GAT-B & BET 2024: లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీల్లో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలు..
- జేఏటీ–బి, బీఈటీ–2024 నోటిఫికేషన్ విడుదల
- బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లో పీజీ, పీహెచ్‌డీ
- పీజీ స్థాయి నుంచే ఆర్థిక ప్రోత్సాహకం
- లైఫ్ సైన్సెస్ విద్యార్థులకు చక్కటి అవకాశం
పీజీలో ప్రవేశానికి జీఏటీ–బి
జీఏటీ–బి టెస్ట్‌లో స్కోర్ ఆధారంగా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నెలకొల్పిన రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో 77 యూనివర్సిటీల్లో అగ్రి బయోటక్, ప్లాంట్ బయో టెక్నాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో మెడికల్ టెక్నాలజీ, కంప్యుటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్ తదితర స్పెషలైజేషన్లతో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెసీ బయో టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో 30 సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్‌లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- జీఏటీ–బి స్కోర్ ఆధారంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ కోర్సుల్లో సీటు సొంతం చేసుకుంటే.. స్టైఫండ్ కూడా అందిస్తారు. ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, అనుబంధ విభాగాల విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున; ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ విద్యార్థులకు నెలకు రూ.7.5 వేలు చొప్పున; ఎంటెక్/ఎంవీఎస్సీ స్పెషలైజేషన్ల విద్యార్థులకు నెలకు రూ.12 వేలు చొప్పున రెండేళ్ల వ్యవధికి ఈ స్టయిఫండ్ అందిస్తారు.
బీఈటీతో జేఆర్‌ఎఫ్
బీఈటీలో మెరిట్ ఆధారంగా యూనివర్సిటీలు, డీబీటీ లేబొరేటరీలు, డీబీటీ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశం లభిస్తుంది. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారికి తొలి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్. తర్వాత మరో మూడేళ్లు నెలకు రూ.35 వేలు చొప్పున ఎస్‌ఆర్‌ఎఫ్ అందుతుంది. వీటితోపాటు హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవడానికి సరిపడే మొత్తంతో ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది.
అర్హతలు
- జీఏటి–బి: పీజీలో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లతో లైఫ్ సైన్సెస్, వెటర్నరీ సైన్స్, ఎంబీబీఎస్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మలి దశలో ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత యూనివర్సిటీలు నిర్దేశించిన శాతంతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- బీఈటీ: బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంవీఎస్సీ/ఎం.ఫార్మసీ/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లలో బయోటెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయె కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యుటేషనల్ బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ లేదా బయాలజీ/లైఫ్ సైన్సె స్ అనుబంధ ఇతర సబ్జెక్ట్‌లతో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు
- దరఖాస్తు చివరి తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించ కూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లుగా గరిష్ట వయో పరిమితిని నిర్ణయించారు.
240 మార్కులకు జీఏటీ–బి
- బయో టెక్, లైఫ్ సైన్సెస్‌లలో పీజీ స్పెషలైజేషన్లలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను రెండు సెక్షన్లుగా, ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో 240 మార్కులకు నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొపున 60 మార్కులు ఉంటాయి.
- సెక్షన్–బిలో బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అనుబంధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులకు సెక్షన్–బిని నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎలో ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు, సెక్షన్–బిలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున నెగెటివ్ మార్కులు ఉంటాయి.
- సెక్షన్–ఎలో ప్రశ్నలు ఇంటర్మీడియెట్ స్థాయి సిలబస్‌కు సరితూగే విధంగా, సెక్షన్–బి ప్రశ్నలు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సిలబస్‌తో ఉంటాయి.
- జీఏటీ–బిలో పొందిన స్కోర్ ఆధారంగా జాతీ య స్థాయిలో మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
300 మార్కులకు బీఈటీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి చెందిన రీసెర్చ్ కేంద్రాల్లో పీహెచ్‌డీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను మూడు వందల మార్కులకు రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎలో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ బయో టెక్నాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- సెక్షన్–బిలో బయోటెక్నాలజీకి సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయిస్తారు.
- మొత్తం 300 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
రెండింటికీ అవకాశం
పీహెచ్‌డీలో ప్రవేశాలకు నిర్వహించే బీఈటీ ఎంట్రన్స్‌కు బీఈ, బీటెక్, ఎంబీబీఎస్‌లను కూడా అర్హతగా పేర్కొన్నారు. దీంతో పలు కోర్సుల ఉత్తీర్ణులు.. జీఏటి–బి, బీఈటీ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే వారు రెండింటికీ వేర్వేరుగా ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సబ్జెక్టుపై పట్టుతోనే విజయం
జీఏటీ–బి, బీఈటీలలో బెస్ట్ స్కోర్ సొంతం చేసుకోవాలంటే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా బ్యాచిలర్ స్థాయిలో సంబంధిత సబ్జెక్ట్‌లలో పరిపూర్ణ నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు అభ్యర్థుల్లో ఆయా అంశాల పట్ల ఉన్న పూర్తి అవగాహనను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి బ్యాచిలర్ స్థాయి పుస్తకాల్లోని అంశాలను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ప్రాథమిక భావనలకు సంబంధించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు జీప్యాట్, గేట్, జీఏటీ–బి, బీఈటీల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: Life Sciences
భవిష్యత్తు అవకాశాలు
జీఏటి–బి స్కోర్‌తో పీజీ పూర్తి చేసుకున్న వారికి.. సదరు స్పెషలైజేషన్‌ను అనుసరించి బయో టెక్నాలజీ సంస్థలు, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సంస్థలు, ఫార్మాస్యుటికల్ సంస్థలు, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లోని సంస్థల్లో ప్రొడక్షన్, మానిటరింగ్ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే సగటున నెలకు రూ. 50 వేల వరకు వేతనం అందుకునే అవకాశముంది. అదేవిధంగా బీఈటీ ద్వారా పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న వారికి ఐఐసీటీ, సీసీఎంబీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ ల్యాబ్స్‌లో రీసెర్చ్ అసోసియేట్ హోదాలో కొలువులు లభిస్తున్నాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024 మార్చి 6
- దరఖాస్తు సవరణ అవకాశం: మార్చి8, 9 తేదీల్లో
- జీఏటీ–బి, బీఈటీల పరీక్ష తేదీ: ఏప్రిల్ 20 (జీఏటి–బీ ఉదయం 9 – 12; బీఈటీ మధ్యాహ్నం 3–6 గంటల వరకు)
- వెబ్‌సైట్: https://exams.nta.ac.in/DBT, https://www.nta.ac.in/
Tags
- Careers
- admissions
- GAT-B BET 2024
- Graduate Aptitude Test – Biotechnology Notification
- Biotechnology Eligibility Test
- National Testing Agency
- life sciences
- PG Admissions
- PhD admissions
- latest notifications
- ExamProcedure
- AdmissionProcess
- FutureOpportunities
- Biotechnology
- sakshieducation latest admissions