Skip to main content

Civils Prelims Cutoff: స్వల్పంగా మారనున్న కటాఫ్‌!

Civils Prelims 2022 Cutoff Marks
Civils Prelims 2022 Cutoff Marks

సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియలో తొలి మెట్టు ప్రిలిమ్స్‌. అభ్యర్థులు దీనిలో విజయం సాధిస్తే తర్వాత అంచెల్లో నిర్వహించే మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరై.. వాటిలో ప్రతిభ చూపి దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో చేరొచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తాజాగా(జూన్‌ 5) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. స్టాటిక్‌ అంశాల కంటే డైనమిక్‌ అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చింది. ప్రశ్నలు అడిగే విధానంలో ఎప్పటికప్పుడు సరికొత్త పంథా అనుసరించే కమిషన్‌.. ఈసారి విభిన్న తరహాలో ఆప్షన్లతో ప్రశ్నపత్రం రూపొందించింది. 

Also read: UPSC Civils Top Ranker Story: ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..

దీంతో కొత్తగా పరీక్షలకు హాజరైనవారితోపాటు, ఇదివరకు పరీక్షలు రాసిన అభ్యర్థులకు కొత్త అనుభవం ఎదురైంది.  ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉందని అభ్యర్థులు పేర్కొంటున్న నేపథ్యంలో.. సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష – 2022 ప్రశ్నపత్రం విశ్లేషణ, కటాఫ్‌ అంచనాపై నిపుణుల అభిప్రాయాలు..

  • » స్టాటిక్‌ కంటే డైనమిక్‌ అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు
  • » విభిన్న తరహాలో ఆప్షన్లు రూపొందించిన యూపీఎస్సీ
  • » గతేడాది కంటే స్వల్పంగా మారనున్న కటాఫ్‌

ప్రిలిమ్స్‌లో ప్రతి ఏడాదిలాగే సులభమైన ప్రశ్నలు, మోస్తరు కఠినమైన ప్రశ్నలు, కఠినమైన ప్రశ్నల మేళవింపుతో ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. స్టాటిక్‌ అంశాల కంటే.. డైనమిక్‌ అంశాలకే ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 30–40 శాతం ప్రశ్నలు సాధారణ ప్రిపరేషన్‌ సాగించిన అభ్యర్థులు తేలిగ్గా సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. అలాగే మరో 30–40 శాతం ప్రశ్నలు కొద్దిపాటి కఠినమైనవి. వీటికి ఏడాది నుంచి రెండేళ్లపాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలకు కరెంట్‌ అఫైర్స్‌ను జోడిస్తూ పరీక్షకు సన్నద్ధమైనవారు సమాధానాలు రాయొచ్చు.

Also read: UPSC Civils Ranker : అమ్మ క‌ల‌ను నిజం చేశానిలా..| ఆ ఒక్క మార్క్ వ‌ల్లే పోయింది

ఇక కఠినమైన ప్రశ్నల విషయంలో అభ్యర్థులు సరికొత్త అనుభవాన్ని ఎదుర్కొన్నారు. యూపీఎస్సీ గత కొద్ది సంవత్సరాలుగా ప్రశ్నలకు సమాధానాల ఆప్షన్లు రూపొందించే సమయంలో వినూత్న పంథా అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది సరికొత్త విధంగా ప్రశ్నల ఆప్షన్లను రూపొందించడంతో అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘జతపరచండి’ లేదా ‘కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి’కి బదులు.. ఈసారి ‘పైవాటిలో ఒక జత సరైనది, రెండు జతలు సరైనవి, మూడు జతలు సరైనవి’అంటూ ఆప్షన్లను ఇచ్చారు. మొదటిసారి పరీక్షలు రాసేవారితో పాటు గతంలో పరీక్షలకు హాజరైన వారు ఈ విషయంలో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించడంలో ఎక్కువ సమయం అవసరమైంది. ఈ ప్రతికూల ప్రభావంతో అభ్యర్థులు పరీక్షను కఠినమైనదిగా పేర్కొంటున్నారు.

తగ్గనున్న కటాఫ్‌!
గత ఫలితాల సరళి గమనించినట్లయితే..గత మూడేళ్లుగా కటాఫ్‌లు తగ్గుతూ ఉండటం కనిపిస్తోంది. అంతకుముందు సంవత్సరాల్లో 100కు పైగా ఉన్నటువంటి ఈ కటాఫ్‌.. క్రమంగా తగ్గుతూ గతేడాది 87.5కు చేరింది. ఈ సారి కూడా అదేతరహాలో కటాఫ్‌ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రశ్నపత్రం కఠినత్వం కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

Also read: ఇంటర్వూ సభ్యులు అభ్యర్థిల్లో ముఖ్యంగా పరీక్షించేవి ఇవే..

కరెంట్‌ అంశాలకు ప్రాధాన్యం
ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో గమనించాల్సిన మరో అంశం కరెంట్‌ అఫైర్స్‌. ఐదారేళ్ల క్రితం కరెంట్‌ అఫైర్స్‌ నుంచి మొత్తం పేపర్‌లో 40 ప్రశ్నలు మాత్రమే ఉండేవి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా కరెంట్‌ అఫైర్స్‌తోపాటు పాలిటీ, జాగ్రఫీ తదితర సబ్జెక్టుల్లోంచి కూడా అనువర్తిత కరెంట్‌ అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించింన మూడు ప్రశ్నలు ఇచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ, సోమనాథ్‌ దేవాలయ కార్యక్రమంపై ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే.. గతంలో మాదిరి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. విస్తృత పరిజ్ఞానం అవసరం. పరీక్షకు కనీసం ఆరునెలల ముందు కరెంట్‌ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి పరీక్షలో డిసెంబర్‌ 2021–మే 2022 వరకు అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. 

Also read: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

గత ప్రశ్నపత్రాల నుంచీ ప్రశ్నలు!
ఏ పరీక్ష ప్రిపరేషన్‌కైనా గత ప్రశ్నపత్రాల సాధన ఎంతో కీలకం. కొన్నిసార్లు ఆయా ప్రశ్నల్లోని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి కనీసం 10 నుంచి 15 ప్రశ్నలు గత ప్రశ్నపత్రాల్లో అడిగిన అంశాలపైనే అడిగారు. ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఎయిర్‌ క్వాలిటీ గైడ్‌లైన్స్‌పై గతేడాది సివిల్స్‌ మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నను ఈ ఏడాది ప్రిలిమ్స్‌లో ఇచ్చారు. కావేరీ నది, హిమాలయాల్లో దొరికే గోల్డెన్‌ మహషీర్‌ అనే చేప గురించి గతేడాది ప్రిలిమ్స్‌లో అడిగిన ప్రశ్ననే ఈ ఏడాదీ అడిగారు. అలాగే గత పశ్నపత్రాల్లోని అంశాలకు నేరుగా సమాధానాలు నేర్చుకుని వదిలేయకుండా.. అందులో పేర్కొన్న ఆప్షన్ల నుంచి కూడా పూర్తి సమాచారాన్ని చదవాలి. ఉదాహరణకు ఈసారి పరీక్షలో అడిగిన పెట్‌ బాటిల్స్‌ తయారీకి ఉపయోగించే పాలీ ఇథిలీన్‌ టెరాప్తలేట్‌ అంశాన్ని.. గతేడాది ప్రిలిమ్స్‌ పరీక్షలో ఓ ఆప్షన్‌గా ఇచ్చారు. 

Also read: Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!

అంతర్జాతీయ అంశాలు
ప్రశ్నపత్రంలో అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎంఎఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు, వార్తల్లో నిలిచిన దేశాలు, వాటి కారణాలను జతపరిచే ప్రశ్నలుగా ఇచ్చారు. అంతేకాకుండా వార్తల్లో ఉన్న భూభాగాలపై ప్రశ్నలు అడిగారు. ఆఫ్గనిస్తాన్, టర్కీ, బ్లాక్‌ సీ చుట్టూ జరుగుతున్న సంక్షోభం, ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై అడిగారు.

అనువర్తిత అంశాలపై ఎక్కువ ప్రశ్నలు
గతంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాలను ప్రధానంగా చదువుకుని.. వాటిలోని ప్రాథమిక అంశాలకు కరెంట్‌ అఫైర్స్‌ మ్యాగజీన్‌లో దొరికే అంశాలను జోడిస్తే సరిపోయేదనే అవగాహన ఉండేది. కానీ యూపీఎస్సీ సరికొత్త విధంగా ప్రశ్నలు అడుగుతోంది. కాబట్టి యూపీఎస్సీ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించాలి. వార్తాపత్రికల ఆవశ్యకత చాలా కనిపిస్తోంది. న్యూస్‌ నుంచి కరెంట్‌ అఫైర్స్‌ను సేకరించుకోగలగాలి.వార్తల్లోని అంశాలను అభ్యర్థులు ఎంత బాగా అర్థం చేసుకున్నారో.. పరీక్షించేలా అనువర్తిత ప్రశ్నలను ఎక్కువగా అడుతున్నారు.

Also read: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

కోవిడ్‌పై రెండు ప్రశ్నలు
కోవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యానికి సంబంధించిన గతంలో కంటే ఎక్కువగా రెండు–మూడు ప్రశ్నలు అడిగారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంబంధించి.. ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఏ పద్ధతిలో తయారుచేశారు’ ప్రశ్న ఇచ్చారు. అలాగే కోవిడ్‌ తర్వాత మానవ రోగనిరోధక వ్యవస్థ పనితీరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన టీసెల్స్‌–బీసెల్స్‌.. వాటి విధులపై ప్రశ్న ఇచ్చారు. ఇవి సులభమైన ప్రశ్నలుగానే ఉన్నప్పటికీ.. సైన్స్‌ నేపథ్యం లేని వారికి కాస్త ఇబ్బంది కలగజేసేవే.

కోర్‌ జాగ్రఫీకి తగ్గిన ప్రాధాన్యత
జాగ్రఫీ నుంచి ప్రతి ఏడాది లాగే కోర్‌ జాగ్రఫీకి ప్రాధాన్యం తగ్గుతోంది. జలావరణం, వాతావరణం సంబంధించిన ప్రశ్నలు తగ్గుతున్నాయి. అప్లయిడ్‌ జాగ్రఫీ సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం నుంచి దాదాపు 15 ప్రశ్నలు వచ్చాయి. గండికోట లోయ ఏ నది ద్వారా ఏర్పడింది?, మియావాకీ విధానంలో పట్టణ ప్రాంతంలో మొక్కల పెంపకంపై, ఇటీవల వార్తల్లో నిలిచిన ‘లెవాంత్‌’ అనే ప్రాంతం ఏ భూభాగానికి చెందిందనే ప్రశ్నలు ఇచ్చారు. జనరల్‌ జాగ్రఫీ పుస్తకాల్లో లభించని ఈ అంశాలను అనువర్తిత జాగ్రఫీ విభాగంలో చదవొచ్చు. 

Also read: Groups Preparation: రసాయన శాస్త్రానికి సంబంధించి ఫోకస్‌ చేయాల్సిన చాప్టర్స్ ఇవే..

కరెంట్‌ పాలిటీ నుంచే
పాలిటీ నుంచి దాదాపు 15 ప్రశ్నలు వచ్చాయి. వాటిలో దాదాపు 10 ప్రశ్నలు కరెంట్‌ పాలిటీకి సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి. ఉదాహరణకు... గత రెండు రెండున్నరేళ్ల నుంచి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉన్నందున డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక విధానంపై ప్రశ్న అడిగారు. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తేదీలు ఎవరు నిర్ణయిస్తారు? డిప్యూటీ స్పీకర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న అధికరణలు ఏవి? తదితర అంశాలను అడిగారు. గతంలో కోర్‌ పాలిటీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి.. కానీ ఈ సారి కరెంట్‌ పాలిటీపై ఎక్కువ దృష్టి సారించారు.

Also read: Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీపై మూడు ప్రశ్నలు ఇచ్చారు. బయాలజీ, బయోటెక్నాలజీకి సంబంధించి మరో 3 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి 10–12 ప్రశ్నలు ఇచ్చారు. పర్యావరణ శాస్త్రం నుంచి గతంలో 20–25 ప్రశ్నలు వచ్చేవి. ఈసారి 15–20 ప్రశ్నలు వచ్చాయి. 

ఎకానమీ సమతూకం
ఎకానమీ బేసిక్‌ ప్రశ్నలతోపాటు కష్టమైన ప్రశ్నలు కూడా అడిగారు. ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణంనకు సంబంధించిన బేసిక్‌ ప్రశ్నలు, క్రెడిట్‌ రేటింగ్‌ సంబంధించి, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత క్లిష్టమైన ప్రశ్నలు ఇచ్చారు. 

Also read: Civils preparation: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌ చెప్పండి?

ఒత్తిడిని జయించినవారిదే విజయం
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ తెలిసినవాటిలాగే ఉన్నప్పటికీ.. అభ్యర్థులు సమాధానాలు గుర్తించడంలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. కఠినత్వం కంటే ఆప్షన్ల ద్వారా సమాధానాన్ని కనిపెట్టడంలో ఎక్కువ సమయం అవసరమైంది. ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ సన్నద్ధమయిన అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఒత్తిడిని జయించి.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసిన వారు సులభంగా ప్రిలిమ్స్‌లో పైచేయి సాధించగలరు. ప్రశ్నపత్రం కాఠిన్యత దృష్ట్యా గతేడాది జనరల్‌ 87.5, బీసీ 85 ఉన్నటువంటి కటాఫ్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ సారి పరీక్షల్లో సీశాట్‌ కూడా అంతతేలిగ్గా ఏమీలేదు. అర్హత పరీక్షే అయినప్పటికీ.. చాలా జాగ్రత్తగా ఉన్నవాళ్లే రాణించగలరు. యూపీఎస్సీ ఎప్పటికప్పుడు తీసుకువచ్చే ఈ మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలి. వేగంగా చదివి అర్థం చేసుకోగలగాలి.
– మల్లవరపు బాలలత, సబ్జెక్టు నిపుణులు

Also read: UPSC-CDS‌ (2) 2022: డిగ్రీతో త్రివిధ దళాల్లో కొలువులు.. నెలకు రూ.56,100 స్టయిపెండ్‌

Published date : 09 Jun 2022 05:51PM

Photo Stories