Skip to main content

TSPSC Group1 Guidance: విజేతగా నిలవాలంటే.. 60 రోజుల ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి!!

group 1 notification released, preparation tips and Prelims, Mains‌ guidance
group 1 notification released, preparation tips and Prelims, Mains‌ guidance

రాష్ట్ర స్థాయిలో ఉన్నత సర్వీసుల్లో చేరేందుకు మార్గం... గ్రూప్‌–1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి భారీగా గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 18 విభాగాల్లో మొత్తం 503 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మే 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్వ్యూల రద్దుతో రెండంచెల(ప్రిలిమ్స్, మెయిన్స్‌) విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్‌–1లో విజేతగా నిలవాలంటే.. నిబద్ధత, పట్టుదలతోపాటు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1 పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్షల స్వరూపం, ప్రిపరేషన్‌ వ్యూహాలపై ప్రత్యేక కథనం...

మొత్తం పోస్టులు: 503

  • పోస్టుల వివరాలు: డిప్యూటీ కలెక్టర్‌: 42; డీఎస్పీ: 91; కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌: 48; రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌: 4; జిల్లా పంచాయతీ అధికారి: 5; జిల్లా రిజిస్ట్రార్‌: 5; డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌): 2; అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌: 8; అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌: 26; మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2): 41; అసిస్టెంట్‌ డైరెక్టర్‌(సాంఘిక సంక్షేమం): 3; జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(బీసీ సంక్షేమం): 5; జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(గిరిజన సంక్షేమం): 2; జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌: 2; అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్య,ఆరోగ్య శాఖ): 20; అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌: 38; అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌: 40; ఎంపీడీవో (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి): 121.

అర్హతలు

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు మెకానికల్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ లేదా తత్సమాన కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులకు కామర్స్, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిఫాం పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.

వయో పరిమితి

డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ యూనిఫాం పోస్టులకు వయోపరిమితి 21 నుంచి 31 సంవత్సరాలు. ఇతర ఉద్యోగాలకు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు లభిస్తుంది. 

దరఖాస్తు విధానం

గ్రూప్‌–1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) చేసుకోవాలి. ఇదివరకే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. గ్రూప్‌–1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం

గ్రూప్‌–1లో ఇంటర్వ్యూల తొలగింపుతో పరీక్షలను ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలుగా రెండంచెల్లో నిర్వహించనున్నారు. 

చ‌ద‌వండి: TSPSC Practice Test

ప్రిలిమినరీ పరీక్ష

దీనిలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ప్రిలిమినరీ అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులకు మెయిన్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. 

మెయిన్‌ రాత పరీక్ష

దీనిలో జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పరీక్షతోపాటు పేపర్‌–1(జనరల్‌ ఎస్సే),పేపర్‌–2(హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ), పేపర్‌–3(భారత సమాజం, రాజ్యాంగం, పాలన), పేపర్‌–4(ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌), పేపర్‌–5(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), పేపర్‌–6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) అనే మరో ఆరు పేపర్లుంటాయి. ఒక్కో పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు, ప్రతి పరీక్ష మార్కులు 150. జనరల్‌ ఇంగ్లిష్‌ పదోతరగతి స్థాయిలో ఉంటుంది. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ముద్రించిన ప్రశ్నపత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్‌ ప్రశ్నపత్రం (ఇ–క్వశ్చన్‌ పేపర్‌)ను ప్రవేశ పెట్టనున్నారు.

ఎంపిక విధానం

గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో కనీసం 40 శాతం(బీసీ అభ్యర్థులు 35 శాతం,ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులు 30శాతం) మార్కులు సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. తర్వాత దశలో ఆయా అభ్యర్థులకు మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అర్హతలకు అనుగుణంగా శాఖల్లో పోస్టింగ్‌ ఇస్తారు. 

చ‌ద‌వండి: TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్‌ 1

ప్రిలిమినరీ ప్రిపరేషన్‌

  • అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ సిలబస్‌కు సంబంధించి సరైన మెటీరియల్‌ లేదా పుస్తకాలను గుర్తించాలి. సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని కాన్సెప్ట్‌ ఆధారంగా చదవాలి. 
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ సిలబస్‌లో పేర్కొన్న కరెంట్‌ అఫైర్స్‌–ప్రాంతీయ, జాతీయ,అంతర్జాతీయ అంశాలు,అంతర్జాతీయ సంబంధాలు, ఈవెంట్స్‌ ఎంతో కీలకం. గత ఆర్నెల్లలో చోటుచేసుకున్న పరిణామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ..గత ఏడాది కరెంట్‌ అఫైర్స్‌ను క్షుణ్నంగా చదివితే సులభంగా స్కోర్‌ చేయొచ్చు.
  • జనరల్‌ సైన్స్‌లో భాగంగా ఆధునిక ఆవిష్కరణలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో దేశం సాధించిన విజయాలపై శ్రద్ధ చూపాలి.
  • పర్యావరణ అంశాల విషయంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యమైనది. విపత్తుల నిర్వహణ, వాటి నివారణ, ఉపశమన వ్యూహాలను చదవాలి. 
  • ఎకానమీ, సామాజిక అభివృద్ధి విషయంలో ఇటీవలి తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదికలను చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
  • ప్రపంచ, భారతదేశ, తెలంగాణ జాగ్రఫీలో భాగంగా నేలలు, నదులు, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, అడవులు, ప్రాజెక్టులు, పంటల తీరు, ఖనిజ వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి. 
  • భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంను సమగ్రంగా చదవాలి. 
  • భారతదేశ రాజ్యాంగం, పాలిటీలో భాగంగా రాజ్యాంగం స్వరూపం, లక్షణాలు, సవరణలు, ప్రాథమిక హక్కులు, శాసన అధికారాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు తీరు–పని విధానం, స్థానిక సంస్థలు, సంక్షేమ యంత్రాంగంపై పట్టు పెంచుకోవాలి.
  • దేశంలో పాలన, ప్రభుత్వ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను క్షుణ్నంగా చదవాలి. 
  • రాష్ట్రానికి సంబంధించిన సామాజిక అంశాలు, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 
  • లింగ, కులం, ట్రైబ్‌ తదితర అంశాల్లో సామాజిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • లాజికల్‌ రీజనింగ్‌లో అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించిన సగటు, నిష్పత్తి, శాతాలు, నంబర్‌ సిరీస్, కోడింగ్‌–డీకోడింగ్, శాతాలు, కాలం–వేగం, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్‌ సమస్యలను సాధన చేయాలి.

చ‌ద‌వండి: APPSC/TSPSC: గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం... పట్టు సాధించండిలా!

మెయిన్స్‌ స్వరూపం

  • పేపర్‌–1(జనరల్‌ ఎస్సే): దీనిలో మూడు సెక్షన్లలో మూడు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో ఒక్కో ప్రశ్నను ఎంచుకుని అభ్యర్థులు మొత్తం మూడు ఎస్సేలు రాయాలి. ఒక్కో ఎస్సేకు 50 మార్కులు. సెక్షన్‌–1లో సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, న్యాయ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌–2లో దేశ రాజకీయాలు, భారతదేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్‌–3లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్య, మానవ వనరుల అభివృద్ధిపై ప్రశ్నలు అడుగుతారు. కరెంట్‌ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టిసారించడం, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలను నిశితంగా పరిశీలించడం ద్వారా ప్రస్తుత సమస్యలను పరిశీలిస్తూ.. ప్రతిరోజు పేపర్, టీవీలో వచ్చే వార్తల ద్వారా నాలెడ్జ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి.
  • పేపర్‌–2(హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ)లో భారతదేశ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, భారతదేశ, తెలంగాణ భౌగోళిక శాస్త్రంపై ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌–3(భారత సమాజం, రాజ్యాంగం, పాలన)లో భారతీయ సమాజం, నిర్మాణం, సమస్యలు, సామాజిక ఉద్యమాలు, భారత రాజ్యాంగం, పాలనపై ప్రశ్నలు ఇస్తారు. 
  • పేపర్‌–4(ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌)లో ఇండియన్‌ ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి, పర్యావరణ సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి. 
  • పేపర్‌–5(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌)లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, ప్రభావం, శాస్త్ర పరిజ్ఞానం అనువర్తనాల్లో ఆధునిక పోకడలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ ప్రాబ్లం సాల్వింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు. 
  • పేపర్‌–6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం)లో తెలంగాణ భావన (1948–1970), సమీకరణ దశ(1971–1990), తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ(1991–2014)పై ప్రశ్నలు ఇస్తారు. 

పరీక్ష తేదీలు

  • ప్రిలిమ్స్‌: జూలై లేదా ఆగస్టు
  • మెయిన్స్‌: నవంబర్‌ లేదా డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. 

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

60 రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలి

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహించనున్నారు కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయాలి. మే/జూన్‌లోగా అన్ని అంశాలను చదివేలా 60 రోజుల ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి. తర్వాత సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో ఒకేవిధమైన వాటిని కలిపి చదవాలి. ఉదాహరణకు కరెంట్‌ అఫైర్స్‌ చదివేటప్పుడు సిలబస్‌లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర విధానాలు; గవర్నెన్స్, పబ్లిక్‌ పాలసీ; అంతర్జాతీయ సంబంధాలు, ఈవెంట్స్‌ను కూడా కలిపి చదవాలి. అలాగే సోషల్‌ ఎక్స్‌క్లూషన్‌ సబ్జెక్టులో మహిⶠలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలూ ఉంటాయి కాబట్టి భారత రాజ్యాంగం, పాలిటీని దీంతో కలిపి చదవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, జాగ్రఫీ అంశాలను ఒక విభాగంగా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలను మరో విభాగంగా చదవాలి. అలాగే పర్యావరణం, విపత్తు నిర్వహణ, జాగ్రఫీని ఒక విభాగంగా, భారతదేశ చరిత్రను తెలంగాణ సంస్కృతి, చరిత్రతో మరో విభాగంగా కలిపి చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌కు అనుసంధానిస్తూ చదవాలి. సిలబస్‌లో అత్యధిక స్కోరింగ్‌ ఏరియా–లాజికల్‌ రీజనింగ్‌. దీన్ని అశ్రద్ధ చేయకుండా ఏకాగ్రతతో చదవాలి. అభ్యర్థులు రోజూ 10 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అన్ని విభాగాలను ప్రతిరోజూ చదివేలా జాగ్రత్త వహించాలి. ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించి, ప్రతి విభాగానికి మధ్యలో అవసరమైన విరామం తీసుకుంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
–కృష్ణ ప్రదీప్, సబ్జెక్టు నిపుణులు

ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌ చదవాలి

గ్రూప్‌–1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలతోపాటే మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాలను కలిపి చదవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో.. అంతరిక్ష కార్యక్రమాలు, రక్షణ, శక్తి వనరులు, ఐటీ కార్యక్రమాలు, ఎమర్జింగ్‌ టెక్నాలజీలు, టెక్నాలజీ మిషన్స్‌ వంటి అంశాలు మెయిన్స్‌ పేపర్‌–5లో ఉన్నాయి. వీటిని మెయిన్స్‌ స్థాయి ప్రిపరేషన్‌లో చదువుకోవడం ద్వారా ప్రిలిమ్స్‌లో వీటికి సులభంగా సమాధానాలు గుర్తించగలుగుతారు. అదేవిధంగా మెయిన్స్‌లో శీతోష్ణస్థితిలో మార్పు, ప్రపంచ పర్యావరణ అంశాలు, కాలుష్యం సుస్థిరాభివృద్ధి, ఒప్పందాలు, సహజ వనరులు వంటి అంశాలున్నాయి. వీటికి ప్రిలిమ్స్‌లోనూ ప్రాధాన్యత ఉంది. అభ్యర్థులు బిట్స్‌ తరహాలో చదవకుండా ప్రతి అంశానికి సంబంధించిన మూల భావనలతోపాటు వాటికి సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌పై దృష్టి సారించాలి. ప్రిలిమ్స్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం,విపత్తు నిర్వహణ అంశాలపై 35–40 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 
– ఇ.హరికృష్ణ, సబ్జెక్టు నిపుణులు


కష్టపడితే విజేతలుగా నిలవచ్చు!

గ్రూప్‌–1కు ప్రిపేరయ్యే అభ్యర్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షకు ఎన్ని రోజులు సమయం ఉంది? సిలబస్‌లో పేర్కొన్న ఏ అంశాల్లో బలంగా, బలహీనంగా ఉన్నారో అంచనా వేసుకోవాలి. సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకోవాలి. ఒక సబ్జెక్టును ఎన్ని రోజులు చదవాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. అది నిత్యం కళ్లముందు కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనుగుణంగా స్థిరంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. నిర్ణీత సమయంలో వాటిని పూర్తిచేయాలి. క్లిష్టమైన అంశాలు ఎక్కువ సమయం తీసుకున్నా, సులువైన అంశాలు చదివేటప్పుడు సమాయాన్ని ఆదా చేసుకోవాలి. చదివిన అంశాలపై ఎప్పటికప్పుడు బిట్స్‌ను సాధనచేయాలి. ఫలితాలను విశ్లేషించుకుని ప్రిపరేషన్‌ సరైన మార్గంలో సాగుతుందో తెలుసుకోవాలి. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో గమనించాలి. రెండు నెలల్లో సిలబస్‌ అంశాలను పూర్తిగా చదివి జూలై నెలలో రివిజన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తి నిబద్ధతతో, కష్టపడి చదివితే కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించేవారూ విజేతలుగా నిలవచ్చు. అందుకు నేనే ఒక ఉదాహరణ. మే నెలలో పరీక్షలుండగా నేను మార్చిలో బేసిక్స్‌ నుంచి ప్రిపరేషన్‌ ప్రారంభించాను. శిక్షణలో చెప్పిన అంశాలను ఇంటి వద్ద క్రమం తప్పకుండా సాధన చేశాను. కాబట్టి అభ్యర్థులు 503 పోస్టుల్లో ఒక పోస్టు తమదే అనుకుని ఆత్మవిశ్వాసంతో చదవాలి. ఇప్పటికే ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నవారు, సివిల్స్‌ ఆశావహులు తెలంగాణ చరిత్ర,సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎకానమీ అంశాలపై దృష్టి సారించాలి.
–వి.ప్రశాంతి, గత గ్రూప్‌–1 విజేత
(ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.)


​​​​​​​చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

Published date : 02 May 2022 06:01PM

Photo Stories