What After Inter HEC: హెచ్‌ఈసీ విద్యార్థులకు విభిన్న కోర్సులు, వినూత్న కెరీర్ అవకాశాలు ఇవే..
- హెచ్‌ఈసీతో పలు ఉన్నత విద్య కోర్సులు, ఉద్యోగాలు
- డిగ్రీ స్థాయిలో వినూత్న కాంబినేషన్లలో చేరొచ్చు
- లా, సోషల్ వర్క్, ఫైన్ ఆర్ట్స్ వంటి ట్రెండీ కోర్సులు
- పోటీ పరీక్షల్లోనూ ముందంజలో నిలిచే అవకాశం
హెచ్‌ఈసీ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో ప్రధానంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ)కోర్సు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇటీవల కాలంలో బీఏలోనూ వినూత్న కాంబినేషన్లు ప్రవేశపెడుతున్నారు. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్; హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్ వంటి కాంబినేషన్లు, బీఏ సోషల్ వర్క్ తదితర కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.ఇవి జాబ్ మార్కెట్‌లో అవకాశాలు అందుకునేందుకు దోహదపడుతున్నాయి.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్
హెచ్‌ఈసీ విద్యార్థులు ఉద్యోగ నియామక పరీక్షల్లో ముందుండే అవకాశముంది. ఆయా పోటీ పరీక్షలకు పేర్కొన్న సిలబస్ అంశాలు ఎక్కువగా హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టుల నుంచే ఉంటున్నాయి. దీంతో అకడమిక్ స్థాయిలోనే బ్యాచిలర్ డిగ్రీ(బీఏ)లో ఈ అంశాలను పూర్తి స్థాయిలో చదివిన విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో రాణించే వీలుంటుంది.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
సోషల్ వర్క్
బీఏలో సోషల్ వర్క్ స్పెషలైజేషన్ చేసిన వారిని స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రణాళిక విభాగం, యునెస్కో, యూనిసెఫ్ వంటి సంస్థలు ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్‌గా నియమించుకుంటున్నాయి. సోషల్ వర్క్ స్పెషలైజేషన్‌లో.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై అవగాహన కల్పించే విధంగా కరిక్యులం అమలు చేస్తున్నారు. సామాజిక సమకాలీన అంశాలు, విభిన్న వర్గాలకు అందిస్తున్న పథకాలు, వాటిని సమర్థంగా అమలు చేసే విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. దీంతో సోషల్ వర్క్ సబ్జెక్ట్‌తో బీఏ పూర్తి చేసుకున్న వారికి చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
టీచింగ్ కెరీర్
హెచ్‌ఈసీ పూర్తి చేసుకున్న వారికి అందుబాటులో ఉన్న మరో ఉన్నత విద్య అవకాశం..ఉపాధ్యాయ వృత్తికి మార్గం వేసే డీఈడీ కోర్సు. ఈ కోర్సు ఉత్తీర్ణులకు ప్రభుత్వ రంగంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్‌గా కొలువులు లభిస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేట్ స్కూల్స్‌లో టీచర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. డిగ్రీ తర్వాత బీఈడీ పూర్తి చేసుకుంటే.. స్కూల్ అసిస్టెంట్ కొలువు సొంతం చేసుకునే వీలుంది.
చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
న్యాయ విద్య
హెచ్‌ఈసీ విద్యార్థులకు ఉజ్వల కెరీర్‌ను అందించే మరో చక్కటి కోర్సు.. లా(న్యాయ విద్య). ఇంటర్మీడియెట్ అర్హతతోనే అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక న్యాయవాద వృత్తి లేదా కార్పొరేట్ సంస్థల్లో లీగల్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. బీఏ ఎల్‌ఎల్‌బీలో అడుగు పెట్టాలంటే.. రాష్ట్ర స్థాయిలో లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ర్యాంకు ఆధారంగా.. జాతీయ స్థాయిలో పేరున్న నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసుకుంటే..కార్పొరేట్ కొలువులు స్వాగతం పలకడం ఖాయం.
చదవండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..
డిగ్రీ నుంచే బిజినెస్ నైపుణ్యాలు
హెచ్‌ఈసీ విద్యార్థులకు కార్పొరేట్ కొలువులకు మార్గం వేస్తున్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ) లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(బీబీఎం). ఈ కోర్సులు పూర్తి చేస్తే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు సొంతమవుతాయి. ఉన్నత విద్యకు వెళ్లాలనుకుంటే.. ఐసెట్, క్యాట్, మ్యాట్ వంటి ఎంట్రెన్స్ టెస్టుల్లో ప్రతిభ చూపి..ఐఐఎంలు తదితర టాప్ బీస్కూల్స్ నుంచి మేనేజ్‌మెంట్ పీజీ పట్టా అందుకోవచ్చు.
ఫైన్ ఆర్ట్స్.. కెరీర్ షైన్
హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న వినూత్న కోర్సులు..ఫైన్ ఆర్ట్స్. సృజనాత్మకత, కళాత్మక దృక్పథం ఉంటే..ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో షైనింగ్ కెరీర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, పెయింటింగ్ స్పెషలైజేన్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులు అభ్యసిస్తే కెరీర్ అవకాశాలు గ్యారెంటీ. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు జేఎన్‌ఏఎఫ్‌ఏయూ(హైదరాబాద్), డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(ఆంధ్రప్రదేశ్)లు ప్రధాన గమ్యాలుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు ఇతర యూనివర్సిటీలు కూడా పెయింటింగ్, స్కల్ప్చర్(శిల్పకళ)లలో బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
ఎకనామిక్స్‌తో అవకాశాలు
ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూప్‌లో ఎకనామిక్స్ చదివిన విద్యార్థులు డిగ్రీలోనూ ఈ గ్రూప్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటే.. ఎన్నో అవకాశాలు అందుకోవచ్చు. బీఏలో ఎకనామిక్స్‌ను గ్రూప్ సబ్జెక్ట్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగాలు, అదే విధంగా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగంలో ప్రణాళిక విభాగం, కన్సల్టెన్సీ సంస్థల్లో ఎకనామిక్స్ ఉత్తీర్ణులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ తదితరాలకు ఎకనామిక్స్ కోర్సులను అందించడంలో మంచి పేరుంది.
హాస్పిటాలిటీ కెరీర్స్
హెచ్‌ఈసీ విద్యార్థులు టూరిజం అండ్ హాస్పిటాలిటీ విభాగాల్లో..బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే వీలుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో బీహెచ్‌ఎంలో అడుగుపెడితే చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసం ఎన్‌సీహెచ్‌ఎంసీటీ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఫారెన్ లాంగ్వేజెస్
హెచ్‌ఈసీ విద్యార్థులకు సత్వర ఉపాధికి మార్గం.. ఫారెన్ లాంగ్వేజెస్. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు విదేశీ సంస్థలతో ఒప్పందాల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు విదేశీ సంస్థలతో సంప్రదింపులు నిర్వహించేందుకు సంబంధిత భాష నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా జపనీస్, స్పానిష్, జర్మనీ, చైనీస్, ఫ్రెంచ్ వంటి ఫారెన్ లాంగ్వేజ్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఐటీ, ఫార్మా, టూరిజం, కన్సల్టింగ్ సంస్థల్లో కొలువులు దక్కించుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇఫ్లూ సహా పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఆయా విదేశీ భాషల్లో సర్టిఫికెట్, బ్యాచిలర్, పీజీ స్థాయి వరకు కోర్సులను అందిస్తున్నాయి.
చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
ఉద్యోగావకాశాలు
హెచ్‌ఈసీ అర్హతతోనే ఉద్యోగావకాశాలు కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-సి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
ఎన్‌డీఏతో.. డిగ్రీ+ఉద్యోగం
హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో అద్భుత అవకాశం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుంటే..ఆర్మీలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు అధికారిగా కెరీర్ ప్రారంభించొచ్చు. శిక్షణ సమయంలోనే ఎన్‌డీఏ క్యాడెట్ ట్రైనీలకు అకడమిక్ తరగతులు నిర్వహించి జేఎన్‌యూ నుంచి బీఏ డిగ్రీ కూడా అందిస్తారు. అంటే.. ఎన్‌డీఏలో అడుగుపెడితే ఒకే సమయంలో ఇటు డిగ్రీ సర్టిఫికెట్, అటు ఉద్యోగం రెండూ సొంతమవుతాయి. మరోవైపు హెచ్‌ఈసీతో బీఏలో చేరి.. ఆ తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ)లో ఉత్తీర్ణత ఆధారంగా.. త్రివిధ దళాల్లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, మిలటరీ అకాడమీల్లో అడుగు పెట్టొచ్చు.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
కంప్యూటర్ స్కిల్స్
ప్రస్తుతం అన్ని సంస్థలు ఆన్‌లైన్ లేదా కంప్యూటర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కింది స్థాయిలో రికార్డ్స్ నిర్వహణ నుంచి ఉన్నత స్థాయిలో క్లౌడ్ సర్వీసెస్ వరకూ.. అన్నింటికీ కంప్యూటర్ కీలకంగా మారింది. కాబట్టి హెచ్‌ఈసీ విద్యార్థులు ఎంఎస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ పెంచుకుంటే ప్రైవేట్ రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు.
స్పోకెన్ ఇంగ్లిష్
హెచ్‌ఈసీ విద్యార్థులు జాబ్ మార్కెట్లో ముందంజలో నిలిచేందుకు దోహదం చేసే మరో నైపుణ్యం.. స్పోకెన్ ఇంగ్లిష్. ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడే స్కిల్ ఉంటే.. బీపీఓ, బీపీఎం, ఇతర ఔట్ సోర్సింగ్ విభాగాల్లో సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చు.
ఎస్‌ఈఓ సర్టిఫికేషన్
వందల సంఖ్యలో సంస్థలు, వేల సంఖ్యలో ఉత్పత్తులు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు బెస్ట్ ప్రొడక్ట్స్, వాటి వివరాల కోసం వెబ్‌సైట్స్‌పై ఆధారపడటం సర్వ సాధారణంగా మారింది. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ పరంగా తమ సంస్థ వివరాలు సెర్చ్ ఇంజన్‌లో ముందు వరుసలో కనిపించే విధంగా చేసే నైపుణ్యాలు అందించే కోర్సు.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా కొలువులు దక్కించుకునే వీలుంది.