Skip to main content

Career Guidance: వైరస్‌ల పని పట్టే.. వైరాలజిస్ట్‌!

వైరస్‌.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే భయపడుతున్న పరిస్థితి! కోవిడ్‌ వంటి వైరస్‌లు విజృంభిస్తూ.. మానవాళికి హాని చేస్తూ.. ప్రజల ప్రాణాలను సైతం కబళిస్తున్నాయి. ఇలాంటి ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలకు ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. వైరస్‌ల నియంత్రణకు ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీపై దృష్టిపెట్టాయి. ఇదే ఇప్పుడు యువతకు ఎమర్జింగ్‌ కెరీర్‌గా మారుతోంది! సంబంధిత నైపుణ్యాలు అందించే వైరాలజీ కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ అవకాశాలు అందుకోవచ్చు! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ల వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. వైరాలజీ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..
virology courses, career opportunities and all details here
virology courses, career opportunities and all details here
  • వైరాలజీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌
  • వైరస్‌ల నిగ్గు తేల్చే స్పెషలిస్ట్‌ల కోసం అన్వేషణ
  • పరిశోధన సంస్థల నుంచి ఫార్మారంగం వరకు అవకాశాలు
  • బ్యాచిలర్‌ స్థాయి నుంచే నైపుణ్యార్జనకు మార్గాలు

దాదాపు శతాబ్దం క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్‌ ఫ్లూ మొదలు.. ఇటీవల కాలంలో వ్యాపిస్తున్న కోవిడ్‌–19 వరకూ.. పదుల సంఖ్యలో వైరస్‌లు మహమ్మారులుగా మారుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌–19 నిరంతరం రూపాంతరం చెందుతూ.. డెల్టా, ఒమిక్రాన్‌.. ఇలా పలు వేరియంట్లతో ప్రజలను పీడిస్తోంది. ఇలాంటి వైరస్‌లకు అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రయత్నాలు,పరిశోధనలే.. ఇప్పుడు వైరాలజీ నిపుణులకు డిమాండ్‌ పెంచుతున్నాయి.

వైరాలజీ అంటే

ఏదైనా ఒక వైరస్‌ను గుర్తించినప్పుడు.. దాని పుట్టుక మూలాలను అన్వేషించడం.. జన్యు క్రమాన్ని గుర్తించడం.. వాటి ఆధారంగా సరైన ఔషధాలను, వ్యాక్సిన్‌లను తయారు చేసే శాస్త్రమే.. వైరాలజీ. ఈ విభాగంలో నైపుణ్యాలను పొందిన వారినే వైరాలజిస్ట్‌లు అంటారు. ఈ వైరాలజిస్ట్‌ల గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పరిశోధన సంస్థలు, ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ సంస్థల్లో దశాబ్దాల నుంచి వైరాలజిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైరస్‌లపై అధ్యయనం కొనసాగేలా వైరాలజిస్టుల నియామకాలు జరుగుతున్నాయి.

అవకాశాలు

ప్రస్తుతం పరిస్థితుల్లో వైరాలజీలో స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలున్న వారికి సంబంధిత సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న రీసెర్చ్‌ లేబొరేటరీస్, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు, ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, బయో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ సంస్థల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్, పీజీ స్థాయి అర్హతలున్న ప్రతిభావంతులకు కంపెనీలు లక్షల్లో వేతనాలు అందిస్తున్నాయి. 

అకడమిక్‌ మార్గాలివే

ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న వైరాలజీలో నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి నుంచే అడుగులు వేయొచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీలో బీఎస్సీ–మైక్రోబయాలజీ లేదా బయో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ లు అభ్యసిస్తే.. భవిష్యత్తులో ఈ విభాగంలో పీజీ స్థాయిలో స్పెషలైజేషన్లు చేయడానికి అర్హత లభిస్తుంది. బీఎస్సీతోపాటు ఎంబీబీఎస్, బీవీఎస్సీ ఉత్తీర్ణులు కూడా వైరాలజీ స్పెషలైజ్డ్‌ కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.


చ‌ద‌వండి: Career Opportunities: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌ సెన్సైస్ కోర్సులు

పూర్తి స్థాయిలో పీజీ

వైరాలజీకి సంబంధించి విస్తృత నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సు చక్కటి మార్గం. ఈ కోర్సు కరిక్యులంలో భాగంగా.. వైరస్‌ యాంటిజెన్‌ డిటెక్షన్, జీని రెగ్యులేషన్‌ అండ్‌ రీకాంబినెట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోఇన్‌స్ట్రుమెంటేషన్, టిష్యూ కల్చర్‌ టెక్నిక్స్, బయో స్టాటిక్స్‌ అండ్‌ అప్లికేషన్స్, వైరల్‌ సెల్‌ ఇంటరాక్షన్, మైక్రోబియల్‌ ఫిజియాలజీ, వైరస్‌ రెప్లికేషన్, మాలిక్యులర్‌ ఇమ్యునాలజీ, వైరల్‌ ఎన్సెఫాలిటిస్, ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ, వెటర్నరీ అండ్‌ అగ్రికల్చర్‌ వైరస్, ఎన్విరాన్‌మెంటల్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీ అంశాలను అభ్యసించాల్సి ఉంటుంది. ఫలితంగా పీజీ పూర్తి చేసుకునే సమయానికి వైరస్‌లపై అధ్యయనానికి అవసరమైన అన్ని రకాల నైపుణ్యాలపై సంపూర్ణ పరిజ్ఞానం లభిస్తుంది.

పరిశోధనలకు పీహెచ్‌డీ

వైరాలజీ, మైక్రోబయాలజీలలో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉంది. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌లో లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.. సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ఎంటెరో వైరస్‌ రీసెర్చ్‌ సెంటర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటెరిక్‌ డిసీజెస్, నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్స్‌(దిబ్రూగఢ్, భువనేశ్వర్, జబల్‌పూర్, పోర్ట్‌బ్లెయిర్‌) తదితర రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్స్‌గా అడుగుపెట్టొచ్చు. పరిశోధన సమయంలో జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.

పీజీ ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే

  • ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో.. ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సును సావిత్రాబాయి పూలే యూనివర్సిటీ భాగస్వామ్యంతో అందిస్తున్నారు.
  • ఈ కోర్సులో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇది జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌ అనే రెండు విభాగాల్లో ఉంటుంది.
  • జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి పది ప్రశ్నలు 20 మార్కులకు, అప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలను 80 మార్కులకు అడుగుతారు. ఇలా మొత్తం వంద మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అప్టిట్యూడ్‌ విభాగంలో బయో టెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్, మెడికల్‌ సైన్సెస్, మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్సెస్, జువాలజీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందించి ప్రవేశాలు ఖరారు చేస్తారు. 
  • బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా బయె కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు చదివిన అభ్యర్థులు, ఎంబీబీఎస్, బీవీఎస్సీ విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.

ఎన్‌ఐవీలో పీహెచ్‌డీ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలోనే పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బేసిక్‌ మెడికల్‌ సైన్స్, బయో కెమిస్ట్రీ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ స్థాయిలో లైఫ్‌ సైన్సెస్‌/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్‌ స్పెషలైజేషన్లతో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారు దరఖాస్తుకు అర్హులు.

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా

  • వైరాలజీ పీజీ స్థాయి స్పెషలైజేషన్‌ కోర్సులు దేశంలోని ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీలో శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఈ కోర్సు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో ఒక కోర్‌ సబ్జెక్ట్‌గా వైరాలజీని చదివే అవకాశం ఉంది. యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
  • జాతీయ స్థాయిలో.. జిప్‌మర్‌–పుదుచ్చేరిలో ఎండీ మైక్రోబయాలజీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్, అమిటీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సులున్నాయి.

కెరీర్‌

వైరాలజీ విభాగంలో.. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న వారికి కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ పరిశోధన సంస్థలు, ఐసీఎంఆర్, ఫార్మాస్యుటికల్‌ సంస్థలు, లైఫ్‌సెన్స్‌ ప్రొడక్ట్‌ కంపెనీలు, హాస్పిటల్స్, మెడ్‌టెక్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా ఎంట్రీ లెవల్‌లో.. ల్యాబ్‌ అసిస్టెంట్‌ నుంచి అత్యున్నత స్థాయిలో రీసెర్చ్‌ స్పెషలిస్ట్‌ వరకు పలు హోదాల్లో కొలువుదీరొచ్చు.

వైరాలజీ.. ఉద్యోగాలు, విధులు

  • రీసెర్చ్‌ హెడ్‌: ఆయా పరిశోధన విభాగాలకు నేతృత్వం వహిస్తూ.. ఇతర సిబ్బందికి, రీసెర్చ్‌ అసోసియేట్స్‌కు ఆవిష్కరణలకు సంబంధించి సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • రీసెర్చ్‌ అసోసియేట్‌: పలు నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించడం, అందుకు అవసరమైన ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. 
  • రీసెర్చ్‌ అనలిస్ట్‌: పలు సర్వేలు, అధ్యయనాల ఆధారంగా రూపొందించిన రీసెర్చ్‌ డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ఒక క్రమ పద్ధతిలో తదుపరి ప్రక్రియలు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
  • వైరాలజిస్ట్‌: సంక్రమణ వ్యాధుల నిర్ధారణ, చికిత్స, నివారణ మార్గాలు అన్వేషించడం, ఆయా వైరస్‌లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం వీరి విధులు.
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: వైరాలజీ స్పెషలైజేషన్‌తో అధ్యాపక వృత్తిలో లభించే హోదా ఇది. రీసెర్చ్‌ గైడెన్స్, మెంటారింగ్‌ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • బ్యాక్టీరియాలజిస్ట్‌: పలు రకాల బ్యాక్టీరియాలను గుర్తించి.. వాటిపై అధ్యయనం చేయడం, దానికి సంబంధించిన నివేదికలు రూపొందించడం వంటివి చేయాలి.
  • మికాలజిస్ట్‌: వీరు శిలీంద్రాల అధ్యయనం చేస్తారు.
  • సెల్‌ బయాలజిస్ట్‌: వైరస్‌లకు విరుగుడు కనుగొనే క్రమంలో.. జీవ కణ అణువుల పనితీరును అధ్యయనం చేసి.. వాటిద్వారా సూక్ష్మ జీవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

వేతనాలు

వైరాలజీ స్పెషలైజేషన్‌తో కొలువులు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం పలు సంస్థల గణాంకాల ప్రకారం–రీసెర్చ్‌ హెడ్స్‌కు రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు; రీసెర్చ్‌ అసోసియేట్స్‌కు గరిష్టంగా రూ.5 లక్షల వరకు; వైరాలజిస్ట్‌లకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు; బ్యాక్టీరియాలజిస్ట్‌లకు రూ.4 లక్షలకు పైగా; మికాలజిస్ట్‌లకు రూ.7లక్షలకు పైగా; సెల్‌ బయాలజిస్ట్‌లకు రూ.10 లక్షలకు పైగా వార్షిక వేతనాలు అందుతున్నాయి.

విదేశీ ఉద్యోగాలు

వైరాలజీ స్పెషలిస్ట్‌లకు ఇప్పుడు విదేశీ సంస్థలు సైతం స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల్లో... పీజీ, ఆపై అర్హతలున్న వారికి కొలువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆయా దేశాలకు చెందిన పరిశోధన సంస్థలు నిపుణుల కోసం అన్వేషిస్తూ విదేశీయులకు ఆఫర్స్‌ ఇస్తున్నాయి. 

అవకాశాలకు కొదవ లేదు

వైరాలజీ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పీజీ, పీహెచ్‌డీ చేస్తే కచ్చితంగా చక్కటి కెరీర్‌ సొంతం అవుతుంది.
–ప్రొ‘‘ఆర్‌.సుబ్రమణియన్, స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.


చ‌ద‌వండి: Life Sciences

Published date : 09 Feb 2022 06:52PM

Photo Stories