Skip to main content

GAT-B, BET 2022: బయోటెక్, లైఫ్‌ సైన్సెస్‌లో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..

GAT-B, BET 2022 notification released, Examination Procedure, careers Opportunities
GAT-B, BET 2022 notification released, Examination Procedure, careers Opportunities

బయోటెక్నాలజీ.. లైఫ్‌ సైన్సెస్‌.. విద్యార్థుల ఆదరణ పెరుగుతున్న కోర్సులు! వేల మంది విద్యార్థులు.. బ్యాచిలర్‌ స్థాయిలోనే ఈ కోర్సుల్లో అడుగుపెడుతున్న పరిస్థితి! ఈ విద్యార్థులు యూజీ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్నాక.. భవిష్యత్తు అవకాశాల దిశగా చక్కటి మార్గంగా నిలుస్తున్నాయి.. గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌– బయోటెక్నాలజీ (గ్యాట్‌–బి), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ)!! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ టెస్ట్‌ల స్కోర్‌ ఆధారంగా.. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో.. లైఫ్‌ సైన్సెస్, బయో టెక్నాలజీల్లో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ప్రతి ఏటా ఈ ఎంట్రన్స్‌లను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా.. 2022కు సంబంధించి గ్యాట్‌–బి, బీఈటీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. గ్యాట్‌–బి, బీఈటీల ప్రత్యేకత, పరీక్ష విధానం, ఆయా కోర్సుల్లో ప్రవేశ విధానాలు, భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకుందాం.... 

  • గ్యాట్‌–బి స్కోర్‌తో డీబీటీ ఆర్‌సీబీ గుర్తింపు ఉన్న సంస్థల్లో పీజీ
  • బీఈటీ స్కోర్‌తో డీబీటీ స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌లో పీహెచ్‌డీ, జేఆర్‌ఎఫ్‌
  • ప్రవేశం ఖరారు చేసుకుంటే పీజీ నుంచే ఆర్థిక ప్రోత్సాహకం
  • ఎన్‌టీఏ నేతృత్వంలో గ్యాట్‌–బి, బీఈటీ–2022లకు నోటిఫికేషన్‌
  • బ్యాచిలర్, పీజీ స్థాయిలో లైఫ్‌ సైన్సెస్‌ విద్యార్థులకు చక్కటి అవకాశం

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ.. జాతీయ స్థాయిలో బయోటెక్నాలజీ అనుబంధ లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో ఉన్నత విద్య, పరిశోధనల దిశగా పలు చర్యలు చేపడుతున్న విభాగం. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు, పీహెచ్‌డీలపై అవగాహన కల్పించేందుకు.. ఆయా కోర్సులను పర్యవేక్షించేందుకు.. రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ పేరుతో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి మరీ చర్యలు చేపడుతుతోంది. జాతీయ స్థాయిలో ఈ సెంటర్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో బయోటెక్, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో పీజీ ప్రవేశాలకు; అదే విధంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ పరిధిలోని పరిశోధన కేంద్రాల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గ్యాట్‌–బి, బీఈటీ పేరుతో వేర్వేరుగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ల విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. తాజాగా 2022కు సంబంధించి గ్యాట్‌–బి, బీఈటీలకు ఎంపిక ప్రక్రియ మొదలైంది.

 

చ‌ద‌వండి: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...

అర్హతలు

  • గ్యాట్‌–బి: పీజీలో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లతో లైఫ్‌ సైన్సెస్,వెటరినరీ సైన్స్,ఎంబీబీఎస్,ఫార్మసీ,అగ్రికల్చర్‌ తదితర సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • మలి దశలో ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత యూనివర్సిటీలు నిర్దేశించిన శాతంతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
  • బీఈటీ: బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంవీఎస్సీ/ఎంఫార్మసీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లలో బయోటెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ లేదా బయాలజీ/లైఫ్‌ సైన్సెస్‌ అనుబంధ ఇతర సబ్జెక్ట్‌లతో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లుగా గరిష్ట వయో పరిమితిని నిర్ణయించారు.

గ్యాట్‌–బి.. వందల సంఖ్యలో పీజీ సీట్లు

  • గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌– బయో టెక్నాలజీ.. సంక్షిప్తంగా గ్యాట్‌–బి. ఈ టెస్ట్‌లో స్కోర్‌ ఆధారంగా.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ నెలకొల్పిన రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ప్రస్తుతం జాతీయ స్థాయిలో 63 యూనివర్సిటీల్లో అగ్రి బయెటెక్, ప్లాంట్‌ బయె టెక్నాలజీ, ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో మెడికల్‌ టెక్నాలజీ, కంప్యుటేషనల్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ సైన్సెస్‌ తదితర స్పెషలైజేషన్లతో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో.. ఎమ్మెసీ బయో టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో 30 సీట్లు అందుబాటులో ఉంటాయి. 
  • గ్యాట్‌–బి స్కోర్‌ ఆధారంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రవేశం ఖరారైతే.. స్టైఫండ్‌ 

  • గ్యాట్‌–బి స్కోర్‌ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో సీటు సొంతం చేసుకుంటే.. కోర్సు ఆధారంగా నిర్దిష్టమొత్తంలో స్టైఫండ్‌ కూడా అందిస్తారు. 
  • ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, అనుబంధ విభాగాల విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున; ఎమ్మెస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ విద్యార్థులకు నెలకు రూ.7.5 వేలు చొప్పున; ఎంటెక్‌/ఎంవీఎస్సీ స్పెషలైజేషన్ల విద్యార్థులకు నెలకు రూ.12 వేలు చొప్పున రెండేళ్ల వ్యవధికి ఈ స్టైఫండ్‌ అందిస్తారు.

గ్యాట్‌–బి రెండు సెక్షన్లుగా.. 240 మార్కులకు

  • పీజీ స్పెషలైజేషన్లలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ను రెండు సెక్షన్లుగా, ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో 240 మార్కులకు నిర్వహిస్తారు.
  • సెక్షన్‌–ఎలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొపున 60 మార్కులు ఉంటాయి.
  • సెక్షన్‌–బిలో.. బేసిక్‌ బయాలజీ, లైఫ్‌ సైన్సెస్, బయోటెక్నాలజీ అనుబంధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులకు సెక్షన్‌–బిని నిర్వహిస్తారు.
  • సెక్షన్‌–ఎలో.. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు, సెక్షన్‌–బిలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.
  • సెక్షన్‌–ఎలో.. ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌ స్థాయి సిలబస్‌కు సరితూగే విధంగా,సెక్షన్‌–బి ప్రశ్నలు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి సిలబస్‌తో ఉంటాయి.
  • గ్యాట్‌–బిలో పొందిన స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు.

బీఈటీ.. 300 మార్కులకు

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ రీసెర్చ్‌ కేంద్రాల్లో పీహెచ్‌డీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను మూడు వందల మార్కులకు రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. 

  • సెక్షన్‌–ఎలో.. జనరల్‌ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ ఆప్టిట్యూడ్, అనలిటికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ బయో టెక్నాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 50 మార్కులు కేటాయిస్తారు.
  • సెక్షన్‌–బిలో.. బయోటెక్నాలజీకి సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయిస్తారు.
  • గ్యాట్‌–బి మాదిరిగానే బీఈటీలోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమలు చేస్తారు.
  • మొత్తం 300 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

రెండు కేటగిరీలుగా మెరిట్‌ జాబితా

  • బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా రెండు కేటగిరీలుగా (కేటగిరీ–1, కేటగిరీ–2) మెరిట్‌ జాబితా రూపొందిస్తారు.
  • బీఈటీ స్కోర్‌లో టాప్‌–275 అభ్యర్థులతో కేటగిరీ–1 జాబితా రూపొందిస్తారు.
  • వీరికి దేశ వ్యాప్తంగా యూజీసీ, డీబీటీ, ఆర్‌సీబీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది.
  • కేటగిరీ–2 పేరుతో మరో వంద మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి నేరుగా డీబీటీ స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.

జేఆర్‌ఎఫ్‌.. ఆర్థిక ప్రోత్సాహకం

బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా ఆయా యూనివర్సిటీలు, డీబీటీ స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పేరిట రెండేళ్ల పాటు నెలకు రూ.31 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు చూపిన ప్రతిభ, పనితీరు ఆధారంగా మరో మూడేళ్ల వ్యవధికి సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పేరుతో నెలకు రూ.35 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. వీటితోపాటు హౌస్‌ రెంట్‌ అలవెన్స్, మెడికల్‌ అలవెన్స్, రీసెర్చ్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవడానికి సరిపడే మొత్తంతో ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. అదే విధంగా సంవత్సరానికి రూ. 20 వేలు చొప్పున కాంటింజెన్సి గ్రాంట్‌ను కూడా లభిస్తుంది.

రెండు పరీక్షలకు దరఖాస్తు

పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే బీఈటీ ఎంట్రన్స్‌కు బీఈ/బీటెక్, ఎంబీబీఎస్‌లను కూడా అర్హతగా పేర్కొన్న నేపథ్యంలో కొన్ని కోర్సుల ఉత్తీర్ణులు గ్యాట్‌–బి, బీఈటీ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వారు రెండింటికీ వేర్వేరుగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
 

చ‌ద‌వండి: Career Opportunities: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌ సెన్సైస్ కోర్సులు

బ్యాచిలర్‌ స్థాయి నైపుణ్యాలు

పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉండే గ్యాట్‌–బి,బీఈటీల్లో విజయానికి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌ ఆధారంగా బ్యాచిలర్‌ స్థాయిలో సంబంధిత సబ్జెక్ట్‌లలో పరిపూర్ణ నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు అభ్యర్థుల్లో ఆయా అంశాల పట్ల ఉన్న పూర్తి అవగాహనను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి బ్యాచిలర్‌ స్థాయి పుస్తకాల్లోని అంశాలను అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ప్రాథమిక భావనలకు సంబంధించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. జీప్యాట్, గేట్, గ్యాట్‌–బి, బీఈటీల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

భవిష్యత్తు అవకాశాలు

గ్యాట్‌–బి స్కోర్‌తో పీజీ పూర్తి చేసుకున్న వారికి.. సదరు స్పెషలైజేషన్‌ను అనుసరించి బయో టెక్నాలజీ సంస్థలు,ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ సంస్థలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలు, హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌లోని సంస్థల్లో ప్రొడక్షన్, మానిటరింగ్‌ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే సగటున నెలకు రూ.50 వేల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది. ఈ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సైతం జరుగుతున్నాయి. ఇలా క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారా ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు, బయె టెక్‌ సంస్థలు, అగ్రికల్చరల్‌ సీడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు రిక్రూట్‌మెంట్స్‌ చేపడుతున్నాయి. ఇక.. బీఈటీ ద్వారా పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న వారికి ఇవే రంగాల్లో, అదే విధంగా ఐఐసీటీ, సీసీఎంబీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ హోదాలో కొలువులు లభిస్తున్నాయి.

గ్యాట్‌–బి,బీఈటీ–2022 ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2022
  • గ్యాట్‌–బి,బీఈటీల పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 23, 2022 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: dbt.nta.ac.in, www.nta.ac.in


చ‌ద‌వండి: కెరీర్ గైడెన్స్...బయోకెమిస్ట్రీ

Published date : 29 Mar 2022 03:27PM

Photo Stories