీణ, పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే మార్పు. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ అండ్ ప్రెసీకి కేటాయించిన 100 మార్కులను మెరిట్ ర్యాంకింగ్‌లో కలపడం తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.

మార్పు:
ప్రమాణాలు, నాణ్యత పాటించేందుకు వీలుగా అనుమతించిన ఏదైనా ప్రత్యేక భాషలో కనీసం 25 మంది అభ్యర్థులు ఉంటేనే.. ఆయా భాషలో మెయిన్స్ పరీక్షకు వీలుకల్పిస్తారని యూపీఎస్సీ త న తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సమస్య:
25 కంటే తక్కువ మంది ఉంటే సదరు అభ్యర్థులు ఇంగ్లిష్, లేదా హిందీలో పరీక్షలు రాయాలి. అంటే... అతను తనకు పూర్తిస్థాయి అవగాహనలేని ఇంగ్లిష్, లేదా హిందీలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. నైపుణ్యం లేని భాషలో రాయడం ద్వారా అభ్యర్థి నష్టపోతాడు. అంతేకాకుండా ఇది రాజ్యాంగం అతనికి ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుంది.

మార్పు:
సివిల్స్ నోటిఫికేషన్‌లో గ్రూప్-1 విభాగంలో పేర్కొన్న సబ్జెక్టుల నుంచి ఎవరైనా ఏ సబ్జెక్టునైనా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. అదే గ్రూప్-2లో ఇచ్చిన భాషా సాహిత్యాలను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఆ భాషా సాహిత్యాన్ని ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి.

సమస్య:
అంటే.. మెడికల్, ఇంజనీరింగ్, పొలిటికల్ సైన్స్ విద్యార్థి తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకోవాలంటే కుదరదు. తెలుగు సాహిత్యం విద్యార్థి తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకునే వీలున్నప్పుడు.. అదే తెలుగు మాట్లాడే రాష్ట్రానికి చెందిన మెడికల్ లేదా ఇంజనీరింగ్ విద్యార్థి తెలుగును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకునే అవకాశం లేకపోవడం సముచితం కాదు.

మార్పు:
పేపర్-1 నుంచి పేపర్-7 వరకూ అన్ని పేపర్ల మార్కులను మెరిట్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకుంటామని యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ప్రతి పేపర్ లేదా ఏదైనా పేపర్‌లో అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం తనకుందని కూడా తెలిపింది.

సమస్య:
అంటే... ఒక గ్రామీణ అభ్యర్థి అన్ని పేపర్లలో మంచి మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ పేపర్‌లో అర్హత మార్కులు సాధించకుంటే మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించడం అసాధ్యమే.
-ది హిందూ సౌజన్యంతో..
Published date : 21 Mar 2013 01:35PM

Photo Stories