Skip to main content

CSIR UGC NET 2022: సైన్స్‌ రంగంలో పరిశోధనలు.. ప్రతిభావంతులకు చక్కటి మార్గాలు..

csir ugc net 2022 notification and exam pattern
csir ugc net 2022 notification and exam pattern

సైన్స్‌ రంగంలో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి మార్గం.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థలో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రొఫెసర్‌ /లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ జూన్‌ 2022 ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఈ పరీక్షకు సంబంధించి సమగ్ర సమాచారం..

ఐదు విభాగాలుగా
సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షను మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ సైన్సెస్‌(అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌), లైఫ్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.

చ‌ద‌వండి: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...

ఫెలోషిప్‌ ప్రయోజనాలు

  • సైన్స్‌ విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ కెరీర్‌ పరంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇందులో అర్హత పొంది ఫెలోషిప్‌ సాధిస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని గొప్ప సైంటిస్ట్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.
  • సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతోపాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్, అలాగే అదనంగా ఏటా కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద రూ.20వేలు పొందవచ్చు.
  • రెండేళ్ల జేఆర్‌ఎఫ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేలు ఫెలోషిప్‌ లభిస్తుంది.
  • నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టూడెంట్స్, నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ వంటి ఫెలోషిప్‌లకు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 

చ‌ద‌వండి: Career Opportunities: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌ సెన్సైస్ కోర్సులు

లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

  • నెట్‌లో అర్హతతో దేశంలోని అన్ని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ/తత్సమాన హోదా ఉన్న సంస్థల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు.
  • తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. నెట్‌/స్లెట్‌లో అర్హత తప్పనిసరి.
  • ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు నెట్‌ /జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాల కోసం నెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.

అర్హతలు

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 55శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50శాతం) ఎమ్మెస్సీ/తత్సమాన కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ ఎంఎస్‌/నాలుగేళ్ల బీఈ/బీటెక్‌/బీటెక్‌/బీఫార్మసీ లేదా ఎంబీబీఎస్‌ లేదా నిబంధనల మేరకు ఎమ్మెస్సీ(10+2+3 విధానంలో చేరినవారు) చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా అర్హులే. లేదా 55 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50శాతం) బీఎస్సీ(ఆనర్స్‌) తత్సమానం లేదా ఎంఎస్‌ పీహెచ్‌డీ.

వయసు

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోకు వయసు 28ఏళ్లు మించకుండా ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. లెక్చరర్‌షిప్‌నకు ఎటువంటి గరిష్ట వయోపరిమితిలేదు.

రాత పరీక్ష ఇలా

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి పార్ట్‌–ఎ, పార్ట్‌–బి, పార్ట్‌–సి. పరీక్ష సమయం 3 గంటలు(180 నిమిషాలు).

పార్ట్‌–ఎ

ఈ విభాగం పరీక్ష అందరికి ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ అనాలిసిస్, అనలిటికల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్, ఫార్మేషన్, పజిల్స్‌ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలుంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5శాతం నెగిటివ్‌ మార్కులుంటాయి.

పార్ట్‌–బి

  • ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటుంది.
  • కెమికల్‌ సైన్సెస్‌ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5శాతం మార్కుల కోత వి«ధిస్తారు.
  • ఎర్త్‌ సైన్సెస్, లైఫ్‌ సైన్సె విభాగాల నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 35 ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.5శాతం మార్కుల కోత ఉంటుంది. 
  • మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.75శాతం మార్కులను కోతగా విధిస్తారు.
  • ఫిజికల్‌ సైన్సెస్‌లో 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.875శాతం మార్కుల కోత ఉంటుంది.

పార్ట్‌–సి

  • ఈ విభాగంలో అభ్యర్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులోని శాస్త్రీయ అనువర్తనాలను అన్వయించే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటాయి.
  • కెమికల్‌ సైన్సెస్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వీటిలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులను కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
  • ఎర్త్‌ సైన్సెస్‌లో 80 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1.32శాతం మార్కుల కోత విధిస్తారు. 
  • లైఫ్‌ సైన్స్‌ విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సరైన సమాధానానికి 4 మార్కును కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది.
  • మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో 60 ప్రశ్నలుంటాయి. 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగంలోని ప్రశ్నలకు కేటాయించారు. ఇందులో నెగిటివ్‌ మార్కులు లేవు.
  • ఫిజికల్‌ సైన్సెస్‌లో 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు ఇస్తారు, తప్పు సమాధానానికి 1.25శాతం మార్కుల కోత విధిస్తారు.

చ‌ద‌వండి: కెరీర్ గైడెన్స్...మైక్రోబయాలజీ

సన్నద్ధత ఇలా

  • సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ పరీక్షల్లో అర్హత సాధించాలంటే .. బేసిక్‌ అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. బేసిక్స్‌ మీద గ్రిప్‌ పెంచుకున్న తర్వాత డిగ్రీ, పీజీ స్థాయిలో అడ్వాన్స్‌డ్‌ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
  • వీలైనన్నీ ఎక్కువగా మోడల్‌ పరీక్షలు, ప్రాక్టీస్‌ టెస్టులు రాయాలి. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ పరీక్షలో చాలా కీలకం. ఆబ్జెక్టివ్‌ టైప్‌ మెటీరియల్‌ను కాకుండా..పాఠ్యపుస్తకాలను చదవడం మేలు. తద్వారా సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుంది.పశ్న ఎలా అడిగిన సమాధానం రాయగలుగుతారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 10.08.2022
  • ఎడిట్‌ ఆప్షన్‌ : 2022 ఆగస్టు 12–16 తేదీ వరకు
  • వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in
Published date : 26 Jul 2022 03:46PM

Photo Stories