Skip to main content

Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..

సంప్రదాయ డిగ్రీ కోర్సులు.. బీఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్‌సీలు! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలæడిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యాయి.
3 years degree career opportunities

దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్‌సీ కోర్సుల్లో చేరారు. అధికశాతం మంది బీఏలో చేరగా.. తర్వాత స్థానాల్లో బీఎస్సీ, బీకాం గ్రూప్‌లు నిలిచాయి. ప్రథమ సంవత్సరం తరగతులు మొదలవడంతో విద్యార్థులు కోటి కలలతో కాలేజీల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు భవిష్యత్‌లో ఉజ్వల కెరీర్‌ కోసం ఈ మూడేళ్లు ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..

  • బీఏ, బీఎస్సీ, బీకాం విద్యార్థులకూ ఉన్నత అవకాశాలు
  • మూడేళ్ల వ్యవధిలో నైపుణ్యాల పెంపుతో ఉజ్వల కెరీర్‌
  • గ్రూప్‌ సబ్జెక్ట్స్‌కు సరితూగేలా పలు సర్టిఫికేషన్స్‌

సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు పోటీలో నిలదొక్కుకునేలా ఇప్పటి నుంచే తమను తాము తీర్చిదిద్దుకునే ప్రయత్నం ప్రారంభించాలి. అందుకోసం ఎప్పటికప్పుడు జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. దీంతోపాటు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. 

చ‌ద‌వండి: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

బీఎస్‌సీ.. ప్రాక్టికల్‌గా

ట్రెడిషనల్‌ డిగ్రీ కోర్సుల్లో క్రేజ్‌ ఉన్న గ్రూప్‌..బీఎస్‌సీ(మ్యాథ్స్‌), బీజెడ్‌సీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు గ్రూప్‌ల విద్యార్థులకు బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతోనే ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కెమికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌కు సంబంధించి ప్రాక్టికల్‌ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే..ఫార్మాసుటికల్‌ సంస్థలు, ఇతర తయారీ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు (కెమిస్ట్, ల్యాబ్‌ అసిస్టెంట్, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితర) లభిస్తాయి. బీజెడ్‌సీలో కొత్త కాంబినేషన్లు(మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ జెనెటిక్స్‌ తదితర) అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించి కూడా ప్రాక్టికల్‌ అప్రోచ్‌ను అనుసరిస్తే.. హెల్త్‌కేర్, బయో టెక్నాలజీ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. 

బీకాంతో అకౌంటింగ్, ఈఆర్‌పీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌(బీకామ్‌) గ్రూప్‌లోనూ పలు కొత్త కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటికి తగినట్లుగా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. డిగ్రీ పూర్తయ్యాక సంస్థల్లో అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీకాం విద్యార్థులు ట్యాలీ,వింగ్స్, ఫోకస్‌ వంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్స్,అదే విధంగా ఈఆర్‌పీ సొల్యూషన్స్‌గా పేర్కొనే శాప్‌ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే.. బీకామ్‌తోనే ఐటీ రంగంలో కొలువు దక్కించుకోవచ్చు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

బీఏ.. పోటీ పరీక్షల్లో రాణింపు

బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(బీఏ) ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ గ్రూప్‌ చదివిన వారు పోటీ పరీక్షల్లో ముందంజలో ఉంటారనే అభిప్రాయం ఉంది. కారణం.. సదరు పోటీ పరీక్షల్లో ఉండే సిలబస్‌ అధిక శాతం బీఏ సిలబస్‌కు సరితూగేలా ఉండడమే. బీఏ విద్యార్థులు కేవలం సిలబస్‌ అధ్యయనానికే పరిమితం కాకుండా.. సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలుస్తారు. బీఏ విద్యార్థులు నేటి పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్, కంప్యూటర్‌ బేసిక్స్, ఇంటర్నెట్‌ టూల్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా బీఏతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కోరుకునే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది.

చ‌ద‌వండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్‌! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..

ఇంగ్లిష్‌ నైపుణ్యాలు

డిగ్రీతోనే బహుళజాతి సంస్థల్లో కొలువు కోరుకుంటే.. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ కీలకం. కాబట్టి డిగ్రీ కోర్సుల విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు మొదటి సంవత్సరం నుంచే ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌పై దృష్టిపెట్టాలి. దీంతోపాటు ప్రస్తుతం డిమాండ్‌ నెలకొన్న జర్మన్, ఫ్రెంచ్, జపనీస్‌ తదితర ఫారిన్‌ లాంగ్వేజ్‌ల్లో ఏదో ఒక విదేశీ భాష నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఫలితంగా మూడేళ్ల కోర్సు పూర్తయ్యేనాటికి వివిధ ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం

ఈ–కామర్స్, ఇతర ఆన్‌లైన్‌ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే విభాగాలు.. ఎస్‌ఈఓ(సెర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌),ఎస్‌ఈఎం(సెర్చ్‌ ఇంజన్‌ మేనేజ్‌మెంట్‌). సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు వినియోగదారులకు కనిపించేలా.. సెర్చ్‌ ఇంజన్‌ వెబ్‌సైట్స్‌లో ముందు వరుసలో ఉంచాలని యోచిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ నెలకొంది. దీనికి సంబంధించి పలు సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రైటింగ్‌ స్కిల్స్, సోషల్‌ మీడియా నాలెడ్జ్,ట్రాన్స్‌లేషన్‌ స్కిల్స్‌ ఉంటే.. ఎనీ డిగ్రీతో టెక్‌ సంస్థల్లో చేరిపోవచ్చు.

చ‌ద‌వండి: Engineering Students: బీటెక్‌ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..

ఉన్నత విద్య లక్ష్యమైతే

  • ఉన్నత విద్య లక్ష్యంగా పెట్టుకున్న డిగ్రీ కోర్సుల విద్యార్థులు ముందు నుంచే స్పష్టతతో మెలగాలి. తమ కోర్సులకు తగ్గ అవకాశాలు అన్వేషించాలి. బీఏ విద్యార్థులకు పీజీ స్థాయిలో పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. సోషల్‌ వర్క్, సోషల్‌ సైన్స్, ఫారెన్‌ లాంగ్వేజెస్‌లు వీటిలో ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌ వంటి పీజీ కోర్సులను అభ్యసించడం ద్వారా.. భవిష్యత్తులో పురాతత్వ శాఖల్లో, టూరిజం సంస్థల్లో, మీడియా రంగంలో కొలువుదీరే అవకాశముంది. 
  • బీఎస్‌సీ(మ్యాథమెటిక్స్‌) విద్యార్థులకు పీజీ స్థాయిలో.. స్టాటిస్టిక్స్, ఎంసీఏ, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్, అప్లైడ్‌ సైన్సెస్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అభ్యసిస్తే భవిష్యత్తులో రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌గా ప్రముఖ పరిశోధన ల్యాబ్స్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ నెలకొన్న బిగ్‌డేటా అనలిటిక్స్‌ కోర్సులకు కూడా వీరు సరితూగుతారు. వీటిని పూర్తి చేసుకుంటే..ఎంఎన్‌సీల్లో కొలువులు లభిస్తాయి. అదే విధంగా ఐఐటీల్లోనూ ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌తో కార్పొరేట్‌ కొలువు దక్కించుకోవచ్చు.

బీజెడ్‌సీ.. ఉన్నత విద్య

బీజెడ్‌సీ విద్యార్థులకు నైపర్, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్‌సీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో పలు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు కూడా అభ్యసించే అవకాశం ఉంది. వీటి ద్వారా భవిష్యత్తులో రీసెర్చ్‌ లేబొరేటరీస్‌లో రీసెర్చ్‌ అసోసియేట్స్‌గా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ప్రైవేటు విభాగంలో ఫార్మసీ సంస్థలు, క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థల్లో కొలువులు లభిస్తున్నాయి.

చ‌ద‌వండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..

కార్పొరేట్‌ జాబ్స్‌

డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్‌ పీజీల్లో చేరే వీలుంది.  వీటిల్లో ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ (లా) వంటివి ప్రధానంగా నిలుస్తున్నాయని చెప్చొచ్చు. వీటి ద్వారా భవిష్యత్తులో కార్పొరేట్‌ సంస్థల్లో కొలువులు దక్కించుకోవచ్చు.  ముఖ్యంగా కార్పొరేట్‌ కంపెనీల్లో నిర్వహణ విభాగాలు, ఎల్‌పీఓ, కేపీఓ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అదే విధంగా బీఈడీ వంటి కోర్సులు అభ్యసించడం ద్వారా టీచింగ్‌ వృత్తిలో స్థిరపడొచ్చు.

చ‌ద‌వండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

సర్కారీ కొలువు

అత్యున్నత స్థాయి సర్వీసులుగా భావించే సివిల్స్‌ నుంచి రాష్ట్ర స్థాయిలో గ్రూప్‌–1, 2,3,4 వరకూ.. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. వీటిని లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు.. డిగ్రీలో చేరిన తొలిరోజు నుంచే కసరత్తు ప్రారంభించాలి. సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వీటికి సంబంధించి కోర్‌ సబ్జెక్ట్‌ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకోవాలి. అలాగే సీడీఎస్‌ వంటి పరీక్షల్లో విజయం ద్వారా త్రివిధ దళాల్లో కెరీర్‌ ఖాయమవుతుంది. ఐబీపీఎస్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే నియామక పరీక్షల్లో విజయం ద్వారా.. బ్యాంకులు, కేంద్ర ప్రభు త్వ శాఖల్లో కొలువులు దక్కించుకోవచ్చు.

డిగ్రీ ఏదైనా.. ఇవి ప్రధానం

డిగ్రీ ఏదైనా భవిష్యత్తులో ఉద్యోగం, ఉన్నత విద్య రెండు కోణాల్లోనూ కొన్ని లక్షణాలు తప్పనిసరిగా మారుతున్నాయి. అవి.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; అనలిటికల్‌ స్కిల్స్‌; ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు; భావోద్వేగ నియంత్రణ; క్రిటికల్‌ థింకింగ్‌; అడాప్టబిలిటీ. ముఖ్యంగా ప్రస్తుతం ప్రైవేటు సంస్థల్లో కొలువుల్లో రాణించాలంటే.. ఈ లక్షణాలు తప్పనిసరి. అప్పుడే డిగ్రీ ఏదైనా, దానికి తగిన హోదాల్లో కొలువుదీరే అవకాశం లభిస్తుంది. ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులతో సరిసమానంగా రాణించే ఆస్కారం కలుగుతుంది.

చ‌ద‌వండి: Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

డిగ్రీలో రాణింపు.. ముఖ్యాంశాలు

  • ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో అధ్యయనం సాగించాలి. 
  • సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • కోర్సుకు సరితూగే సాఫ్ట్‌వేర్‌ కోర్సుల అభ్యసనం మేలు. 
  • రెండో ఏడాది నుంచే ఉన్నత విద్య లక్ష్యం దిశగా అడుగులు.
  • భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత.. దానికి అనుగుణంగా నైపుణ్యార్జన.
  • పీజీ స్పెషలైజేషన్స్‌తో మరింత మెరుగైన అవకాశాలు.
  • కార్పొరేట్‌ సంస్థల్లో సైతం మారుతున్న దృక్పథం.
Published date : 08 Dec 2022 05:16PM

Photo Stories