Skip to main content

IIM CAT Cut off 2023: క్యాట్‌-2023 విశ్లేషణ.. కటాఫ్‌ల అంచనా.. ఇలా

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. క్యాట్‌గా సుపరిచితం! దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) క్యాంపస్‌లలో.. ఎంబీఏ, పీజీడీఎం తదితర మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! వీటితోపాటు దేశ వ్యాప్తంగా మరో 1200కు పైగా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలకు ప్రామాణిక పరీక్ష క్యాట్‌! ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్‌-2023కు 2.88 లక్షల మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. క్యాట్‌-2023 విశ్లేషణ, కటాఫ్‌ అంచనా, మలి దశలో ఐఐఎంల ఎంపిక ప్రక్రియ, సన్నద్ధత తదితర వివరాలు..
cat 2023 cut off marks vs percentile
  • ముగిసిన క్యాట్‌-2023 పరీక్ష
  • గత ఏడాదికంటే క్లిష్టంగా ప్రశ్నలు
  • 77-80 మార్కులతో 99 పర్సంటైల్‌
  • మలి దశకు సిద్ధమవ్వాలంటున్న నిపుణులు

ఈ ఏడాది క్యాట్‌ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరం మాదిరిగానే మూడు విభాగాల నుంచి 66 ప్రశ్నలు అడిగారు. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 24 ప్రశ్నలు; డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు చొప్పున అడిగారు. ప్రతి విభాగంలోనూ బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూ)తోపాటు నాన్‌-ఎంసీక్యూలు కూడా ఉన్నాయి. వీఏఆర్‌సీ విభాగంలో నాలుగు;డీఐఎల్‌ఆర్‌లో 8; క్యూఏ­లో 7 నాన్‌-ఎంసీక్యూలు అడిగారు. దీంతో..అభ్యర్థులకు సమయాభావ సమస్య ఎదురైంది.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ

  • ఓకే రోజు మొత్తం మూడు స్లాట్లలో క్యాట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీనే ఎక్కువ క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లో ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలు ఉన్నాయి. వీఏఆర్‌సీ మాత్రం కాసింత సులభంగా ఉందని అంటున్నారు. 
  • స్లాట్‌-1లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో అల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఏడు ప్రశ్నలు అర్థమెటిక్‌ నుంచి, నాలుగు ప్రశ్నలు జామెట్రీ, సైక్లిక్‌ క్వాడ్రిలేటరల్‌పై అడిగిన ప్రశ్నలు పూర్తి స్థాయిలో గణితంపై పట్టు ఉన్న అభ్యర్థులు మా­త్రమే సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి.
  • స్లాట్‌-2లో కూడా ఇదే తీరుగా క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడిగారు. మొత్తం 22 ప్రశ్నలకు గాను అల్జీబ్రా నుంచి 8, అర్థమెటిక్‌ నుంచి 7, జామెట్రీ నుంచి మూడు ప్రశ్నలు, మోడ్రన్‌ మ్యాథ్స్, నంబర్స్‌ నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు.
  • స్లాట్‌-3లో మాత్రం అల్జీబ్రా నుంచి నాలుగు ప్రశ్నలు; అర్థమెటిక్‌ నుంచి 8 ప్రశ్నలు అడగడం కాసింత ఉపశమనం కలిగించే అంశంగా అభ్యర్థులు భావిస్తున్నారు.

చ‌ద‌వండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్‌ విద్య

 
ఆ విభాగాలు ఓ మోస్తరు
వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌; డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ సెక్షన్లు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. వెర్బల్‌ ఎబిలిటీలో అధిక భాగం ప్యాసే­జ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగారు. ఇవి కూడా సమకాలీన అంశాలకు సంబంధించినవి కావడంతో కరెంట్‌ అఫైర్స్,కాంప్రహెన్షన్‌పై పట్టు ఉన్నవారు మాత్ర­మే సమధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో అరేంజ్‌మెంట్స్‌ ప్రశ్నలు సులభంగా ఉండడంతో అభ్యర్థులు ఊరట చెందారు.

కటాఫ్‌ల అంచనా.. ఇలా

  • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ క్లిష్టంగా, మిగతా రెండు విభాగాలు ఓ మోస్తరుగా ఉండటంతో స్లాట్‌ల వారీగా వేర్వేరు కటాఫ్‌ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 
  • స్లాట్‌-1లో 89 స్కోర్‌తో 99.5 పర్సంటైల్, 80 స్కోర్‌తో 99పర్సంటైల్‌ సాధించొచ్చని అంచనా.
  • స్లాట్‌-2లో 91 మార్కులతో 99.5 పర్సంటైల్‌; 81 మార్కులతో 99 పర్సంటైల్,59 మార్కులతో 95 పర్సంటైల్, 50 మార్కులతో 90 పర్సంటైల్‌ పొందొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • స్లాట్‌-3లో 86-88 స్కోర్‌తో 99.5 పర్సంటైల్‌; 76-77 స్కోర్‌తో 99 పర్సంటైల్‌; 56-58 స్కోర్‌తో 95 పర్సంటైల్‌; 48-50 స్కోర్‌తో 90 పర్సంటైల్‌ సాధించొచ్చని అంచనా. 
  • మొత్తంగా.. ఈ మూడు స్లాట్లను నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి పర్సంటైల్స్‌ను నిర్ధారించే క్రమంలో.. 77-80 స్కోర్‌తో 99 పర్సంటైల్‌; 56-60 స్కోర్‌తో 95 పర్సంటైల్‌; 48-50 స్కోర్‌తో 90 పర్సంటైల్‌ పొందే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిర్దిష్ట కటాఫ్‌ పర్సంటైల్‌
తొలితరం ఐఐఎంల్లో మలి దశ ఎంపిక ప్రక్రియకు క్యాట్‌ కటాఫ్‌ 99-100 పర్సంటైల్‌గా ఉంటుందని అంచనా. మిగతా ఐఐఎంల్లో మాత్రం 94-95 పర్సంటైల్‌తో కూడా మలి దశకు అర్హత పొందే అవకాశం ఉంది. ఐఐఎం-షిల్లాంగ్, బో«ద్‌గయ వంటి క్యాంపస్‌ల్లో 90-92 పర్సంటైల్‌ వచ్చినా అర్హత లభించే వీలుంది. తుది జాబితా రూపకల్ప­న, గత రెండు, మూడేళ్ల ప్రవేశాలను పరిగణనలోకి తీసుకుంటే.. 93 శాతంపైగా పర్సంటైల్‌ ఉంటేనే ప్రవేశం ఖరారవుతోంది. ఐఐఎం-కోల్‌కత, ఐఐఎం-అహ్మదాబాద్‌ వంటి తొలి తరం ఐఐఎంలలో ప్ర­వేశం పొందాలంటే.. 99కి పైగా పర్సంటైల్‌ ఉంటేనే సాధ్యమని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

చ‌ద‌వండి: దేశవ్యాప్తంగా బీస్కూల్స్‌లో మేనేజ్‌మెంట్‌ విద్యకు ఏటీఎంఏ.. సాధిస్తే మంచి భ‌విష్యత్తుకు..

మలి దశకు సిద్ధంగా
నిర్దిష్ట క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. తదుపరి దశలో రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పర్సనల్‌ ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే.. ఐఐఎంల్లో ప్రవేశం ఖరారవుతుంది.

గ్రూప్‌ డిస్కషన్‌
మలి దశకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా ఐఐఎం క్యాంపస్‌లలో గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులను బృందాలుగా విభజించి ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. కోర్‌ నుంచి కాంటెంపరరీ వరకు ఈ అంశాలు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన పరిణామాలపైనా ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలి.

రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌
గ్రూప్‌ డిస్కషన్‌ తర్వాత రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌(ఆర్‌ఏటీ) ఉంటుంది. నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశాన్ని పేర్కొని అభ్యర్థుల అభిప్రాయం లేదా సలహాలు వ్యక్తీకరించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాల మధ్యలో అభ్యర్థులు తమ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఆర్‌ఏటీ టాపిక్స్‌ సబ్జెక్ట్‌ నాలెడ్జ్, సోషల్‌ అవేర్‌నెస్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన వారికి చివరిగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో.. సదరు అభ్యర్థికి మేనేజ్‌మెంట్‌ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంచుకున్న మార్గాలు తదితర అంశాలను నిపుణులైన ప్రొఫెసర్స్‌ కమిటీ పరిశీలిస్తుంది.

వెయిటేజీ ఆధారంగా
వంద మార్కుల వెయిటేజీ ఫార్మట్‌లో 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ లభిస్తోంది. దీంతోపాటు జండర్‌ డైవర్సిటీకి, అడమిక్‌ ప్రతిభకు కూడా తుది ఎంపికలో వెయిటేజీ ఉంటుంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు ఒక్కో కోర్సుకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో పని అనుభవానికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి.

అకడమిక్‌ డైవర్సిటీ
ఐఐఎంలలో ప్రవేశ ప్రక్రియ, క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించడం వంటి విషయాల్లో.. ఇంజనీరింగ్‌ అ­భ్యర్థులే ముందంజలో ఉంటున్నారనే అభిప్రాయం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితాలు కూడా ఈ అభిప్రాయాలు నిజమనేలానే ఉంటున్నాయి. దీంతో నాన్‌-ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐఐఎంలు అకడమిక్‌ డైవర్సిటీకి కూడా పెద్ద పీట వేస్తున్నాయి. నాన్‌-ఇంజనీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు కనిష్టంగా 15 శాతం.. గరిష్టంగా 30 శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి.

'క్యాట్‌'కు 40 శాతం వెయిటేజీ
తుది జాబితా రూపకల్పనలో మొత్తం వంద మార్కులకు క్యాట్‌ స్కోర్‌కు 40 శాతంగానే వెయిటేజీ ఉంటోంది. గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు 40 నుంచి 50 శాతం వెయిటేజీ లభిస్తోంది. ప్రొఫైల్, పని అనుభవం తదితర అంశాలకు దాదాపు 20 శాతం మేరకు వెయిటేజీని ఐఐఎంలు కల్పిస్తున్నాయి. 

sakshi education whatsapp channel image link

Published date : 08 Jan 2024 05:52PM

Photo Stories