ఉపాధ్యాయుల్లో ‘PTM’ గుబులు
ఎక్కడా ఏలోటూ రాకుండా నూరు శాతం తల్లిదండ్రుల హాజరు ఉండాలని ఒక పక్క.. స్థానిక రాజకీయ నాయకులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్న ఆదేశాలు మరోపక్క టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నో పేరెంట్స్–టీచర్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం అంటే భయపడే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఒత్తిడి, అధికారుల రోజువారీ సమావేశాలు, ఆదేశాలతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మరోపక్క ఈ నెల 9 నుంచి విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–1) ఉండగా.. పీటీఎం పనుల్లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పటివరకు సిలబస్ పూర్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఫలితాలు తగ్గితే తమపై చర్యలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతనెల 14న మెగా పీటీఎం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: Department of Health: డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్య విధాన పరిషత్
రాష్ట్రంలోని 45,099 ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు గొప్పగా నిర్వహించాలని, నిర్వహణకు టీచర్లు, తల్లిదండ్రులతో కమిటీలు వేయాలని సూచించింది. ఈ సమావేశాలపై ఉపాధ్యాయులకు ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఇతర ఉన్నతాధికారుల రివ్యూలతో క్షణం తీరికలేకపోవడంతో రెండు వారాలుగా బడుల్లో బోధన అటకెక్కింది.
టార్గెట్లతో ఉక్కిరిబిక్కిరి
ప్రతి స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 100 శాతం హాజరయ్యేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టారు. అంతేగాక సమావేశాల నిర్వహణకు ప్రతి స్కూల్లో ఆహ్వా న కమిటీ నుంచి మీడియా కవరేజీ కమిటీ వరకు 13 కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉండాలని సూచించారు. స్కూళ్లను సుందరంగా అలంకరించి తోరణాలు కట్టాలని, వచ్చే వారికి పూలతో ఆహ్వానం పలకాలనే నిబంధన విధించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ ఆడించి బహుమతులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు ఇప్పటివరకు జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు ఇచ్చి, ఆయా సబ్జెక్టుల టీచర్లు వారికి విడిగా విద్యార్థుల ప్రగతిని వివరించాల్సి ఉంది. దీంతోపాటు మండలానికి 5 స్కూళ్లలో విద్యార్థుల హెల్త్ కార్డులను సైతం పంపిణీ చేయాలి.
తర్వాత అందరు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, స్థానిక నాయకులతో బడిలో తీసుకోవాల్సిన మార్పులపై ప్రసంగాలు చేయాలి. అయితే, స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరినే ఆహ్వా నించాలని ఆదేశించడంతో ఎవరిని పిలవాలో తెలియక ఉపాధ్యాయులు మథనపడుతున్నారు.
ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోతే తమపై ఎలాంటి ఫిర్యాదులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రస్తుత వ్యవసాయ పనుల సమయంలో సమావేశానికి పిలిచినా తల్లిదండ్రులు వచ్చే అవకాశం లేదని.. మరి నూరు శాతం హాజరు ఎలా చూపాలని వాపోతున్నారు.
విందుపై వెనక్కి తగ్గిన సర్కారు
మెగా పీటీఎం నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి రూ.9.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బడిలో 10 మంది విద్యార్థులుంటే రూ.1,000, 25 మంది ఉంటే రూ.1,200, 2 వేల మంది ఉంటే రూ.13 వేలు, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.14 వేల చొప్పున బడ్జెట్ కేటాయించింది. ఈ మొత్తం నిధులతోనే షామియానా, మైక్‌సెట్లు, అలంకరణ, బొకేలు తదితర సామగ్రి సమకూర్చాలి.
ఈ డబ్బుతోనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. దీంతోపాటు మధ్యాహ్నం పిల్లలతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు విందు భోజనం పెట్టాలని, నిధులను ఉపాధ్యాయులు స్థానికంగా దాతల నుంచి చందాలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ మూలకూ సరిపోని అరకొర బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించడం కష్టమని, భోజనం ఏర్పాట్లు తమవల్ల కాదని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో విందును మద్యాహ్న భోజనం నుంచి ఏర్పాటు చేస్తామని అధికారులు తాజాగా హామీ ఇచ్చారు.
బోధన పక్కనపెట్టి అపార్ నమోదులో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం ఏర్పాట్లపై ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్సులతో బిజీగా మారారు. పీటీఎం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఏర్పాట్లపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించాలి. కూటమి సర్కారు గొప్ప కోసం చేపట్టిన మెగా పీటీఎం ఇప్పుడు విద్యార్థుల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఎన్నికల కోడ్ ఉన్నా ‘పీటీఎం’ హడావుడి
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంతోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల వేడుకకు ఆ జిల్లాల టీచర్లను ఆహ్వానించకపోగా అవార్డులను సైతం ప్రదానం చేయలేదు. అలాంటిది రాజకీయ రంగు పులుముకున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఈనెల 7న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎలా నిర్వహిస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పైగా ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సైతం పాల్గొంటారు. టీచర్లకు అవార్డులు ప్రదానం చేసేందుకు అడ్డొచి్చన కోడ్ ఈ సమావేశాలకు వర్తించదా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.