TREI-RB: గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’!
వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భావించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు మే 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి.
చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..
‘దరఖాస్తు’కే చుక్కెదురు..
సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను తెరవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
చదవండి: TS Inter Results: గురుకులాలు భేష్.. ప్రభుత్వ కాలేజీలు డౌన్.. సొసైటీల వారీగా ఉత్తీర్ణత శాతం ఇలా
కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్‌నంబర్, ఈ–మెయిల్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి.
చదవండి: TS Gurukulam Jobs 2023 Online Exams : ఇకపై.. గురుకుల ఉద్యోగాల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే.. కానీ..?
వారం పట్టింది
గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది.
– డి.నర్సింగ్‌రావు, కొడంగల్, వికారాబాద్ జిల్లా
ఓటీఆర్ నమోదు కాక దరఖాస్తుకు దూరమయ్యాను
ఓటీఆర్ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి.
– చీపురు ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా