Telangana: సృజనాత్మకతకు పదును పెట్టేలా.. సైన్స్‌ఫేర్‌

ఖమ్మం సహకారనగర్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడం.. శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే జిల్లా స్థాయి జవహర్‌లాల్‌ నెహ్రూ గణిత, సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జిబిషన్‌(సైన్స్‌ ఫేర్‌)కు ఏర్పాట్లు మొదలయ్యాయి.

2023–24వ విద్యాసంవత్సరానికి ఈ సైన్స్‌ఫేర్‌ను నెలాఖరులో నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 752 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా 68,121మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

వీరిలో ఎక్కువ మంది ఎగ్జిబిట్లు రూపొందించేలా ఇప్పటి నుంచే హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తుండగా, త్వరలోనే తేదీ, వేదిక ఖరారు కానుంది.

చదవండి: రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

సృజనాత్మకతకు పదును పెట్టేలా..

విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదునుపెట్టడం, విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సైన్స్‌ఫేర్‌ నిర్వహిస్తుండగా.. ఆవి ష్కరణలు కొత్తగా ఉండేలా చేయాలని సూచిస్తున్నారు.

అప్పుడే ఆవిష్కరణకు గుర్తింపు లభిస్తుందనేది విద్యాశాఖ భావన. పాఠ్యాంశాల్లోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ఎగ్జిబిట్లు రూపొందించేందుకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

చదవండి: National Children's Science Congress 2023: పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించాలి

అంశాలివే...

సమాజానికి శాస్త్ర, సాంకేతిక రంగాల ఆవశ్యకత (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ సొసైటీ) అనేది ఈ ఏడా ది ప్రధాన అంశంగా నిర్ణయించారు. ఉప అంశాలుగా హెల్త్‌, లైఫ్‌(లైఫ్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌), అగ్రికల్చర్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, కాంపిటేషనల్‌ థింకింగ్‌ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎగ్జిబిట్లు రూపొందించడమే కాక మిల్లెట్స్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ సస్టయినబుల్‌ ప్లానెట్‌ అంశంపై ప్రతిపాదనలతో హాజరుకావాల్సి ఉంటుంది.

విద్యార్థులను ప్రోత్సహించేలా

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు సైన్స్‌ఫేర్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించాలని డీఈఓ ఈ.సోమశేఖరశర్మ, జిల్లా సైన్స్‌ అధికారి జగదీష్‌ ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలను ఎంఈఓలు, హెచ్‌ఎంలకు జారీ చేశారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కాగా, ఈ సారి జాతీయ స్థాయి(సౌత్‌ ఇండియా) సైన్స్‌ఫేర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనవరిలో జరగనుంది.

#Tags