Skip to main content

AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్‌

AP RGUKT IIIT notification 2022-2023

బీటెక్‌.. లక్షల మంది విద్యార్థుల స్వప్నం! ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ ఎంపీసీలో చేరడం.. ఆ తర్వాత ఎంట్రన్స్‌ టెస్ట్‌ల్లో లక్షల మందితో పోటీపడి ర్యాంకు సాధిస్తేనే సీటు లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి అర్హతతోనే.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా.. నేరుగా బీటెక్‌ చదివేందుకు మార్గం.. ఏపీ ట్రిపుల్‌ ఐటీలు!! ఈ క్యాంపస్‌లలో సీటు సొంతం చేసుకుంటే.. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ లభిస్తుంది. తాజాగా 2022-23 సంవత్సరానికి సంబంధించి ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏపీ ట్రిపుల్‌ ఐటీల ప్రాముఖ్యత, ప్రవేశ విధానం, కోర్సులు, కెరీర్‌ స్కోప్‌పై కథనం...

మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. మానస పుత్రికలుగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లు..ఏపీ ట్రిపుల్‌ ఐటీలు. ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత విద్య, అందులోనూ సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు ఇవి. వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ(ఆర్‌జీయూకేటీ) పేరుతో.. యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఏపీ ట్రిపుల్‌ ఐటీలు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

అర్హతలు

  • 2022లో పదో తరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణత (మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలి) ఉండాలి. ఈ ఏడాదికి సంబంధించి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
  • 85 శాతం సీట్లు లోకల్‌ విద్యార్థుల(ఆంధ్రప్రదేశ్‌)కు కేటాయిస్తారు. మిగతా 15శాతం సీట్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడొచ్చు. 
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 5శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ సీట్లకు గల్ఫ్‌దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలు/ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు/అంతర్జాతీయ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నాలుగు క్యాంపస్‌లు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు క్యాంపస్‌ల ద్వారా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. ఒక్కో క్యాంపస్‌లో వేయి సీట్లు చొప్పున మొత్తం నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్‌ కోటాకు పది శాతం సీట్లు కలపనున్నారు. ప్రస్తుతం ఆర్‌.కె.వ్యాలీ(ఇడుపులపాయ), నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలలో ఈ క్యాంపస్‌లు ఉన్నాయి.

మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో పదో తరగతిలో మెరిట్‌ ఆధారంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా.. నాలుగు మార్కులను డిప్రైవేషన్‌ స్కోర్‌ పేరిట కలుపుతారు. గతేడాది కరోనా పరిస్థితుల కారణంగా ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ ఏడాది.. ఆర్‌జీయూకేటీ విధానాల ప్రకారం-పదో తరగతిలో మెరిట్‌ ఆధారంగానే ఎంపిక చేసే విధానాన్ని అనుసరించనున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి సీట్ల కేటాయింపు చేస్తారు.

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

అప్‌లోడ్‌ చేయాల్సిన డాక్యుమెంట్లు

  • విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • పదో తరగతి హాల్‌టికెట్‌ నెంబర్‌
  • పుట్టిన తేదీ సర్టిఫికెట్‌
  • కుల ద్రువీకరణ పత్రం
  • ఆధార్‌ నెంబర్‌
  • ఎన్‌సీసీ, పీహెచ్, సీఏపీ కేటగిరీ విద్యార్థులు అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలు
  • ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌
  • తెల్ల రేషన్‌ కార్డ్‌/రైస్‌ కార్డ్‌
  • నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్‌
  • లోకల్‌ కేటగిరీ కోరుకుంటున్న అభ్యర్థులు అందుకు సంబంధించి అధికారులు జారీ చేసిన రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌.

పీయూసీ + బీటెక్‌

ఏపీ ట్రిపుల్‌ ఐటీల విద్యా విధానం వినూత్నమని చెప్పొచ్చు. మొత్తం ఆరేళ్ల వ్యవధిగల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో.. తొలి రెండేళ్లను పీయూసీ(ఇంటర్మీడియెట్‌ తత్సమాన) కోర్సుగా పరిగణిస్తారు. ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రామ్‌ బోధన సాగుతుంది. 

వినూత్న సబ్జెక్ట్‌లు

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లోని మొదటి రెండేళ్ల పీయూసీ విధానంలో.. ఎంపీసీ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు, ఐటీ కోర్సులను అందిస్తున్నారు. అంతేకాకుండా బయాలజీ సబ్జెక్ట్‌ను కూడా ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. బయాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

మూడో ఏడాది నుంచి బీటెక్‌

  • మొదటి రెండేళ్ల పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత.. మూడో ఏడాది నుంచి బీటెక్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుంది. బీటెక్‌లో ఏడు బ్రాంచ్‌లను ఎంచుకునే అవకాశం అందుబాటులో ఉంది. అవి.. కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
  • కెమికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు నూజివీడు, ఆర్‌.కె.వ్యాలీ క్యాంపస్‌లలోనే అందుబాటులో ఉన్నాయి.
  • రెండేళ్ల పీయూసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు.. తమ ఆసక్తి, అభిరుచి మేరకు నిర్దిష్ట బ్రాంచ్‌ను ఎంచుకుని బీటెక్‌ ప్రోగ్రామ్‌లో అడుగు పెట్టొచ్చు.

'పీయూసీ'తో ఎగ్జిట్‌ అవకాశం

రెండేళ్ల వ్యవధిలోని పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఎగ్జిట్‌ అవకాశం కూడా ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షల ద్వారా సీటు సొంతం చేసుకున్న వారికి ఈ ఎగ్జిట్‌ సదుపాయం ఉపయుక్తం. ఇలాంటి విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్‌ అందిస్తారు. దాని ఆధారంగా వారు ఉన్నత విద్య కోణంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కళాశాలల్లో చేరే అవకాశం లభిస్తుంది.

నచ్చిన ప్రోగ్రామ్‌

రెండేళ్ల పీయూసీని పూర్తి చేసుకున్న విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్‌లను ప్రాథమ్యాల వారీగా పేర్కొనాలి. ప్రవేశాల కమిటీ ఆ దరఖాస్తులను పరిశీలించి.. పీయూసీ స్థాయిలో పొందిన మార్కులు, బీటెక్‌లో అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుని బ్రాంచ్‌లను కేటాయిస్తుంది.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌

పలు ఎంఎన్‌సీ సంస్థలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లోనూ ఇక్కడి విద్యార్థులు విజయం సాధిస్తున్నారు. ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లోని యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ ఫలితంగా..విద్యార్థులు బీటెక్‌ తర్వాత గేట్, పీజీఈసెట్‌ తదితర ఉన్నత విద్య ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. 

చ‌ద‌వండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

ఇంటర్న్‌షిప్‌ కూడా

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ చదువుతున్న వారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని ఇరిగేషన్, ఆర్‌ అండ్‌ బీ, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ ట్రైనింగ్‌లో చేరొచ్చు. వీటితోపాటు పలు ప్రైవేట్‌ సంస్థల్లోనూ ఇంటర్న్‌షిప్‌ కల్పించేలా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

స్కాలర్‌షిప్‌ సదుపాయం

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం విద్యా దీవెన పథకం ద్వారా ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్‌ 19, 2022
  • స్పెషల్‌ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌: సెప్టెంబర్‌ 27 -సెప్టెంబర్‌ 30
  • ఎంపిక జాబితా వెల్లడి(స్పెషల్‌ కేటగిరీ మినహా): సెప్టెంబర్‌ 29
  • నూజివీడు క్యాంపస్, ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌: అక్టోబర్‌ 12, 13 తేదీల్లో
  • శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు సంబంధించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 14, 15 తేదీల్లో
  • శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి నూజివీడులో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి ఆర్‌కే వ్యాలీ(ఇడుపులపాయ)లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.
  • క్లాసుల ప్రారంభం: అక్టోబర్‌ 17 నుంచి. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.rgukt.in
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌: https://admissions22.rgukt.in/app/apply
Published date : 08 Jan 2024 04:35PM

Photo Stories