Internships: సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభం.. భారీగా స్టయిపండ్ అందిస్తున్న కంపెనీలు
దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లైనా.. ఇతర బీస్కూల్స్‌లో చేరిన విద్యార్థులైనా.. తొలుత ఎదురు చూసేది ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసమే! వీటిని కెరీర్ అవకాశాల పరంగా తొలి అడుగుగా భావిస్తుంటారు. అందుకే సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎస్‌పీఓ) పేరుతో సంస్థలు అందించే.. ఇంటర్న్‌షిప్స్ కోసం విద్యార్థులు ఎంతో కృషి చేస్తారు. 2021–23 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి దేశంలోని ప్రముఖ ఐఐఎంలు, ఇతర బీస్కూల్స్‌లో సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్‌లో సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ట్రెండ్స్, ముఖ్య రంగాలు, స్టయిపండ్స్ తదితర అంశాలపై విశ్లేషణ...
- ఐఐఎంల్లో మొదలైన ఎస్‌పీఓ ప్రక్రియ
- ఇప్పటికే పలు బీ–స్కూల్స్‌లో ముగింపు
- భారీగా స్టయిపండ్ అందిస్తున్న కంపెనీలు
- గత ఏడాదికంటే పెరిగిన ఆఫర్స్ సంఖ్య
మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు పొందేందుకు ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్‌లో చేరతారు. మొదటి సంవత్సరం పూర్తయ్యాక.. లభించే సెలవు రోజుల్లో ఇంటర్న్ ట్రైనీగా పనిచేసేలా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ఐఐఎంలు, ఇతర బీస్కూల్స్‌లో ఇంటర్న్‌షిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా చేపట్టే ప్రక్రియనే.. సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ అని పిలుస్తారు. ఈ సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో ఎంపికైన విద్యార్థులకు సంస్థలు.. స్టయిపండ్ కూడా అందిస్తాయి. ఇది రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉం టుంది.ప్రస్తుతం ఐఐఎంలు సహా దేశంలోని ప్రముఖ బీస్కూల్స్‌లో ఎస్‌పీఓ ప్రక్రియ కొనసాగుతోంది.
స్టయిపండ్ ఆకర్షణీయం
సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ఆఫర్ పొందిన విద్యార్థులు ఆయా సంస్థల్లో గరిష్టంగా రెండు నెలలు ఇంటర్న్ ట్రైనీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీలు ఈ రెండు నెలల కాలానికి ఈ ఏడాది భారీ మొత్తంలో స్టయిపండ్ ఆఫర్ చేస్తుండటం విశేషం. 2020–22 బ్యాచ్‌తో పోల్చుకుంటే..2021–23 బ్యాచ్ విద్యార్థులకు అంటే ఈ ఏడాది మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్టయిపండ్ దాదాపు 70శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా సంస్థల కార్యకలాపాలు వేగం పుంజుకోవడం, టాలెంట్ అవసరంతోపాటు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలే కారణంగా భావిస్తున్నారు.
కోల్‌కత నుంచి కోజికోడ్ వరకు
- ఐఐఎం కోల్‌కత నుంచి ఐఐఎం కోజికోడ్ వరకు.. ఏ బీస్కూల్‌లో చూసినా.. ఈ సంవత్సరం విద్యార్థులకు భారీ సంఖ్యలో ఆఫర్లు లభించడమే కాకుండా..స్టయిపండ్ కూడా గతం కంటే ఆకర్షణీయంగా ఉంది.
- ఐఐఎం–కోల్‌కతలో మొత్తం 476 మంది విద్యార్థులకు 570 ఆఫర్లు లభించాయి. అంటే..కొంతమందికి డబల్ ఆఫర్లు కూడా అందాయి.మొత్తం 140 సంస్థలు ఈ క్యాంపస్‌లో ఎస్‌పీఓ ప్రక్రియలో పాల్గొని.. ఇంటర్న్‌షిప్ ట్రైనీలను ఎంపిక చేశాయి. ఇలా ఎంపికైన వారికి స్టయిపండ్ నెలకు సగటున రూ.1.4లక్షలుగా నమోదవడం విశేషం.
- ఐఐఎం–లక్నోలో కూడా వంద శాతం ఎస్‌పీఓలు నమోదయ్యాయి. ఈ క్యాంపస్ నుంచి ఎంపికైన వారికి గరిష్టంగా రూ.3.4 లక్షల స్టయిపండ్ లభించింది. సగటు స్టయిపండ్ రూ.1.3 లక్షలుగా ఉంది. ఇది గతేడాది కంటే 18శాతం ఎక్కువ.
- ఐఐఎం కోజికోడ్‌లో.. మొత్తం 559 మంది విద్యార్థులకు ఎస్‌పీఓలు లభించాయి. ఈ క్యాంపస్‌లో సగటు స్టయిపండ్ రూ.2 లక్షలుగా ఉంది. ఇక్కడ గరిష్ట స్టయిపండ్ రూ.3.74 లక్షలుగా నమోదైంది.
- ఐఐఎం–ఇండోర్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రెండేళ్ల పీజీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌తోపాటు ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకంగా అందించే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కూడా ఎస్‌పీఓలు అందుకున్నారు. ఇక్కడ రెండు నెలల వ్యవధికి గరిష్టంగా రూ.4 లక్షలు, సగటున రూ.1.5లక్షల స్టయిపండ్‌ను పలు సంస్థలు ఆఫర్ చేశాయి.
ఇతర బీ స్కూల్స్‌లోనూ
- ఢిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(ఎఫ్‌ఎంఎస్)లోనూ ఎంబీఏ విద్యార్థుల్లో 290 మందికి ఆఫర్లు లభించాయి. ఈ క్యాంపస్‌లో సగటు స్టయిపండ్ రూ.2.62 లక్షలుగా నమోదైంది. ఇది గతేడాది కంటే 9 శాతం అధికం. గరిష్ట స్టయిపండ్ రూ.5 లక్షలుగా ఉండటం విశేషం.
- దేశంలోని మరో ప్రముఖ బీస్కూల్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ–జంషెడ్‌పూర్‌లోనూ వంద శాతం ఇంటర్న్‌షిప్ ఆఫర్లు లభించాయి. ఇక్కడ రెండు నెలల వ్యవధికి గరిష్టంగా రూ.6.8 లక్షలుగా స్టయిపెండ్ నమోదైంది.
- ఎండీఐ–గుర్గావ్‌లో 359 మంది విద్యార్థులకు పలు సంస్థల్లో ఎస్‌పీఓలు లభించగా.. గరిష్ట స్టయిపండ్ రూ.4 లక్షలుగా, సగటు స్టయిపండ్ రూ.2లక్షలుగా ఉంది.
కొనసాగుతున్న ప్రక్రియ
ఐఐఎం–అహ్మదాబాద్, బెంగళూరు తదితర క్యాంపస్‌ల్లో ఈ నెల మూడో వారంలోపు ఎస్‌పీఓ ప్రక్రియ పూర్తవనుంది. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం–ఇతర ఐఐఎంల్లోనూ దాదాపు 100 శాతం ఆఫర్లు అందే అవకాశం ఉందని ఆయా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కన్సల్టింగ్, ఫైనాన్స్‌లదే హవా
ఐఐఎంలు, ఇతర బీస్కూల్స్‌లో.. ఈ ఏడాది సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌లో కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల హవా కనిపించింది. ఇప్పటివరకు లభించిన ఎస్‌పీఓల్లో దాదాపు 40 శాతం మేరకు కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సంస్థల నుంచే ఉన్నాయి. బీసీజీ, బెయిన్ అండ్ కో, యాక్సెంచర్ స్ట్రాటజీ, పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, సినర్జీ కన్సల్టింగ్ సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి.
ఐటీ, ఈ–కామర్స్‌లు
ఇప్పటి వరకు లభించిన ఎస్‌పీఓ ఆఫర్లను పరిశీలిస్తే..కన్సల్టింగ్,ఫైనాన్స్ రంగాల తర్వాత ఐటీ, ఈ–కామర్స్ సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి. ఈ రంగాల్లో డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే విధంగా ఆఫర్లు లభించాయి. అదే విధంగా గూగుల్, ఫేస్‌బుక్ కూడా ఎస్‌పీఓలు ఇవ్వడంలో ముందు నిలిచాయి.
సేల్స్, మార్కెటింగ్ జోరు
సేల్స్, మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లోనూ గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎస్‌పీఓల జోరు కొనసాగింది. ముఖ్యంగా ప్రొడక్ట్ రీసెర్చ్, మార్కెట్ అనాలిసిస్ విభాగాల్లో ఎక్కువ ఆఫర్స్ లభించాయి. జనరల్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ కొనసాగాయి. ఆయా సంస్థలు విద్యార్థుల విశ్లేషణాత్మక దృక్పథం,మార్కెట్ పరిస్థితులపై అవగాహనను పరిశీలించి ఆఫర్స్ ఇస్తున్నట్లు ఐఐఎంల వర్గాలు పేర్కొంటున్నాయి.
టాప్ జాబ్ ప్రొఫైల్స్
- ఈ ఏడాది ఎస్‌పీఓల్లో.. టాప్ జాబ్ ప్రొఫైల్స్‌గా డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, బిజినెస్ స్ట్రాటజీస్ నిలిచాయి.
కొలువు దిశగా
ఇంటర్న్ ట్రైనీగా చక్కటి పనితీరు చూపితే.. ఆయా సంస్థల్లోనే పూర్తిస్థాయి కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు తమ సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శించి.. మెరుగ్గా రాణిస్తే.. కంపెనీలు సదరు అభ్యర్థులకు తమ సంస్థలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆసక్తి ఉందో.. లేదో.. తెలుసుకుంటాయి. ఆసక్తి ఉందని తెలిపిన విద్యార్థులకు ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్ దాదాపు ఖరారైనట్లే! వీరికి ద్వితీయ సంవత్సరం చివర్లో నిర్వహించే ఫైనల్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనకుండానే ఉద్యోగం‡ లభిస్తుంది.
ఫైనల్ ప్లేస్‌మెంట్స్
ఈ సంవత్సరం ఐఐఎంల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ సైతం ఆశాజనకంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా కాలంలో కొంత మందగమనంలో ఉన్న సంస్థలు.. ఇప్పుడు తిరిగి గాడిన పడుతున్నాయని, కార్యకలాపాలు విస్తరించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయని.. ఈ మేరకు అవసరమైన మానవ వనరుల నియామకాలు చేపడుతున్నాయని చెబుతున్నారు.
చదవండి: Trending Jobs: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఐటీ కొలువు!