Skip to main content

Inspirational Story: పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది: శ్రీవాస్తవ

అల్లంత దూరన సన్నని తీగపై అటు ఇటూ పట్టు తప్పకుండా నడుస్తున్న పాదాలు.. తీగపై నడక ఆగిపోగానే డబ్బులు ఏరుకుంటున్న ఆటగాళ్లను చూసి ఆమె ఓ కల కన్నది. ‘నాకు రెండు చేతులు లేకపోతేనేం... పాదమే చేయిగా మారదా’ అనుకుంది. పట్టుబట్టింది. సాధన చేసింది. పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలో ఉంటున్న కామిని శ్రీవాస్తవ.
Inspirational Story
పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది: శ్రీవాస్తవ

కాళ్లతో రాయడం మొదలుపెట్టినప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను మెచ్చుకుంది. జీవితాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటో చూపాక ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ అందుకుంది కామిని శ్రీవాస్తవ. నాలుగేళ్ల వయసులో రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న శ్రీవాస్తవకు ముందున్న జీవితం గురించి ఆప్పుడేమీ తెలియదు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. తల్లిదండ్రికి గారాబు తనయ. తండ్రి రైల్వేలో డ్రైవర్‌. ఓ రోజు మారాం చేస్తే తనతో పాటు డ్యూటీకి తీసుకెళ్లాడు. కానీ, అనుకోకుండా అక్కడ జరిగిన ప్రమాదంలో రెండు చేతులు, ఎడమపాదం ఐదు వేళ్లూ తెగిపోయాయి. అయితేనేం మొక్కవోని ఆమె ధైర్యం ఉన్నతశిఖరాలను చేర్చిన విధానం ఇలా వివరిస్తుంది.. ‘‘ఆ సమయంలో జీవితం ఏంటి అనే పెద్ద విషయాలు ఏమీ తెలియవు. కానీ, అందరిమాదిరిగా నాకు చేతులు లేవు. ఏ పనీ చేయలేకపోతున్నాను. నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు ఇదే బాధ. చేతులు లేకుంటే ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడాల్సిందే. కొన్నాళ్లు డిప్రెషన్‌ నన్ను కమ్మేసింది. ఎవరితోనూ మాట్లాడకుండా రోజుల తరబడి గడిపాను.

ఆలోచనలో పడేసిన సందర్భాలు..

ఓ రోజు మార్కెట్‌కు వెళుతున్నప్పుడు ఒక దగ్గర రెండు పోల్స్‌పైన కట్టిన సన్నని తీగపై ఒక అమ్మాయి అటూ ఇటూ నడవడం చూశా. చుట్టూ జనాలు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ‘కాళ్లు అంత శక్తిమంతమైనవా!’ అనుకున్నాను. అదే విషయం మా నాన్నను అడిగాను. మా నాన్న ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్‌. అతను కూడా సన్నని తాడు మీద నడిచి చూపించాడు. సంకల్పం ఉంటే ఏమైనా చేయచ్చు అని కళ్లకు కట్టాడు. అప్పటి నుంచి కాళ్లతో పనులు చేయడం నేర్చుకున్నాను. అక్షరాలు రాయడం సాధన చేశాను. ఈ విషయంలో ఒక పోరాటయోధురాలిగా మారిపోయాను. చేతులు మినహా నా శరీరం అంతా బాగుందని నేను అంగీకరించాను. అసలు చేతులు అనేవి పుట్టుకతోనే లేకపోతే... అనే ఆలోచన వచ్చాక ఏ పనైనా అవలీలగా చేయగలను అనిపించింది.

పనిలో పదోన్నతులు..

డిగ్రీ చేశాక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టాను. అందులో.. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ అండ్‌ నూట్రిషన్‌ విభాగంలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆ విభాగంలోనే మరికొన్నాళ్లకు ఆఫీసర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. ఉద్యోగంతో పాటు ఎకనామిక్స్, సోషియాలజీలో ఎంఏ చేశాను. ఇందిరా మహిళా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ స్కీమ్‌ కింద అధ్యయన బృందంలో సభ్యురాలిగా ఇండోనేషియాకు వెళ్లొచ్చాను. 

కుటుంబం.. అవార్డులు..

నాకు అడుగడుగునా అండగా నిలిచే భర్త లభించాడు. ఇరవై ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఉమ్మడి కుటుంబంలోనే మా జీవనం ఆనందంగా సాగిపోయింది. అత్తమామలు, ఆడపడచులు.. అందరూ నన్ను బాగాచూసుకున్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నా రచనలు దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియోలో కూడా ప్రసారం చేయబడ్డాయి. అనేక వార్తాపత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను. కవితా సంకలనాలు రాశాను. వాటిలో ‘ఖిల్తే ఫూల్‌ మెహక్తా అంగన్‌’, ‘డోర్‌’ కథా సంకలనం, భారతరత్న ఇందిర, అస్మాప్త రహీన్‌’నవలలు ప్రచురించబడ్డాయి. ఎన్నో సత్కారాలు అందుకున్నాను. నా ఉద్యోగం, అభిరుచి రెండింటికీ సమాన ప్రాముఖ్యతను ఇచ్చాను. దీని ఫలితంగా 1994లో మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్‌ శర్మచే జాతీయ అవార్డు, ఆ తర్వాత ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. సాహిత్యరంగంలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. నా పట్టుదల, శ్రమ అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని అనేవారు.

నమ్మకమే మనం..

ఈ రోజు నేను ఈ దశకు చేరుకున్నాన ంటే నా చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయసహకారాల వల్లనే అనుకుంటాను. ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాసి, ప్రచురించాను. ప్రతిరోజూ నా రచనను సోషల్‌ మీడియా మాధ్యమంగా పంచుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడు వికలాంగురాలిని అనుకోలేద’’ని ఒక్కో మెట్టును అధిగమించిన విధానాన్ని కళ్లకు కడతారు శ్రీవాస్తవ.

srivasthava
ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడూ వికలాంగురాలిని అనుకోలేదు.
– శ్రీవాస్తవ 

చదవండి:

Twitter: సీఈవోగా.. మనోడే!.. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి..

ఈ తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు...సాధించారిలా..

Published date : 18 Jan 2022 06:31PM

Photo Stories