Skip to main content

Career Opportunities with Internship: ఇంటర్న్‌షిప్‌.. కెరీర్‌కు ధీమా!

Career Opportunities with Internship
Career Opportunities with Internship

ఇంటర్న్‌షిప్‌.. టెక్నికల్, ట్రెడిషనల్, ప్రొఫెషనల్‌.. ఏ కోర్సు విద్యార్థులకైనా నేడు సుపరిచితంగా మారింది. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తే.. క్షేత్ర నైపుణ్యాలు సొంతమవుతాయి. ఫలితంగా.. జాబ్‌ మార్కెట్‌లో చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. అయితే ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుకోవడం ఎలా.. ఇంటర్న్‌ ట్రైనీల ఎంపిక ఎలా ఉంటుంది.. ఏఏ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.. ఇలా.. ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్న్‌షిప్‌ ప్రాధాన్యత, అందుకునేందుకు మార్గాలు, ఇంటర్న్‌షిప్‌తో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...

  • క్షేత్ర నైపుణ్యాలకు మార్గంగా నిలుస్తున్న ఇంటర్న్‌షిప్‌
  • టెక్నికల్, నాన్‌–టెక్నికల్‌ విభాగాల్లో అవకాశాలు
  • అందుకునేందుకు అందుబాటులోకి అనేక మార్గాలు

నేటి డిజిటల్‌ యుగంలో.. అన్ని నేపథ్యాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ ద్వారా అందే నైపుణ్యాలు భవిష్యత్తు అవకాశాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విద్యార్థులు అకడమిక్‌ స్థాయిలోనే క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అకడమిక్స్‌కు సంబంధించిన రంగాల్లో తాజా పరిణామాలపై అవగాహన, అన్వయ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే.. భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలకు ధీమా లభిస్తుందని చెబుతున్నారు. 

నైపుణ్యాలు.. భవిష్యత్తుకు బాట

ఇంటర్న్‌షిప్‌ అంటే..విద్యార్థులు అప్పటివరకు తాము అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను.. వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే మార్గం. విద్యార్థులు తాము ఆయా కోర్సులు చదువుతున్న సమయంలోనే క్షేత్ర నైపుణ్యాలు పొందేందుకు ఇంటర్న్‌షిప్‌ వీలుకల్పిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం–ఇంటర్న్‌షిప్‌ అంటే విద్యార్థులు కొద్దిరోజుల పాటు ఏదైనా ఒక సంస్థలో వాస్తవ పని వాతావరణంలో విధులు నిర్వహించడం. దీనివల్ల విద్యార్థులకు సదరు ఇండస్ట్రీలోని తాజా పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. ఎంచుకున్న విభాగానికి సంబంధించిన నైపుణ్యాలు సైతం సొంతమవుతాయి.

Internships: సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ ప్రారంభం.. భారీగా స్టయిపండ్‌ అందిస్తున్న కంపెనీలు

పెరుగుతున్న ప్రాధాన్యం

ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం–బీటెక్‌ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ల తర్వాత తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ప్రతి దఫా రెండు నెలలు.. ఇలా మొత్తంగా నాలుగేళ్ల కోర్సు వ్యవధిలో ఆరు వందల నుంచి ఏడు వందల గంటల వ్యవధిలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఈ ఇంటర్న్‌షిప్స్‌కు క్రెడిట్స్‌ను కూడా కేటాయించింది. ప్రతి 40–45 గంటల వ్యవధికి ఒక క్రెడిట్‌ చొప్పున మొత్తం 14 నుంచి 20 క్రెడిట్స్‌ ఇవ్వనున్నారు. అదే విధంగా పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐఎంలు, ఐఐటీలు తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాయి. అంతేకాకుండా సంబంధిత సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇప్పించడానికి ఇండస్ట్రీ వర్గాలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి.

ఐఐఎంలు, ఐఐటీల్లో ఇలా

దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఐఐటీలు, ఐఐఎంలు ఇంటర్న్‌షిప్స్‌ కోసం ప్రత్యేక ప్రక్రియ చేపడుతున్నాయి. ఆయా సంస్థలతో ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వర్గాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఫలితంగా సదరు సంస్థలు.. ఆయా క్యాంపస్‌లను సందర్శించి.. బీటెక్‌ మూడో సంవత్సరం, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పేరుతో తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఎంపికైన వారు ఇంటర్న్‌ట్రైనీగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఆయా సంస్థల్లో ఇంటర్న్‌ ట్రైనీగా నిజమైన పని వాతావరణంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలపై అవగాహన లభించడమే కాకుండా.. ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది. అదే విధంగా సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పేరుతో ఇంటర్న్‌ట్రైనీగా ఎంపికైన వారికి కొన్ని సంస్థలు స్టయిఫండ్‌ పేరిట ఆర్థిక ప్రోత్సహకాన్ని సైతం అందిస్తున్నాయి.

Industry 4.0 Skills‌: బీటెక్‌ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్‌ ఉండాల్సిందే!

అన్ని విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌

గత కొంత కాలం వరకు ఇంటర్న్‌షిప్‌ అంటే టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ నేపథ్యం ఉన్న వారికే అనే అభిప్రాయం ఉండేది. కానీ.. ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌ సంప్రదాయం, నాన్‌–టెక్నికల్‌ డిగ్రీ విభాగాలకూ విస్తరిస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు ఈ–కామర్స్‌ సంస్థలు, స్టార్టప్‌ సంస్థలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం తమ సంస్థల వెబ్‌సైట్స్‌ లేదా జాబ్‌ పోర్టల్స్‌ ద్వారా ప్రకటనలను విడుదల చేస్తున్నాయి.

స్వీయ అన్వేషణే మార్గం

  • ద్వితీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుకోవడం కొంత కష్టంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ఇండస్ట్రీ వర్గాలతో పరిచయాలు లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి పరిష్కారంగా సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లోని విద్యార్థులు.. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడిన తమ సీనియర్లు లేదా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లు లేదా ప్రొఫెసర్ల సహకారంతో ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇలాంటి విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ దిశగా స్వీయ అన్వేషణ సాగించాలి. మరోవైపు ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందించేందుకు కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానంగా నిలుస్తున్న ఇంటర్న్‌శాల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం– విద్యార్థులు ఇంటర్న్‌శాల వెబ్‌సైట్‌లో తమ అకడమిక్‌ వివరాలు.. డొమైన్‌ ఏరియాస్‌ను పేర్కొంటే.. అందుకు సంబంధించి అవకాశాలు కల్పించే సంస్థల వివరాలు లభ్యమవుతాయి.

సంస్థల వెబ్‌సైట్స్‌

ఇంటర్న్‌షిప్స్‌ కోసం స్వీయ అన్వేషణ సాగిస్తున్న విద్యార్థులు ఆయా సంస్థల వెబ్‌సైట్స్‌ ద్వారా సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో అధిక శాతం సంస్థలు తమ వెబ్‌సైట్‌లో.. కెరీర్స్‌/కరెంట్‌ ఆపర్చునిటీస్‌ కాలంలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాల గురించి వెల్లడిస్తున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకుని ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే.. ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఈ ఎంపిక ప్రక్రియలో సంస్థలు అభ్యర్థుల అకడమిక్‌ నైపుణ్యాలతోపాటు ప్రాక్టికల్‌ థింకింగ్, విశ్లేషణ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వీటిలో రాణించే విధంగా సన్నద్ధం కావాలి.

Job Trends 2022: ఆ రెండు రంగాల్లో.. కొలువుల పండగే!

జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌

జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌ కూడా తమ క్లయింట్‌ సంస్థల్లోని ఇంటర్న్‌షిప్‌ అవకాశాల సమాచారాన్ని పొందుపరుస్తున్నాయి. గతంలో కేవలం జాబ్‌ లిస్టింగ్స్‌కే పరిమితమైన ఈ పోర్టల్స్‌.. ఇంటర్న్‌ అవకాశాలను అందుబాటులోకి తేవడాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అకడమిక్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

సోషల్‌ వేదికలు

ఇంటర్న్‌షిప్‌ విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్‌ వేదికలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల సమాచారం తెలుసుకోవచ్చు. విద్యార్థులు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులను అనుసరిస్తూ.. ఇంటర్న్‌ ట్రైనీ అవకాశాలు దక్కించుకోవచ్చు.

సర్కారు సహకారం

ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ విభాగంలోని డిజిలాకర్‌లో నిరంతరం తాజా ఇంటర్న్‌షిప్‌ అవకాశాల వివరాలు పొందుపరుస్తున్నారు. వీటిని అందుకోవాలంటే.. అభ్యర్థులు డిజిలాకర్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే డిజిలాకర్‌లో అధిక శాతం అవకాశాలు కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ తదితర సాంకేతిక విభాగాల్లోనే ఉంటున్నాయి. అదే విధంగా గ్రామీణ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ వంటి ఇతర శాఖల్లోనూ ఇంటర్న్‌షిప్‌ నియామకాలు జరుగుతుంటాయి. వీటి కోసం ఆయా శాఖల వెబ్‌సైట్స్‌ను పరిశీలిస్తుండాలి.

ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఇలా

ఇంటర్న్‌షిప్‌ అందుకున్న విద్యార్థులు.. తమకు కేటాయించిన విభాగం, విధులకు సంబంధించి టీమ్‌ సభ్యులతో కలిసి పనిచేసేలా చొరవ చూపాలి. అదే విధంగా తమకు కేటాయించిన విధుల విషయంలో ఏదైనా సందేహం తలెత్తితే.. బిడియం లేకుండా టీమ్‌ లీడర్‌ లేదా ఇతర సీనియర్లను సంప్రదించి..సందేహాల్ని నివృత్తి చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ సమయంలో సదరు సంస్థలో ఉద్యోగి మాదిరిగానే అంకితభావంతో కష్టపడి పనిచేస్తే.. ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలు సొంతమవుతాయి. 

అదే సంస్థలో.. కొలువు

ఇంటర్న్‌ ట్రైనీగా చేరిన విద్యార్థులు.. విధుల నిర్వాహణలో చూపే ప్రతిభ, పనితీరు ఆధారంగా పూర్తిస్థాయి కొలువు కూడా సొంతం చేసుకోవచ్చు. ఐఐటీలు, ఐఐఎంల నుంచి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌ ట్రైనీగా ఎంపికైన వారిలో 50 శాతం మేరకు.. ఇలా ఇంటర్న్‌ ట్రైనీ సమయంలో ప్రతిభ చూపి.. అదే సంస్థలో ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ అందుకుంటున్నారు.

ప్రయోజనాలివే

  • ఇంటర్న్‌ ట్రైనీగా ఒక ఇండస్ట్రీలో విధులు నిర్వహించడం ద్వారా కొత్త నైపుణ్యాలు, రియల్‌ టైమ్‌ ఎక్స్‌పోజర్‌ లభిస్తుంది. 
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, నెగోషియేషన్‌ స్కిల్స్, టీం వర్కింగ్‌ కల్చర్, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ వంటివి లభిస్తాయి.
  • టీమ్‌ మెంబర్స్, కార్పొరేట్‌ లీడర్స్‌తో చర్చిస్తూ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. 
  • సదరు రంగంలోని తాజా పరిణామాలపై అవగాహన వస్తుంది. 
  • ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేలా అనలిటికల్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు అలవడుతాయి.

ఏ నేపథ్యమైనా సరే

ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్‌గా ఏ నేపథ్యం ఉన్న విద్యార్థులైనా.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాల అందింపుచ్చుకుంటే భవిష్యత్తులో జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచే ఆస్కారం లభిస్తుంది. అన్ని రంగాల్లోనూ లేటెస్ట్‌ టెక్నాలజీస్‌ అమలవుతున్న తరుణంలో ఇది ఎంతో ఆవశ్యకంగా నిలుస్తోంది. కాబట్టి విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయడానికి కృషి చేయాలి.
–ప్రొ‘‘వి.వర్మ,డీన్‌ ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌

Published date : 30 Jun 2022 05:44PM

Photo Stories