Skip to main content

INC: న‌ర్సుల‌ సంఖ్యలో మన స్థానం ఏంత?.. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నివేదిక వెల్లడి..

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించడంలో, వైద్య సంబంధిత విధుల్లో నర్సులు, ఏఎన్‌ఎంలది కీలకపాత్ర.
INC
న‌ర్సుల‌ సంఖ్యలో మన స్థానం ఏంత?.. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నివేదిక వెల్లడి..

ఇలాంటి నర్సులు, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంల సంఖ్యలో.. సంబంధిత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ తమ వార్షిక నివేదిక–2021–22ను విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్‌ ఏఎన్‌ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా 1.39 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్‌ 1.10 లక్షల మందితో రెండో స్థానంలో ఉంది. ఇక 10,219 మందితో తెలంగాణ 19వ స్థానంలో ఉంది. రిజిస్టర్డ్‌ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నా రు. అత్యధికంగా 3.32 లక్షల మందితో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానం (3.15 లక్షల మంది)లో, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానం ( 2.62 లక్షల మంది)లో ఉన్నాయి. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో నిలిచింది.  

చదవండి: స్టాఫ్‌నర్స్‌ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌

నర్సింగ్‌ సీట్లలో కర్ణాటక నం.1 

2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల సంఖ్యలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 19,860 సీట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 8,030 బీఎస్సీ సీట్లతో ఐదో స్థానంలో ఉండగా, తెలంగాణ 4,980 సీట్లతో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఎంఎస్సీ నర్సింగ్‌లో తెలంగాణ 493 సీట్లతో దేశంలో పదో స్థానంలో ఉండగా, ఏపీ ఏడో స్థానంలో ఉంది. 3,360 సీట్లతో కర్ణాటక ఎంఎస్సీ నర్సింగ్‌లోనూ మొదటి స్థానంలో నిలిచింది.  

చదవండి: 5,204 Jobs: స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. ఇన్ని వేల దరఖాస్తులు..

కొత్త కోర్సులు..సెమిస్టర్‌ విధానం.. 

నర్సింగ్‌ విద్యలో కౌన్సిల్‌ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునీకరణల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ విద్యలో ఇప్పుడు సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు డాక్టర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్‌ కోర్సులను తీసుకొచ్చింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్‌ కోర్సులు ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేషన్‌ కోర్సులో పేషెంట్‌ సెంటర్డ్‌ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాలి.

చదవండి: నర్సరీ ఏర్పాటుకు సర్టిఫికెట్‌ కోర్సు.. అర్హుత‌లు ఇవే..

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి  

నర్సింగ్‌ కౌన్సిల్‌ కొన్ని సూచనలు కూడా చేసింది. ‘హెల్త్‌ కేర్‌ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. స్కిల్‌ ల్యాబ్, క్లినికల్‌ లెర్నింగ్‌ పద్ధతులపై దృష్టి సారించాలి..’అని సూచించింది.  

చదవండి: ఉచిత నర్సింగ్ శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

ఏఎన్‌ఎం సీట్లలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌.. 

ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) సీట్లలో తెలంగాణ దేశంలో 17వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 455 ఏఎన్‌ఎం సీట్లు ఉన్నాయి. అత్యధికంగా 12,015 సీట్లతో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 910 సీట్లతో 12వ స్థానంలో నిలిచింది. జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఏఎన్‌ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్‌ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 520 ఉన్నాయి. 

Published date : 29 Apr 2023 03:34PM

Photo Stories