TREI-RB: గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
కీలకమైన చైర్మన్, కన్వీనర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వీనర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వీనర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వీనర్ సీటు ఖాళీ అయ్యింది.
ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వీనర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వీనర్ నియామకం అనివార్యం కానుంది.
బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు.
గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వీనర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వీనర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు.
ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్
ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వీనర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు.
ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వీనర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియార్టీ, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వీనర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.