10th Class Student Hemasree Success Story : వెరీగుడ్..హేమశ్రీ.. సర్కారీ స్కూల్‌లో చదువు..టెన్త్‌లో 594/600 మార్కులు.. ఎలా వచ్చాయంటే..?
ఆ సంపాదన మా చదువులకు సరిపోదని..
మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సం పాదన మా చదువులకు సరిపోదని విశాఖ వచ్చి పూర్ణామార్కెట్‌లో కలాసీగా పనిచేస్తున్నారు. నాకు మంచి మార్కులు వస్తున్నాయని, బాగా చదివించమని మా ఉపాధ్యాయులు చెప్పడంతో నాన్న ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. చాలీచాలని సంపాదనతో ఎలా చదివించాలన్నదే ఆయన ఆందోళన.
అలాంటి సమయంలో నేను 8వ తరగతిలో ఉండగా మొదటిసారి అమ్మ ఒడి అందింది. వరుసగా మూడేళ్లు ఆ పథకం వల్ల లబ్ధిపొందడం వల్ల నా చదువు ఎలాంటి భారం లేకుండా సునాయాసంగా సాగిపోయింది. మా పాఠశాల ఉ పాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధతో నన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు.
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా..
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థిని కామిరెడ్డి హేమశ్రీ.
☛➤ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..
అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుల సరస్వతిగా నిలిచింది. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన టెన్త్ టాపర్లు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పుట్టుకొచ్చారు. అలాంటి టాపర్లలో ఈమె ఒకరు.
కలాసీగా రాత్రీపగలూ..
అమ్మ గోవిందమ్మ, మా నాన్న శ్రీనివాసరావు. నాన్న పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్. ప్రస్తుతం విశాఖలోని పూర్ణా మార్కెట్లో కలాసీ. ఓ రకంగా నాన్నే నా విజయానికి స్ఫూర్తి. తను బాగా చదవలేకపోవడం వల్లే టెన్త్ ఫెయిలయ్యారు. కలాసీగా రాత్రీపగలూ కష్టపడుతున్నారు. అదే మాకు పదేపదే చెప్పేవారు. తానెన్ని కష్టాలుపడ్డా.. అదంతా నా కోసం, నా తమ్ముడి కోసమేనని గుర్తు చేసేవారు.
మా చదువులకు డబ్బులు అవసరమవుతాయనే ఆరేళ్ల క్రితం దేవరాపల్లి నుంచి విశాఖ వచ్చేశారు. నాన్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప వేరే ధ్యాసలేకపోయింది. అదే నన్ను పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులతో టాపర్‌గా నిలిపింది.
చదువంతా సర్కారీ స్కూల్లోనే..
ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ మా స్వగ్రామం దేవరాపల్లి మండలం కొత్తపెంటలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలో 92 మార్కులు సాధించా. దీంతో అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (గరల్స్)లో సీటు వచ్చింది. నా జీవితంలో నేను సాధించిన తొలి విజయమది.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఐదోతరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే. అమ్మానాన్నల కష్టం తెలియడంతో వారికి ఏ రోజూ నా చదువు భారం కాకూడదనుకున్నాను. ఎంత బాగా చదివితే.. నా చదువుకు అంత తక్కువ ఖర్చవుతుందని తెలుసుకున్నాను. దీనికి నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత తెలియడం ఒక కారణమైతే, మా స్కూల్ టీచర్లు మరో కారణం. ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు అంతా దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అందుకే మా టీచర్లు చదువు విలువ తెలిసేలా, పరీక్షల భయం పోయేలా నిత్యం మమ్మల్ని ప్రోత్సహించారు.
☛ SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..
కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు..
సాధారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లు మిగిలిన ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి. అయితే నా వ్యక్తిగత అవసరాలకు మొదటి మూడేళ్లు ఇంటి నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చేదాన్ని గత మూడేళ్లుగా పరిస్థితి చాలా మారింది. వసతులు మరింత మెరుగయ్యాయి. పర్యవేక్షణ పెరిగింది. పుస్తకాలు, యూనిఫాం, షూస్.. ఇలాంటి వాటి కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగే అవసరం లేకుండా పోయింది. మూడుసార్లు అమ్మ ఒడి అందుకున్నా. సీఎం జగన్ మామయ్య ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి.
☛ 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం
నా లక్ష్యం ఇదే..
ఇంజినీర్ కావాలన్నది నా కల. అందుకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టే స్థోమత నా కుటుంబానికి లేదు. బాగా చదవడమే ఖర్చులేని దారని నాకు తెలుసు. అందుకే టీచర్లు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకునేదాన్ని. అర్థంకాని విషయాల్ని ఎప్పుడు అడిగినా, టీచర్లు ఓపిగ్గా విడమరిచి చెప్పేవారు.
నా తమ్ముడు సందీప్ ప్రస్తుతం 7వ తరగతి పూర్తి చేసుకున్నాడు. మా అమ్మానాన్నలకు మేం భరోసాగా నిలవాలన్నదే నా కోరిక. దాన్ని నెరవేర్చేందుకు చదువు తప్ప, నాకు వేరే మార్గం తెలియదు. ఇంజినీర్‌గా స్థిరపడి నాలాంటి వారికి ఆసరాగా నిలవగలిగితే చాలు. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని నలుగురూ చెప్పుకుంటే.. మా నాన్న కళ్లలో కనిపించే ఆనందాన్ని చూడాలి.. అంతే..!
☛ Tenth Class Students Success Stories : నిరుపేద కుటుంబం.. తండ్రి మరణంతో.. జీవనోపాధి కోసం..
నా తండ్రి టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు..
శ్రీకాకుళం జిల్లా (ఆంధ్రప్రదేశ్) పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన మిట్టు మహా పాత్రో 600కు 594 మార్కులు సాధించాడు. పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారిలో వీరి ఇల్లు. మహా పాత్రో తండ్రి దుర్గాప్రసాద్ మహా పాత్రో ద్విచక్రవాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు. తల్లి మమత మహా పాత్రో గృహిణి. మిట్టు పాఠశాల సెలవుల్లోను, ఇంటి వద్ద ఉన్నప్పుడు సైకిల్‌కు, బైక్‌లకు పంక్చర్లు వేయడంలో తండ్రికి సహాయం చేస్తుండేవాడు.
ఒడియా బ్రహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబం వీరిది. మిట్టుకు పదో తరగతిలోఅత్యధిక మార్కులు రావడంతో ఆ కుటుంబంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాతపట్నంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అత్యధిక మార్కులు మాత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మిట్టు సాధించాడు. తన కుమారుడికి పదో తరగతిలో జిల్లా మొదటి స్థానం రావడంతో ఆనందంగా ఉందని తండ్రి దుర్గా ప్రసాద్ తెలి పారు. మిట్టు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ప్రాథమిక ఒడియా పాఠశాలలో చదివాడు.