Skip to main content

NCTE: ఒకసారి రాస్తే చాలు.. సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లుబాటు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు–టెట్‌)ను ఇకపై అభ్యర్థులు ఒక్కసారి రాసి ఉత్తీర్ణులైతే చాలు.. స్కోరు పెంపునకు మినహా మళ్లీమళ్లీ రాయాల్సిన అవసరంలేదు.
NCTE
ఒకసారి రాస్తే చాలు.. సర్టిఫికెట్‌కు జీవితకాల చెల్లుబాటు

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) కొత్త నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. దీని ప్రకారం అభ్యర్థులు ఒకసారి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇక DSCకి అర్హులైనట్లే. TETలో ఉత్తీర్ణత ధ్రువపత్రాల చెల్లుబాటును NCTE జీవితకాలానికి పెంచిన నేపథ్యంలో అభ్యర్థులకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఎన్సీటీఈ కొత్త నిబంధనల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా టెట్‌ను 2022 ఆగస్టులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌ 16 నుంచి టెట్‌–ఆగస్టు 2022కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. జులై 16 వరకు వీటిని స్వీకరిస్తారు. గతంలోని TETలకు రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి (NCERT) రూపొందించిన సిలబస్‌ను అమలుచేయగా ఈసారి పూర్తిగా ఎన్సీటీఈ సిలబస్‌లోనే పరీక్షల నిర్వహణ జరగనుంది.

చదవండి: 

వేర్వేరుగా టెట్‌ అర్హత నిబంధనలు

టెట్‌ అర్హత నిబంధనలను రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వాటి ప్రకారం..

  • ఉపాధ్యాయ అర్హత పరీక్ష నాలుగు పేపర్ల కింద (పేపర్‌–1ఏ, పేపర్‌–1బీ, పేపర్‌–2ఏ, పేపర్‌–2బీ) నిర్వహించనున్నారు.
  • 1–5 తరగతులకు సంబంధించి రెగ్యులర్‌ టీచర్లకు పేపర్‌–1ఏ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు పేపర్‌–1బీని అభ్యర్థులు రాయాలి.
  • ఇక 6–8 తరగతుల రెగ్యులర్‌ టీచర్లకు పేపర్‌–2ఏ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు పేపర్‌–2బీ పరీక్షను రాయాలి.
  • 2010 తరువాత ఇంటర్మీడియెట్‌ రాసిన అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి.
  • అదే 2002 నుంచి 2010లోపు ఇంటర్మీడియెట్‌ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది.
  • ఇది కేవలం ఇంటర్‌–డీఈడీ అర్హతల వారికి మాత్రమే వర్తిస్తుంది. అదే డిగ్రీ–బీఈడీ చేసిన అభ్యర్థులకు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందే.
  • పేపర్‌–1ఏకు 8 రకాల క్వాలిఫికేషన్‌ అంశాలను కూడా ఏపీటెట్‌లో పొందుపరిచారు.
  • ఇంటర్మీడియెట్, డీఎడ్, డిగ్రీ, పీజీ బీఈడీల కాంబినేషన్లలో ఈ అర్హతలున్న వారు టెట్‌ను రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
  • అలాగే.. పేపర్‌–1బీకి 10 రకాల కాంబినేషన్లలో అర్హతలను టెట్‌లో ప్రకటించారు.
  • పేపర్‌–2ఏ, పేపర్‌–2బీలలో కూడా వేర్వేరు అర్హతా ప్రమాణాలను పొందుపరిచారు.

టెట్‌ అర్హత మార్కులు యథాతథం

టెట్‌ అర్హత మార్కుల్లో ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు గతంలోని నిబంధనలనే యథాతథంగా కొనసాగిస్తారు. జనరల్‌ కేటగిరీలోని వారికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. వారినే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వీరికిచ్చే ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత మళ్లీ టెట్‌ రాసి అర్హత సాధించాల్సి వచ్చేది. అయితే, గత ఏడాదిలో ఎన్సీటీఈ ఈ నిబంధనను మార్చి టెట్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటును జీవితకాలానికి పెంచింది. దీంతో అభ్యర్థులు ఒకసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఆ తదుపరి డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా దరఖాస్తు చేసేందుకు అర్హులే. అయితే, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున అభ్యర్థులు టెట్‌లో పాల్గొని తమ స్కోరును పెంచుకోవచ్చు.

ఆగస్టు 6 నుంచి పరీక్షలు.. సెప్టెంబర్‌ 14న ఫలితాలు

ఇక టెట్‌ పరీక్షలను ఆగస్టు 6 నుంచి ప్రారంభించేలా పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 21 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉ.9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 14న ప్రకటిస్తారు.

Published date : 21 Jun 2022 02:05PM

Photo Stories