Indian Nursing Council: ఈ కోర్సుకు నర్సింగ్‌ కౌన్సిల్‌ శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: ఆయుర్వేద చికిత్సలో భాగంగా ఆయుర్వేద నర్సింగ్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా కింద ప్రవేశపెట్టాలని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది.
ఈ కోర్సుకు నర్సింగ్‌ కౌన్సిల్‌ శ్రీకారం

ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ ఆరోగ్య సమస్యల కోసం ఆయుర్వేద చికిత్సను కోరుకునే రోగులకు సమర్థవంతమైన సంరక్షణను అందించగల స్పెషలిస్ట్‌ నర్సులను సిద్ధం చేయడం ఈ ఆయుర్వేద నర్సింగ్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ లక్ష్యం. ఆయుర్వేదం ప్రకారం నర్సింగ్‌ సేవలనేవి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రధాన స్తంభాల్లో కీలకమైనవి. పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఆయుర్వేద స్పెషాలిటీ నర్సింగ్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ అనేది ఏడాది కోర్సు. బీఎస్సీ లేదా జీఎన్‌ఎం నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. థియరీ 20 శాతం, ప్రాక్టికల్‌ (క్లినికల్, ల్యాబ్‌) 80 శాతం ఉంటుంది. 

చదవండి: Central Government: స్టాఫ్‌ నర్స్‌.. ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌
 
రోగులకు నాణ్యమైన సంరక్షణ అందంచడానికే..: ఆయుర్వేద ఆసుపత్రుల్లో చేరిన వివిధ రోగులకు నాణ్యమైన సంరక్షణను అందించడానికి అనువైన నైపుణ్యం అందజేయడానికి వీలుగా నర్సులను సిద్ధం చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించారు. సాంకేతికంగా అర్హత కలిగిన, శిక్షణ పొందిన స్పెషలిస్ట్‌ నర్సులను సిద్ధం చేయడం దీని లక్ష్యమని నర్సింగ్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. ఆయుర్వేదంలో ఉండే వివిధ చికిత్సలు, చికిత్సా విధానాలను రోగులకు నర్సులు వివరించాలి.

చదవండి: INC: న‌ర్సుల‌ సంఖ్యలో మన స్థానం ఏంత?.. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నివేదిక వెల్లడి..

జీవనశైలిలో మార్పు వంటి వివిధ పద్ధతుల ద్వారా రోగుల్లో వ్యాధిని నయం చేయగలగాలి. ఆహార వినియోగం, యోగా పద్ధతులను చెప్పగలగాలి. అలాగే ఆయుర్వేద ఔషధాల సేకరణ, నిల్వ, నిర్వహణలపై వీరు అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. కాగా కనీసం 100 పడకలు కలిగి ఉన్న ఆయుర్వేద ఆసుపత్రి (గ్రాడ్యుయేట్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌)లో ఈ కోర్సుకు అనుమతిస్తారు. అన్ని రకాల ప్రత్యేక నర్సింగ్‌ కేర్‌ సదుపాయాలతో రోగనిర్ధారణ, చికిత్స, అత్యాధునిక ఆయుర్వేద థెరపీ యూనిట్లు ఇతర వసతులు ఉండాలి. అర్హతలు కలిగిన సంస్థలు ఆయుర్వేద స్పెషాలిటీ నర్సింగ్‌లో పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా కోసం అనుమతి తీసుకోవాలి.  

చదవండి: Jobs: న‌ర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

#Tags