Civil Judge Posts: జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.
వర్టికల్ రిజర్వేషన్ విధానంతో అయోమయం
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది.