Skip to main content

Freelance Jobs: ఆఫీసుకు వెళ్లే అవసరం అస్సలు ఉండదు.. నచ్చిన సమయంలో..

Details: Latest trends in freelancing, the top sectors and the skills required
Details: Latest trends in freelancing, the top sectors and the skills required

ఫ్రీలాన్సింగ్‌.. ఆఫీసుకు వెళ్లకుండానే నచ్చిన సమయంలో..ఆసక్తి, అర్హతలకు తగ్గ పనిచేస్తూ.. ఆదాయం ఆర్జించడానికి ఓ ప్రధాన మార్గం! ముఖ్యంగా.. పనివేళల పట్టింపు ఉండదు. ఆఫీసుకు వెళ్లే అవసరం అస్సలు ఉండదు. ఇచ్చిన టాస్క్‌ లేదా ప్రాజెక్ట్‌ను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేస్తే చాలు!! పనికి తగ్గ వేతనం అందుకోవచ్చు. అందుకే యువత ముఖ్యంగా మిలీనియల్స్‌ ఫ్రీలాన్సింగ్‌కు ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో డిజిటలైజేషన్‌ ఊపందుకున్న తరుణంలో.. గిగ్‌ వర్కింగ్, ఫ్లెక్సి వర్కింగ్‌ పేరుతో.. ఫ్రీలాన్స్‌ అవకాశాలు పెరుగుతున్నాయి. ఐటీ మొదలు కాపీ రైటింగ్‌ వరకు.. అనేక రంగాల్లో ఫ్రీలాన్స్‌ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నట్లు తాజా నివేదికల అంచనా!! ఈ నేపథ్యంలో.. ఫ్రీలాన్సింగ్‌ తాజా ట్రెండ్స్, టాప్‌ సెక్టార్స్‌గా నిలుస్తున్న రంగాలు, అవసరమవుతున్న నైపుణ్యాల గురించి తెలుసుకుందాం...

  • ఫ్రీలాన్స్‌ వర్క్‌కు పెరుగుతున్న డిమాండ్‌
  • ఐటీ టు మీడియా.. పలు రంగాల్లో ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలు
  • భవిష్యత్తులోనూ ఈ ధోరణి కొనసాగుతుందంటున్న నిపుణులు

కోవిడ్‌ మహమ్మారి జాబ్‌ మార్కెట్‌ నియామకాల దృక్కోణాన్నే మార్చేసింది. ప్రధానంగా ఫ్రీలాన్సింగ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పుడు అనేక కంపెనీలు ఫ్రీలాన్స్‌ విధానంలో ఆయా విభాగాల్లో నియామకాలు జరుపుతున్నాయి. దీనివల్ల అటు కంపెనీలు, ఇటు ఉద్యోగార్థులు.. రెండు వర్గాలూ ప్రయోజనం పొందుతున్నాయి అంటున్నారు నిపుణులు. ఫ్రీలాన్స్‌ నియామకాల్లో.. ప్రస్తుతం భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్, పీడబ్ల్యూసీ తదితర సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఫ్రీలాన్సింగ్‌ అంటే
నిర్దిష్ట పనివేళలు, ఆఫీసుకు వెళ్లాలనే నిబంధనలు వంటివి లేకుండా.. తమకు నచ్చిన సమయంలో మెచ్చిన చోటు నుంచి పనిచే సి ఆదాయం పొందడమే.. ఫ్రీలాన్సింగ్‌. 
గతంలో ఫ్రీలాన్సింగ్‌ అంటే.. జర్నలిజం, రైటింగ్, ఆర్ట్స్‌ రంగాల్లోనే కనిపించేది. కానీ.. గత రెండేళ్లుగా వెంటాడుతున్న కోవిడ్‌ మహమ్మారి కారణంగా.. ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్‌ సంస్కృతి దాదాపు అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది.

ఐటీ నుంచి ఉత్పత్తి వరకు
గత రెండేళ్లుగా ఫ్రీలాన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఐటీ మొదలు ఉత్పత్తి రంగం వరకూ.. ఫ్రీలాన్స్‌ విధానంలో నియామకాలు పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ వంటి కీలక విభాగాల్లో సైతం ఫ్రీలాన్స్‌ విధానంలో కన్సల్టెంట్ల పేరుతో సంస్థలు నిపుణులను నియమించుకుంటున్నాయి. ఉత్పత్తి రంగంలో.. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ డిజైన్‌ వంటి కీలక విభాగాల్లో ఫ్రీలాన్స్‌ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ జరుగుతోంది.

పెరుగుతున్న అన్వేషణ
ఫ్రీలాన్సింగ్‌కు అవసరమైన నిపుణులైన అభ్యర్థుల కోసం సంస్థల అన్వేషణ కూడా పెరుగుతోంది. ఆయా సంస్థల నివేదికల ప్రకారం–2021 చివరికి ఫ్రీలాన్సింగ్, ప్రాజెక్ట్‌ ఆధారిత వర్క్‌ విధానంలో నియామకాల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 75 శాతం పెరగడం గమనార్హం.


చదవండి: Job Trends: కొత్త సంవత్సరంలో.. భరోసానిచ్చే కొలువులివే!

ఉద్యోగార్థుల ఫ్రీలాన్స్‌ బాట
తాజా ట్రెండ్స్‌ను పరిశీలిస్తే..ఉద్యోగార్థులు సైతం ఫ్రీలాన్స్‌ విధానంలో పని చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది.ఆయా స్టాఫింగ్‌ సంస్థలు దాదాపు 40 శాతం మంది యువత ఫ్రీలాన్స్‌ అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొనడం విశేషం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు నిలుస్తున్నాయి. అవి.. సొంతంగా పని చేయాలనే ఆసక్తి మొదటిది కాగా.. నచ్చిన సమయంలో పనిచేసే వెసులుబాటు ఉండటం రెండో కారణంగా కనిపిస్తోంది. పని అనుభవం సొంతం చేసుకున్న మిడ్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా పిలిచే 40–45ఏళ్ల వయసు వారు సైతం ఫ్రీలాన్స్‌ వర్కింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. 

ఇకపైనా.. ఇదే పంథా
ఇప్పటికే గిగ్‌ వర్కింగ్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, హైబ్రీడ్‌ వర్కింగ్‌ విధానాలను అమలు చేస్తున్న సంస్థలు.. ఫ్రీలాన్సింగ్‌ నియామకాల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీపుల్‌స్ట్రాంగ్, ఇండీడ్‌ వంటి సంస్థల అంచనాల ప్రకారం–రానున్న రోజుల్లో ఆయా సంస్థల్లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం మంది ఫ్రీలాన్స్‌ ఉద్యోగులే ఉంటారు. దీనికి కంపెనీల ఆలోచనల్లో మార్పే కారణమని చెబుతున్నారు. 

టాప్‌ సెక్టార్స్‌ ఇవే
ఫ్రీలాన్స్‌ నియామకాల విషయంలో.. ఈ –కామర్స్, ఐటీ, ఐటీఈఎస్, హాస్పిటాలిటీ, రిటైల్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్‌ సర్వీసెస్, కన్సల్టింగ్‌ విభాగాలు ముందంజలో ఉంటున్నాయి.

డిమాండింగ్‌ జాబ్స్‌ ఇవే
ఫ్రీలాన్సింగ్‌ విధానంలో.. ఆన్‌లైన్‌ కాపీ రైటర్స్, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం స్పెషలిస్ట్‌ వంటి ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. వీటితోపాటు హెల్త్‌కేర్‌ రంగంలో.. టెలి మెడిసిన్‌ నిపుణులు, ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో ఆన్‌లైన్‌ ట్యూటర్స్, సబ్జెక్ట్‌ రైటర్స్, హాస్పిటాలిటీ విభాగంలో కస్టమర్‌ సర్వీస్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్‌లో సైతం
తాజా పరిస్థితులæదృష్ట్యా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సైతం ఫ్రీలాన్స్‌ నియామకాలకు మొగ్గు చూపుతుండటం విశేషం. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్‌లో నిపుణులను ఫ్రీలాన్స్‌ విధానంలో రిక్రూట్‌ చేసుకునేందుకు ఐటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తమకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ రూపకల్పన, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఫ్రీలాన్స్‌ నిపుణులపై దృష్టిపెడుతున్నాయి. ఫలితంగా ఇటీవల కాలంలో ఐటీ రంగంలో ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలు లభిస్తున్నట్లు ఆయా సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

తీరు మారుతోంది
తాజా పరిస్థితులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్‌ తీరు కూడా మారుతోంది. అనుభవం గడించిన వారు సొంతంగా కార్యాలయాలు నెలకొల్పి.. ఆన్‌లైన్‌ విధానంలో.. ఆయా రంగంలోని సంస్థలకు అవసరమైన సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేపీఓ, బీపీఓ, హెచ్‌ఆర్‌ అనలిస్ట్‌లు, ఏఐ నిపుణులు.. ఇలా సేవలందించడానికి ముందుకొస్తున్నారు. సదరు రంగాలకు చెందిన సంస్థలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలకు లేదా సలహాలు కోరిన సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సమస్య తీవ్రత ఆధారంగా ఆదాయం పొందుతున్నారు.

చదవండి: Demanding‌ Job ‌Profiles‌: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం​​​​​​​

ఊతమిస్తున్న స్టార్టప్‌ సంస్కృతి
దేశంలో పెరుగుతున్న స్టార్టప్‌ సంస్కృతి కూడా ఫ్రీలాన్స్‌ అవకాశాలు విస్తృతమవడానికి దోహదపడుతోంది. కొత్త ఆలోచనలతో సొంత సంస్థలను నెలకొల్పిన యువత.. శాశ్వత ప్రాతిపదికన అధిక వేతనాలు ఇచ్చి ఉద్యోగులను నియమించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారు ఫ్రీలాన్స్‌ నియామకాలు చేపడుతున్నారు. ఈ ధోరణి ప్రధానంగా ఈ–కామర్స్, ఎడ్‌టెక్‌ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

నైపుణ్యాలు, జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్రీలాన్స్‌ నియామకాలు విస్తృతమవుతూ..యువత సైతం వాటివైపు మొగ్గుచూపుతున్న తరుణంలో.. ఈ అవకాశాలను కోరుకునే వారు పలు అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తమ డొమైన్‌లో అప్‌–స్కిల్లింగ్,రీ– స్కిల్లింగ్‌ వంటి వాటిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని పేర్కొంటున్నారు. ఫ్రీలాన్సింగ్‌ విధుల నిర్వహణకు సంబంధించి తాము పనిచేసే ప్రదేశం,సాంకేతిక సదుపాయాల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

ఐటీలో నైపుణ్యాల ఆవశ్యకత
ఐటీ రంగంలో ఫ్రీలాన్స్‌ విధానంలో పని చేసే వారు నైపుణ్యాల పరంగా ముందుచూపుతో వ్యవహరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. రీ–స్కిల్లింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఐటీ రంగంలో ప్రధానంగా డేటాఅనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బిజినెస్‌ ప్లానింగ్, మార్కెట్‌ ఎంట్రీ స్ట్రాటజీ, శాప్‌ ఇంప్లిమెంటేషన్, డేటాఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలున్న వారికి సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి.

ఫ్రీలాన్సింగ్‌.. జాగ్రత్తలు

  • సంస్థకు సంబంధించి తమకు కేటాయించిన పనిని పర్యవేక్షించే అధికారులతో.. అదే విధంగా సదరు టీమ్‌తో అనుసంధానమయ్యే మార్గాలు ఏర్పరచుకోవాలి. 
  • ఇంట్లోనే ఆఫీస్‌ వాతావరణం తలపించేలా ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. 
  • ప్రాజెక్ట్‌ పూర్తిచేసేందుకు అవసరమైన టెక్నికల్, ఇతర టూల్స్‌ నిరంతరాయంగా పని చేసేలా చూసుకోవాలి. 
  • ఫ్రీలాన్స్‌ విధానంలో పని చేస్తున్నప్పటికీ.. స్వీయ సమయ పాలన నిబంధనలు పాటించాలి. 
  • ప్రాజెక్ట్‌ బేస్డ్‌ వర్క్‌ చేసే వారు ఒక టాస్క్‌ను చేపట్టేముందే దానికి సంబంధించిన డెడ్‌లైన్, ఇతర నిబంధనల గురించి తెలుసుకోవాలి. 
  • పని చేస్తున్నప్పుడు సందేహం తలెత్తితే.. వెంటనే సీనియర్లు లేదా సహచర టీమ్‌ మెంబర్లను ఆన్‌లైన్‌లో సంప్రదించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. 

ఫ్రీలాన్సింగ్‌.. ముఖ్యాంశాలు

  • ఫ్రీలాన్సింగ్‌ నియామకాల్లో ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా భారత్‌.
  • స్టాఫింగ్‌ సంస్థల అంచనా ప్రకారం–2021 చివరికి ఫ్రీలాన్స్, ప్రాజెక్ట్‌ బేస్డ్‌ నియామకాల సంఖ్యలో 75 శాతం పెరుగుదల.
  • వచ్చే రెండు, మూడేళ్లలో ఆయా సంస్థల్లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం పూర్తిగా ఫ్రీలాన్స్‌ విధానంలోనే ఉంటారని అంచనా.
  • ఫ్రీలాన్స్‌ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య 40 శాతానికి పెరిగింది.
  • టాప్‌ సెక్టార్స్‌గా నిలుస్తున్న ఐటీ, ఈ–కామర్స్, ఎడ్‌–టెక్, హాస్పిటాలిటీ, రిటెయిల్‌.

కొనసాగే విధానం
ఫ్రీలాన్స్‌ విధానంలో నియామకాల ట్రెండ్‌ రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా టైర్‌–2, టైర్‌–3 నగరాల్లో ఈ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. రానున్న రోజుల్లో ఒకే టెక్నాలజీతో ఏళ్ల తరబడి పని చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలున్న వారిని అన్వేషించి నియమించుకోవడం సంస్థలకు కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఫ్రీలాన్స్‌ నియామకాలు పెరుగుతాయి. 
–శ్రీధర్, టాలెంట్‌ స్రింట్‌

చదవండి: Career Counselling Centres: ఇలాంటి విద్యార్థులకు మేలు చేసే కౌన్సెలింగ్‌!​​​​​​​

Published date : 06 Apr 2022 06:36PM

Photo Stories